అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర హక్కుల కోసం ప్రజాపోరాటం చేస్తాం : మాజీమంత్రి హరీశ్‌రావు
తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు’పై పీపీటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణకు నెంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ‘నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు’అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కట్టుకథలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిట్ట కథలు చెప్పారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను, ప్రజలను తప్పుదోవ పట్టించిన రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో 811 టీఎంసీల్లో ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలోనే ఇది ఉందన్నారు. దీంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ మరణశాసనం రాసిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దామంటూ నిర్ణయించిందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంపై కక్షగట్టారనీ, పాలమూరుపై పగబట్టారని అన్నారు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే రేవంత్‌రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు
ఉమ్మడి ఏపీలో 1956 నుంచి 2004 వరకు 36 లక్షల ఆయకట్టు ఉందని హరీశ్‌రావు అన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో 5.71 లక్షల ఆయకట్టు కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 42.77 లక్షల ఎకరాల ఆయకట్టు నీళ్లిచ్చాయని వివరించారు. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో కొత్తగా 17.24 లక్షల ఆయకట్టు తెచ్చామనీ, 31.50 లక్షల ఎకరాలను స్థిరీకరించామని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం 48.74 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించామని గుర్తు చేశారు. కానీ అసెంబ్లీ సాక్షగా రేవంత్ అబద్దాలు చెప్పారని విమర్శించారు. దీన్ని బట్టి ఎవరి నాలుక కోయాలని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి చీము, నెత్తురు ఉంటే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడని అన్నారు.
మరో జలపోరాటానికి శ్రీకారం
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని హరీశ్‌రావు చెప్పారు. కానీ చంద్రబాబు చెవిలో చెప్తే ఆ పనులు ఆగినట్టు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును 2020లోనే జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకెళ్లి స్టే తెచ్చిందని ప్రకటన ఇచ్చిందని వివరించారు. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. కృష్ణానదీ జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రజాక్షత్రంలో ఎండగడతామనీ, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్‌ఎస్ శ్రీకారం చుడుతుందన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదనీ, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యమని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు.



