Friday, January 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రమాదకర దిశగా ఆర్థిక వ్యవస్థ

ప్రమాదకర దిశగా ఆర్థిక వ్యవస్థ

- Advertisement -

భారతదేశ బీమా రంగంలోకి వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ ప్రతిపాదించిన ఒక చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యనే పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. ఇండియా ఆర్థిక వ్యవస్థలో ”ప్రధానమైన సంస్కరణలకు” ఇది ప్రారంభం అని ప్రధానమంత్రి ప్రకటించారు. అంటే మనదేశ ఆర్థిక సంస్థలను మరింత ఎక్కువగా ప్రయివేటు రంగానికి, ముఖ్యంగా విదేశీ సంస్థలకు అప్పజెప్పడమే ఈ సంస్కరణల ఉద్దేశం. స్వాతంత్య్రానంతర కాలంలో ఆర్థిక రంగంలో అనుసరిస్తూ వచ్చిన విధానం నుంచి ఇది తిరుగుదారి పట్టడమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. చాలాకాలంగా ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌, అమెరికా ప్రభుత్వం మన దేశ ఆర్థిక విధానంలో ఇటువంటి తిరోగమనాన్ని కోరుకుంటున్నాయి. ఒకవేళ మొత్తం ఆర్థిక సంస్థలన్నింటినీ ఒకేసారి ప్రయివేటుపరం చేయడం వెంటనే సాధ్యపడకపోతే కనీసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానైనా ప్రయివేటుపరం చేసి తద్వారా ప్రభుత్వం ఒక ‘సంకేతాన్ని’ పంపవచ్చు గదా అని అమెరికన్‌ ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ అధికారి సలహా కూడా ఇచ్చాడు! కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్న కాలంలో, ఆ పార్టీ నయా ఉదారవాద సంస్కరణలకు ఎంత సానుకూలం అయినా, ఇటువంటి చర్చ చేపట్టడానికి సిద్ధపడలేదు.

అయితే, భారతీయ కార్పొరేట్ల సేవ చేయడంలో బీజేపీ ఎంతవరకైనా తెగించేందుకు సిద్ధం. ఇప్పుడు ఆ కార్పొరేట్ల ప్రయోజనాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలతో మరింత సన్నిహితంగా కలగలిసిపోతున్నాయి. అందుచేత సామ్రాజ్య వాద శక్తులు కోరుకుంటున్న ‘సంస్కరణలను’ అమలు చేయడానికి, అంటే, ఆర్థిక సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి, విదేశీ ఆధిపత్యం కిందకు తీసుకురావడానికి ప్రణాళికలు వేస్తోంది. స్వాతంత్య్రం సాధించుకున్నాక అప్పటివరకూ విదేశీ పెత్తనం కింద ఉండిన ఆర్థిక సంస్థలను ఆ పెత్తనం నుంచి విముక్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ విదేశీ పెత్తనం కిందకే వాటిని నెడుతోంది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు విదేశీ పెత్తం నుంచి బయట పడేయడానికి ఎందుకు పూనుకున్నదీ పరిశీలించడం ఇప్పుడు వంఉపయోగకరం. మొదటిది: ”ఉత్పత్తి”కి, ”స్పెక్యు లేషన్‌”కి మధ్య తేడాను విదేశీ పెట్టుబడి చూడదు. ఇంతకూ ఆ రెండింటికీ మధ్య తేడా ఏమిటి? ఒకానొక ఆస్తిని కొనుగోలు చేసేది దాన్ని ‘నిలుపుకోవడం’ కోసం అయితే (అంటే, ఆ ఆస్తి ద్వారా కొన్నేండ్లపాటు ఆదాయం పొందే ఉద్దేశంతో) దాన్ని ”ఉత్పత్తి” కోసం చేసిన కొనుగోలుగా పరిగణిస్తాం.

అదే ఒకానొక ఆస్తిని కొనుగోలు చేసేది దానిపై వచ్చే ఆదాయం కోసం కాకుండా, వీలైనంత త్వరగా దాన్ని మళ్లీ ఎక్కువధరకు అమ్ముకుని లాభం పొదే ఉద్దేశ్యంతోనైతే దానిని ”స్పెక్యులేషన్‌” అంటాం. ప్రయివేటు ఆర్థిక సంస్థలు ఈ రెండు రకాల లావాదేవీల మధ్య తేడాతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తాయి. అందుచేత తమ వద్ద నుండే ఆర్థిక వనరులలో ఒకభాగాన్ని ఉత్పత్తి కోసం వినియోగించకుండా స్పెక్యులేషన్‌ కోసం దాచిపెడతాయి. ఇలా ఆర్థిక వనరులను దాచిపెట్టడం మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు దుర్భరంగా పరిణమిస్తుంది. రెండవ అంశం: ఆర్థిక వనరులను పెట్టుబడిగా పెట్టే విషయంలో కూడా (అంటే రుణాలు ఇచ్చే విషయంలో) వేర్వేరు రుణగ్రహీతలను వేరువేరుగా చూడడం ప్రయివేటు ఆర్థిక సంస్థల స్వభావం. వలసపాలన కాలంలో కూడా బ్యాంకులు ఎక్కువగా విదేశీ పెత్తనంలో ఉన్నప్పుడు భారతీయ వ్యాపారులు రుణాలు కోరినప్పుడు వారిపట్ల వివక్షపూరితంగా వ్యవహరించాయి.

అప్పుడు భారతీయ కార్పొరేట్‌ సంస్థలు తమ స్వంత ఆర్థిక సంస్థలను ఏర్పాటుచేసుకుని వాటిద్వారా తమకు కావలసిన పెట్టుబడులను సమకూర్చుకోవడం కోసం ప్రయత్నించాయి.అదే సమయంలో ఆ సంస్థలు సైతం తమవద్దకు రుణాలకోసం వచ్చిన చిన్న పెట్టుబడిదారులను, రైతులను, వృత్తిదారులను తిరస్కరించాయి. ద్రవ్య వ్యవస్థ అనేది పెట్టుబడిని నియంత్రించే వ్యవస్థ. ఎవరెవరికి ఈ ద్రవ్యం అందుతుంది, ఏయే ప్రాంతాలకు అందుతుంది, ఎటువంటి కార్యకలాపాల కోసం అది వెచ్చించబడుతుంది వంటి అంశాలను అది నియంత్రిస్తుంది. తద్వారా ఒక దేశ ఆర్థికవృద్ధి ఎంతవేగంతో, ఏ పద్ధతిలో ముందుకు సాగుతుంది అన్నది నియంత్రించబడుతుంది. ప్రయివేటు సంస్థల చేతుల్లో ఈ ద్రవ్య వ్యవస్థ ఉన్నంతకాలం అది అనుసరించిన వివక్ష పూరిత వైఖరి వలన దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి దారీతెన్నూ లేకుండా పోయింది. పైగా ఆర్థికవృద్ధికి అవరోధంగా కూడా మారింది. విదేశీ పెత్తనంలో ద్రవ్య వ్యవస్థ ఉండినందువలన కలిగిన అనుభవాలు, దాని పట్ల ఏర్పడిన మౌలిక అవగాహన కారణంగానే ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను 1955లో జాతీయం చేసింది కేంద్ర ప్రభుత్వం.

అదే ఇప్పటి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 1956లో జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసింది. అదే ఇప్పటి ఎల్‌ఐసి. 1969లో 14 ప్రధాన ప్రయివేటు బ్యాంకులని, తిరిగి 1980లో మరో ఆరు ప్రయివేటు బ్యాంకులని జాతీయం చేసింది. ఈ విధంగా దేశ ద్రవ్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినందువలన వ్యవసాయ రంగంలోకి అంతకుముందు ఎన్నడూ లేని విధంగా సంస్థాగత రుణ ప్రవాహం వచ్చింది. అది హరిత విప్లవాన్ని ఆచరణ సాధ్యం చేసింది. భారతదేశం ఆహార రంగంలో స్వయంసమృద్ధిని సాధించగలిగింది. 1960వ దశకం వరకూ భారతదేశం అమెరికా నుండి దిగుమతి చేసుకునే ఆహార ధాన్యాలమీద ఆధారపడవలసిన పరిస్థితి ఉండేది. దాంతో అమెరికన్‌ సామ్రాజ్యవాదపు రకరకాల కుట్రపూరిత చర్యలకు బలి కావలసి వచ్చేది. ఎప్పుడైతే ఆహార స్వయంసమృద్ధి సాధించామో అప్పటినుంచీ ఆ దుస్థితిని అధిగమించగలిగాం. కాని అమెరికన్‌ సామ్రాజ్య వాదం మాత్రం మళ్లీ పాత పరిస్థితిని ఎలాగైనా తేవాలన్న కుట్రలను కొనసాగిస్తూనే వుంది.

మనదేశ ద్రవ్య వ్యవస్థ ప్రధానంగా ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉంది గనుకనే, అమెరికాలో ”హౌసింగ్‌ బబుల్‌” బద్దలైనప్పుడు (రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంక్షోభం) ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ యావత్తూ అతలాకుతలం అయిపోయింది. ఇండియా వంటి అతికొద్ది దేశాలు మాత్రమే దాని ప్రభావాన్ని తట్టుకుని నిలబడగలిగాయి. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా, తక్కిన భారతీయ బ్యాంక్‌లలో విదేశీవాటాలు చాలా తక్కువ. అంతేగాక ఎగ్గొట్టే రుణాల, నష్టదాయక ఆస్తుల శాతమూ తక్కువే. ప్రభుత్వ యాజమాన్యం కింద ఉంటున్నందు వల్లే ప్రజల సంపద ఆవిరి అయిపోకుండా కాపాడడం సాధ్యపడింది. ఆర్థిక ఉదారవాద విధానాలు చేపట్టాక మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కొంతవరకూ దెబ్బతింది. వ్యవసాయ రంగంలోకి వచ్చే సంస్థాగత రుణాలు చాలా తగ్గిపోయాయి. ఆ స్థానంలో బ్యాంకుల నుండి ప్రయివేటు వ్యక్తులు రుణాలు తక్కువ వడ్డీలకు తీసుకుని తిరిగి రైతులకు అధిక వడ్డీలకు రుణాలిచ్చే పద్ధతి వచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇంకా కొంతవరకూ పటిష్టత కలిగివున్న దేశ ద్రవ్య వ్యవస్థను కూడా దెబ్బతీసి విదేశీ పెత్తనం కిందకి నెట్టడానికి వీలుగా ప్రయివేటీకరణకు పూనుకుంటోంది.

