తెలంగాణకు 3 శాతం నీటివాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరుకాదా?
హరీశ్‌రావుకు కవిత సూటి ప్రశ్న
‘పాలమూరు-రంగారెడ్డి’పై అసెంబ్లీలో ప్రభుత్వం అబద్దాలు
ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రకు జాతీయహోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలి
కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి : మీడియాతో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-సూర్యాపేట
ముఖ్యమంత్రి హరీశ్‌రావును ఒక్క మాట అన్న వెంటనే బీఆర్‌ఎస్ సభను బాయ్ కాట్ చేస్తుందా అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హరీశ్‌రావును ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఒక డ్రామా చేస్తే, బీఆర్‌ఎస్ మరో డ్రామా చేస్తోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. సూర్యాపేటలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని, అసలు సెషన్‌లో ప్రతిపక్షమే లేకుండా సభ సాగిందన్నారు. దీనివల్ల కృష్ణా జలాలపై సమగ్ర చర్చ జరగలేదని అన్నారు. కృష్ణానది విషయంలో స్టేక్ హోల్డర్స్ అయిన మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంశాలపై చర్చించాల్సి ఉండగా, అపెక్స్ కౌన్సిల్‌లో మాట్లాడి వచ్చిన అంశాలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
కృష్ణా వాటర్ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులో కూడా రెండు రాష్ట్రాలను మాత్రమే ఉంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టిడ్యామ్ ఎత్తును ఐదు మీటర్లు పెంచుతున్నారని, దీనివల్ల తెలంగాణ వంద టీఎంసీల వరకు నీటిని నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. కానీ దీనిపై ఏమాత్రం చర్చ జరపకుండా ఒక లేఖ రాసి ప్రభుత్వం సైలెంట్‌గా ఉండిపోయిందని ఆరోపించారు. కర్నాటక ఎన్నికల కోసం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని, దీనివల్ల తుంగభద్రకు రావాల్సిన నీళ్లు ఆగిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పర్‌భద్రకు జాతీయ హోదా ఇవ్వడాన్ని, ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట్-కొడంగల్ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే 77.5 టీఎంసీలు కేటాయిస్తే, ఇప్పుడు 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
3శాతం నీటివాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది ఎవరు?
హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటున్నారని, అంతకుముందు తాను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని తెలిపారు. తెలంగాణకు మూడు శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులపై తెలంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేదని, కానీ కాళేశ్వరరావుగా పేరుపొందిన హరీశ్‌రావు తెలంగాణకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశారని గుర్తుచేశారు. తాను అడిగిన ప్రశ్నలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సమాధానం చెప్పాలని, జూరాల నుంచి శ్రీశైలం వరకు ఇన్‌టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా వివరించాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు ధనదాహం కారణంగానే ఇన్‌టేక్ పాయింట్ శ్రీశైలానికి మారిందని ఆరోపించారు. ఏల్లూర్ పంప్ హౌస్‌ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్‌గా మార్చి దాదాపు రూ.1,400 కోట్లు ఖర్చు చేశారని, దాని వల్ల 30 మీటర్ల ఎత్తు పెరిగి నీటి కెపాసిటీ తగ్గిందని వివరించారు. అసెంబ్లీలో చెప్పాల్సిన అంశాలను పార్టీ ఆఫీస్‌లో చెప్పడం సరికాదని అన్నారు.
తనకంటూ ఓ గుంపును తయారు చేసుకుంటున్న హరీశ్‌రావు
సభలో మూసీ, జీహెచ్‌ఎంసీకి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షం లేకుండా పోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి హరీశ్‌రావును ఒక్క మాట అన్న వెంటనే బీఆర్‌ఎస్ సభను బాయ్ కాట్ చేస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ కూడా తమ టైమ్‌ను హరీశ్‌రావుకే ఇవ్వమన్నారని తెలిపారు. అంటే హరీష్ రావు పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారుచేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని, పోరాటం చేయాల్సిన వాళ్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని, అయినా ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో తనకూ బాధ్యత ఉందని చెప్పారు. అందుకే జనం బాట ప్రారంభించినప్పుడే క్షమాపణ చెప్పి ముందుకు కదిలానని తెలిపారు. నాయకులు తప్పులు చేసినప్పుడు క్షమాపణ చెప్పి సరిదిద్దుకోవాలన్నారు. భవిష్యత్‌లో తాను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కేంద్రంలో ఉన్న కర్కశ ప్రభుత్వం మావోయిస్టులను లొంగదీసుకునే తీరు బాధాకరమని, ఇప్పుడు అడవుల్లో తుపాకీతో పోరాటం కష్టమైందని, రాజకీయ ప్రక్రియలో వారు ప్రజల్లో భాగస్వాములు కావాలని కోరారు.



