Wednesday, January 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపేద విద్యార్థులకు ఏఐని అందుబాటులోకి తేవాలి

పేద విద్యార్థులకు ఏఐని అందుబాటులోకి తేవాలి

- Advertisement -

ప్రగతిశీల ఉపాధ్యాయులతో కలిసి పోరాడాలి
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్‌లో న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రభీర్‌ పురకాయస్థ
ఐదేండ్లలో లక్ష ప్రభుత్వ పాఠశాలల మూసివేత
ఎన్‌ఈపీపై టీచర్లకు భ్రమలు తొలగిపోతున్నాయి : చావ రవి
పాఠశాల విద్య 80 శాతం ప్రయివేటు పరం
ఇలాగైతే అందరికీ సమాన విద్య ఎలా సాధ్యం : ప్రొఫెసర్‌ పురేంద్ర ప్రసాద్‌
వెనిజులాపై అమెరికా అప్రజాస్వామిక దాడిని ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యావ్యవస్థలో వస్తున్న ఏఐ తదితర ఆధునిక సాంకేతికతను ఈ తరం ప్రతి విద్యార్థి వినియోగించేలా ప్రోత్సహించాలనీ, ప్రతి పేద విద్యార్థికి కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రభీర్‌ పురకాయస్థ పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్‌ నిర్వహించారు. అందులో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం. సజీ, ఉపాధ్యక్షులు శిల్ప, జాతీయ ఉపాధ్యక్షులు రోహిత్‌ దాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ అధ్యక్షులు ఎస్‌.రజినీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఎ.లెనిన్‌ గువేరా, కార్యదర్శి అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వెనెజులాపై అమెరికా దాడిచేయడాన్ని, అధ్యక్షులు మదురోను నిర్బంధించ డాన్ని ఖండిస్తూ శ్రీజన్‌ భట్టాచార్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

కన్వెన్షన్‌ను ఉద్దేశించి ప్రభీర్‌ పురకాయస్థ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ఉద్యమాలను దినపత్రికలు, వార్తాఛానళ్లు ఏవిధంగా చూపిస్తున్నాయనే కోణాన్ని పరిశీలించాలని సూచించారు. టెక్నాలజీని పెట్టుబడిదారులు తమ ఉత్పత్తుల అమ్మకాల ప్రచారాలకు విరివిగా వినియోగించుకుంటున్న తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో తమకు ఏది అవసరం? ఏది అనవసరం? అనే విషయంపై విద్యార్థులు స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థ ఇలాంటి టూల్స్‌ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో మార్పు కోసం ఎస్‌ఎఫ్‌ఐ కృషి చేయాలని సూచించారు. అందుకోసం ప్రగతిశీల ఉపాధ్యాయులతో కలిసి ఐక్యపోరాటాల దిశగా ఆలోచన చేయాలని కోరారు. పుస్తకాల్లో ఉన్న అంశాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్రిటీషర్ల కాలంలో ఉన్న పాఠ్యపుస్తకాల్లో భారతీయులు సోమరులని ఉండేదని గుర్తుచేశారు. టెక్నాలజీని ఎక్కువగా పాలకవర్గాలే దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు.

డిజిటల్‌ టీచింగ్‌ అవసరమేననీ, దానిని ఉపయోగించుకుంటేనే సమాజంలో మార్పులు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. ఏఐ రాకతో ఉద్యోగాలను కోల్పోవడం జరుగుతున్నదనీ, భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశముందని తెలిపారు. ఎస్టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ..ఎన్‌ఈపీ అమలులోకి వచ్చాక అనేక దుష్ఫలితాలు ఎదురవుతున్నాయన్నారు. విద్యావ్యవస్థ ను కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ చేయాలనే లక్ష్యంతో మోడీ సర్కారు ముందుకెళ్తున్నదనీ, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్నదని విమర్శించారు. విద్యార్థి బాల్య దశ నుంచే పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే పనిలో బీజేపీ సర్కారు పడిందన్నారు. ఉమ్మడి జాబితాలోని విద్యను కేంద్రం లాగేసుకున్నదనీ, దీంతో రాష్ట్రాలు చాలా మేరకు నష్టపోతున్నాయని వివరించారు. విద్యకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గాయని తెలిపారు.

గత ఐదేండ్లలో లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయనీ, తెలంగాణలో ఈ ఏడాది 1441 పాఠశాలలను మూసేశారని వివరించారు. పదేండ్లు టీచర్ల నియామకం లేదన్నారు. ఎన్‌ఈపీ ద్వారా తమకు ప్రమోషన్లు వస్తాయనే టీచర్ల భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయని చెప్పారు. టీచర్లకు దక్కే గ్రేడింగ్‌ ఆధారంగా వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందకుండా పోతుందని హెచ్చరించారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ పురేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ..పూర్తిగా పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలోనూ కామన్‌ విద్యావ్యవస్థ ఉందనీ, కేవలం ఐదు శాతం మాత్రమే ప్రయవేటు స్కూళ్లు ఉన్నాయని తెలిపారు. అక్కడ అందరికీ ఒకే విద్య అందుతున్నదని తెలిపారు. మన దేశంలో మాత్రం 80 శాతం స్కూళ్లు ప్రయివేటులోనే ఉన్నాయనీ, అలాంటప్పుడు అందరికీ సమాన విద్య, సామాజిక న్యాయం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు.

దిగువ, మధ్య తరగతి వాళ్లు కూడా అప్పులు చేసి మరీ తమ పిల్లలకు విద్యను అందించాల్సిన దుస్థితి రావడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. విద్య అందరి హక్కు అనేది కాస్తా విద్య అనేది కొందరికే అనే రోజులు రాబోతున్నాయని చెప్పారు. మనదేశంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు మాత్రం మెజార్టీగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయనీ, టాప్‌ ర్యాంకర్లు ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే ఉంటున్నారని గుర్తుచేశారు. మోడీ సర్కారు ఇప్పుడు ఆ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించే పనిలో పడ్డదనీ, ప్రయివేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతిలిస్తూ పోతున్నదని తెలిపారు. ఆ వర్సిటీల్లో పదిలక్షల రూపాయలు పెడితే యూజీసీ విద్య పూర్తిచేయలేమని తెలిపారు. పెడగాలజీని రూపొందించే బాధ్యతను ప్రయివేటు కంపెనీలకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -