Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవివరణ ఇవ్వాల్సిందే

వివరణ ఇవ్వాల్సిందే

- Advertisement -

– వెనిజులా ఆపరేషన్‌పై కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పారు !
– ట్రంప్‌పై డెమొక్రాట్ల ఆగ్రహం
వాషింగ్టన్‌ :
వెనిజులాపై అమెరికా దాడులు జరిపి ఆ దేశ అధ్యక్షుడిని బంధించిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పారంటూ అమెరికన్‌ డెమొక్రాట్‌ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దాడుల గురించి కాంగ్రెస్‌కు ఏ మాత్రమూ ముందుగా తెలియజేయలేదని అన్నారు. అంతేకాదు సుసంపన్నమైన చమురు నిల్వలు కలిగిన వెనిజులాలో తన లక్ష్యం గురించి ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పిందన్నారు. ముందు ఈ ఆపరేషన్‌పై, వెనిజులాకు సంబంధించి వైట్‌హౌస్‌ తదుపరి చర్యలపై తక్షణమే కాంగ్రెస్‌కు తెలియజేయాలని డెమొక్రాట్లు డిమాండ్‌ చేశారు. కొద్ది వారాల క్రితమే మంత్రులు రూబియో, హెగ్‌సేథ్‌ మాట్లాడుతూ, వెనిజులాలో ప్రభుత్వ మార్పు తమ అభిమతం కాదని ప్రతి ఒక్క సెనెటర్‌కు స్పష్టం చేశారు. అయినా వారిని తాను నమ్మలేకపోయానని, ఇప్పుడు జరిగింది చూస్తుంటే వారు కాంగ్రెస్‌కు దారుణంగా అబద్దాలు చెప్పారని తెలుస్తోందని అమెరికా సెనెటర్‌ ఆండీ కిమ్‌ ఎక్స్‌ పోస్టులో తెలిపారు. వెనిజులా గురించి ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌కు, అమెరికన్‌ ప్రజలకు పదేపదే అబద్దాలు చెప్పిందని ప్రతినిధుల సభ సాయుధ బలగాలు, ఇంటెలిజెన్స్‌ కమిటీల్లోని డెమొక్రాట్‌ జేసన్‌ క్రూ వ్యాఖ్యానించారు. ఇదేమీ ప్రభుత్వ మార్పు కోసం కాదంటూ అధికారులు కూడా పదే పదే ఉద్ఘాటిస్తూ వచ్చారన్నారు. సెనెట్‌ విదేశాంగ సంబంధాల కమిటీలో డెమొక్రాట్‌ జెన్నీ షాహీన్‌ మాట్లాడుతూ, ట్రంప్‌ ప్రభుత్వం పార్లమెంట్‌ సభ్యులను పదే పదే తప్పుదారి పట్టించిందన్నారు. వెనిజులాకు సంబంధించి అమెరికా దీర్ఘకాలిక వ్యూహమేదీ తెలియకుండా కాంగ్రెస్‌ను చీకటిలో వుంచిందన్నారు. రక్షణ వ్యవహారాలపై సెనెట్‌ అప్రొప్రియేషన్స్‌ సబ్‌ కమిటీలో సభ్యుడు సెనెటర్‌ క్రిస్‌ కూన్స్‌ మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వం తప్పుడు సమాచారమే ఇచ్చిందన్నారు. చట్టవిరుద్ధమైన చర్య, యుద్ధ చర్య ఏదైనా సరే కాంగ్రెస్‌ ఆమోదముద్ర పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ఉభయ సభల్లోనూ మైనారిటీ నేత హకీమ్‌ జెఫ్రీస్‌, సెనెట్‌మెజారిటీ నేత చుక్‌ షుమర్‌ మాట్లాడుతూ, నిర్లక్ష్యపూరితమైన ఈదాడికి ముందుగా కాంగ్రెస్‌ అనుమతి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే దీనిపై సవివరమైన వివరణ ఇవ్వాలన్నారు. డెమొక్రాట్‌ నేతలు తీవ్ర నిరసన గళం వినిపిస్తుండగా, మరోవైపు రిపబ్లిన్‌ సభ్యులు ట్రంప్‌ చర్యను సమర్ధించారు. రాబోయే రోజుల్లో దీనిపై బ్రీఫింగ్‌ వుంటుందని భావిస్తున్నట్లు సెనెట్‌ మెజారిటీ నేత జాన్‌ తూనే, ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -