Wednesday, January 7, 2026
E-PAPER
HomeNewsలోపబోయిష్టంగా ఓటర్ ముసాయిదా జాబితా

లోపబోయిష్టంగా ఓటర్ ముసాయిదా జాబితా

- Advertisement -

* సరిహద్దులు మార్చారంటూ ఆరోపణలు

* జాబితా పారదర్శకంగా ఉండాలి

* వివిధ రాజకీయ పార్టీల సమావేశంలో నాయకులు

నవతెలంగాణ మిర్యాలగూడ

మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితా లోపబోయిష్టంగా ఉందని జాబితా అంతా తప్పులు తడకగా ఉందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ జాబితా పై అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేయలేదని అన్ని తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 5, 6, 42, 43, 31,35 24 వార్డులలో పక్క వార్డుకు చెందిన ఓటర్లను చేర్చారని ఆరోపించారు. ప్రధానంగా 42 వార్డుకు చెందిన సుమారు 300 ఓట్లు సరిహద్దులు మార్చి 43 వార్డులో చేర్చారని తెలిపారు.6 వార్డులో 300కు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

35 వార్డుకు చెందిన ఓట్లు 24 వార్డులో నమోదు అయ్యాయని చెప్పారు. వెంటనే ముసాయిదా ఓటర్ జాబితాలో సవరించాలని డిమాండ్ చేశారు. మారిన సరిహద్దులను సరిచేయాలని సూచించారు. తప్పుల తడకగా లేకుండా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని దీనికి అన్ని పార్టీలు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిపిఎం వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శులు డా.మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, బి ఆర్ ఎస్ నాయకులు మహమ్మద్ ఇలియాజ్, మజీద్, బిజెపి నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, రతన్ సింగ్ నాయక్, సిపిఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముసాయిదా జాబితా పై నేటి వరకు ఫిర్యాదులు చేయొచ్చు

* సమన్వయంతో ఫిర్యాదుల పరిష్కారం: కమిషనర్

ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ముసాయిదా ఓటర్ జాబితా పై అభ్యంతరాలు స్వీకరించామని ఇప్పటివరకు 106 ఫిర్యాదులు అందాయని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలో 48 వార్డులో గాను 93,020 ఓట్లు ఉన్నాయని ఇందులో 47,128 మంది పురుషులు, 47,878 మహిళలు, 14 ఇతరుల ఓట్లు ఉన్నాయన్నారు. 10 పార్టీల నాయకులు హాజరయ్యారని వారి అభ్యంతరాలు సూచనలు సలహాలు స్వీకరించామని తెలిపారు. మంగళవారం నాటి వరకు ఓటర్ జాబితా పై ఫిర్యాదులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అక్టోబర్ 1, 2025 కట్ ఆఫ్ డేటుగా ఓటరు జాబితాలో సిద్ధం చేశామని ఈ విషయం ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు మార్పులు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం జరుగుతుందని తెలిపారు. ఈనెల 10న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామన్నారు. మిర్యాలగూడ పట్టణంలో 144 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరి, టిపిఓ అంజయ్య, ఎన్నికల శిక్షకులు బాలు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -