ఓ పార్టీ లాభం కోసం చేస్తున్న ప్రక్రియ
ఇజ్రాయిల్, సౌత్ ఆఫ్రికా నమూనాను తెరపైకి తెచ్చే కుట్ర
మారిపోనున్న భారతీయ రాజకీయ స్వరూపం
నోటీసులివ్వకుండానే ఒక వర్గం ఓట్ల తొలగింపు
ఈ విధ్వంసాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి : పౌరసమాజానికి వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”రక్తపాతం లేని రాజకీయ నరమేధం”.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”సర్-సిటిజన్ ఓటింగ్ రైట్స్” అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు కామేశ్‌బాబు అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.రజని మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ 354, 357 ప్రకారం ఓటును తొలగించే క్రమంలో అతనికి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపారు. కాని నేడు ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఓట్లను విచ్చలవిడిగా తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ”రాజకీయం.. సమాజంలోని ప్రతి అంశాన్ని నిర్దేశిస్తుంది. ఆ రాజకీయాన్ని నిర్దేశించేంది మాత్రం.. ఓటు” అని ఆమె నొక్కిచెప్పారు.
దేశ పౌరుడిగా గుర్తింపునిచ్చే ఓటు ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో యూరప్ లాంటి దేశాల్లో కొన్ని వర్గాలను దేశం నుంచి తరిమేయడమో లేదా చంపేయడమో చేశారని అన్నారు. భారత్‌లో అలాంటి చర్యలు కుదరకపోవడంతో పొలిటికల్ సొసైటీ సభ్యులుగా ఉండకూడదనుకున్న వారి పౌరసత్వాన్ని చంపేందుకు ‘సర్’తో ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం గతంలో షిప్టెడ్, ఆబ్సెంట్, డెడ్, డూప్లికేట్ (ఎస్‌ఏడీడీ) పేరుతో ఓట్లను తొలిగించే ప్రక్రియ స్థానంలో తెచ్చిన ‘సర్’ ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బీహర్‌లో జరిగిన సర్‌తో వారి కుట్ర తేటతెల్లమైందని స్పష్టం చేశారు. బీహార్‌లో మొత్తం 8.22 కోట్ల ఓట్లకు.. దాదాపు 80 లక్షలను తొలగించారని గుర్తు చేశారు. ఇందులో 33 శాతం ఒక వర్గం వారే ఉన్నారని వెల్లడించారు.
”విదేశీయులుగా ఎన్నికల సంఘం గుర్తించిన 3.75 లక్షల మందిని పరిశీలిస్తే 1,087 మంది మాత్రమే అనుమానితులుగా తేలారు. అందులో 390 మందిని ఫైనల్‌గా గుర్తించారు. అందులో ముస్లింలు 76 మందిగా తేలింది. వారిలో నలుగురిని ఈ కోవలో గుర్తించారు. ఇద్దరు చనిపోగా ఇద్దరు మాత్రమే అక్రమంగా దేశంలో ఉంటున్నారని తేలింది. ఇక ఓట్ల చేర్పుల్లోనూ ఎన్నికల సంఘం అనేక అక్రమాలకు పాల్పడుతోంది. బీహర్‌లోని ఓ ఇంట్లో 509, మరో ఇంట్లో 409 మంది ఓటర్లున్నారని తుది జాబితాలో పేర్కొంది. అయితే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్కడ ఇండ్లే లేవని తేలింది” అని సర్ పేరుతో బీహర్‌లో ఈసీ చేసిన తప్పిదాలను ఆయన వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలనేది ఓటర్లు నిర్ణయించేవారని.. నేడు ఓటర్లు ఎవరుండాలనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయని విమర్శించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 2.93 కోట్లు, తమిళనాడులో 93లక్షలు, గుజరాత్‌లో 72లక్షలు, పశ్చిమబెంగాల్‌లో 58లక్షలు, రాజస్తాన్‌లో 43లక్షలు, మధ్యప్రదేశ్‌లో 30లక్షలు చత్తీస్‌గఢ్‌లో 28లక్షలు, కేరళలో 21 లక్షల ఓట్లను తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ, రాజకీయ పార్టీలను గెలిపించే అంశం మాత్రమే కాదనీ, భారత రాజకీయ స్వరూపమే మారిపోనుందని హెచ్చరించారు. మనదాకా వస్తే గాని దాని ప్రభావం అర్థం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విధ్వంసాన్ని ఆదిలోనే అడ్డుకోవాలని ఆయన పౌరసమాజానికి పిలుపు నిచ్చారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఓట్ల తొలగింపు, చేర్పుల కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదనీ, రిమూవర్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ‘సర్’తో కాకుండా ఎన్నికల సంస్కరణ పేరుతో మాత్రమే చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఈ దేశ ప్రధానిని చొరబాటుదారులు ఎన్నుకునే అవకాశం ఇవ్వమని హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.
సర్ లేకుండా జరిగిన 2014, 2019 ఎన్నికలు సక్రమంగా జరగలేదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు సైతం ఓట్ల తొలగింపు, ఈవీఎంల వాడకంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. వారు గెలిచినపుడు ఒకలా, ఓడిపోయనపుడు మరోలా మాట్లాడుతున్నాయని విమర్శించారు. సర్ పేరుతో జరిగే ఈ ప్రక్రియలో సాధారణ పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు పత్రాలను దాఖలు చేయడం అందరికీ సాధ్యం కాదన్నారు. పత్రాలు లేనంత మాత్రాన ఈ దేశంలో పుట్టిన వారు ఈ దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం బాధ్యత లేకుండా ఇష్టారీతిన వ్యవహిస్తోందని విమర్శించారు. సుప్రీం ఇచ్చిన డైరెక్షన్లను సైతం పాటించడం లేదని దుయ్యబట్టారు. కె.ఉమామహేశ్వరరావు వక్తలకు ఆహ్వానం పలకగా, డీఏఎస్‌వీ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. ఈ సెమినార్‌లో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డీజీ.నర్సింహారావు, ఆల్ ఇండియా లాయర్స్ ఆసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారధి వివిధ ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన పలు ప్రశ్నలకు పరకాల ప్రభాకర్ సమాధానమిచ్చారు. ఆ వివరాలు….
ప్రశ్న : ఎన్నికలు సక్రమంగా జరిపించడం ఈసీఐ బాధ్యత కాదా?
సమాధానం: ఎన్నికల సంఘం ప్రజలకు జవాబుదారీ అని 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కానీ నేడు ఈసీఐ ప్రజల నుంచి కనీసం పిటిషన్లను కూడా తీసుకోవడం లేదు. దీనిపై విసృతంగా పౌరసమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యమేనా?
సమాదానం: ఈవీఎంల తారుమారు అంశం సాంకేతిక చర్చ. నేను అందులోకి వెళ్లదల్చుకోలేదు. అయితే కొన్ని విషయాలు ప్రాస్తావించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ప్రిలిమినరీ ఓటింగ్ శాతానికి ఫైనల్ ఓటింగ్ శాతానికి సాథారణంగా అర శాతం నుంచి ఒక శాతం మాత్రమే తేడా ఉండాలి. కానీ నేడు అది 20 శాతం వరకు పోతోంది. దీనిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లడటం సరికాదు. ఎవరికి లాభం చేకూర్చేందుకు ఓటింగ్ శాతాన్ని పెంచుతున్నారో తెలిసిన విషయమే.
ప్రశ: ఈ ప్రక్రియ ఒక్క సర్‌తోనే ఆగుతుందా?
సమాధానం: ఒక్క సర్‌తోనే కేంద్రం ఆగుతుందని అనుకోవడం లేదు. సర్‌తో పాటు 2026లో జనగణన, ఆ తర్వాత 2029లో డీ లిమిటేషన్ చేయాలని నిర్ణయించింది. జనగణనలో ప్రజల కులం, మతం అన్ని తెలుస్తాయి. డీ లిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతాయి. ఫలితంగా ఈ దేశం ఎటు వైపు వయనిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: సర్ వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి?
సమాధానం: సర్ వల్ల దేశ సామాజిక, రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. బారతీయ రాజకీయ సమాజాన్ని ఒక వర్గానికి పరిమితం చేస్తారు. ఫతితంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆ ఛట్రంలోనే పయనించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే హిందూ ఎజెండానే ఎత్తుకోవాల్సి ఉంటుంది.