బీమా వ్యాపారంలో ఇంతవరకూ విదేశీ వాటాల శాతానికి పరిమితి ఉంటూవచ్చింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేయడాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలలో ఏమాత్రమూ పస లేదు. ఆ వాదనల్లో ఒకటి ఇలా ఉంది: ”విదేశీ వాటాలకు ఉన్న పరిమితిని పూర్తిగా ఎత్తేస్తే అప్పుడు బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా వస్తాయి. దానివలన బీమా వ్యాపారాన్ని ఇంకా విస్తరించవచ్చు. దాని నాణ్యత కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రజల నుండి పోగుబడే పెట్టుబడితో వేగంగా అభివృద్ధి చెందవచ్చు”. కాని విదేశీ సంస్థలు అలా పోగుబడ్డ పెట్టుబడిని విదేశాల్లో స్పెక్యులేషన్‌ కోసం మళ్లిస్తే అప్పుడేమౌతుంది? ఇటు దేశాభివృద్ధికీ అది తోడ్పడదు. అటు పాలసీదారుల సొమ్ముకూ భద్రత ఉండదు. రెండో వాదన ఇలా ఉంది: ”ఇప్పుడు బంగారంలోనో, రియల్‌ ఎస్టేట్‌లోనో పెట్టుబడులు పెడుతున్న వినియోగదారులు బీమా వ్యాపారం గనుక విదేశీ పెత్తనం కిందికి పోతే అప్పుడు ఆ బీమా వ్యాపారంలోనే పెట్టడానికి ముందు కొస్తారు. అలా వచ్చిన డబ్బు అభి వృద్ధికి ఉపయోగపడుతుంది.” ఒకసారి విదేశీ సంస్థలు పాలసీదారుల సొమ్మును స్పెక్యులేషన్‌ కోసం మళ్లించడం మొదలుబెట్టాక, లేదా ఆ సొమ్మును ఉపయోగించి చిన్నసంస్థలను గుత్త సంస్థలు స్వాహా చేయడానికి పూనుకున్నాక, లేదా తమ లాభాల వాటాను పెంచుకుంటూ పోవడం మొదలుబెట్టాక ఇక పాలసీదారులకు దక్కేది ఏమీ ఉండదు.

ఇలా బీమా వ్యాపారాన్ని పూర్తిగా విదేశీ సంస్థల ఆధిపత్యానికి అప్పగిస్తే అప్పుడు అంతర్జాతీయ మదుపుదారులకు మన మీద విశ్వాసం పెరుగుతుందని, ప్రస్తుతం ఇక్కడినుండి బయటకు తరలిపోతున్న పెట్టు బడుల ప్రవాహవేగం ఆగుతుందని, అప్పుడు రూపాయి విలువ పడిపోవడం అనేది ఆగుతుందని (ప్రస్తుతం ఆసియాలోకెల్లా అత్యంత బలహీనమైన కరెన్సీగా మన రూపాయి ఉంది!), బీజేపీ ప్రభుత్వం అత్యాశ పెట్టుకుని వుందేమో. కానీ, మన కరెన్సీ బలహీన పడడానికి ప్రధాన కారణం డొనాల్డ్‌ ట్రంప్‌ మనమీద విధించిన అత్యధిక సుంకాలు. ఈ సుంకాలు అమలైతే అప్పుడు రూపాయి బలహీన పడిపోతుంది అన్న అంచనాతో ముందుగానే ఇక్కడినుండి తమతమ పెట్టుబడులను విదేశీ మదుపరులు తరలించుకుపోతున్నారు. దాంతో సుంకాల అమ లుకు ముందుగానే రూపాయి బలహీన పడిపోవడం మొదలైంది. మన దేశ ద్రవ్యవ్యవస్థను ఎంత ప్రయి వేటీకరించినా ట్రంప్‌ సుంకాల పీడ ఉన్నంతకాలం మన దేశం నుండి పెట్టుబడులు బయటకు తరలిపోవడాన్ని ఆపడం సాధ్యం కాదు. ట్రంప్‌ దుర్దాహం తీరాలంటే కనీసం అమెరికన్‌ పాల ఉత్పత్తుల దిగుమతి మీద ఉన్న ఆంక్షలను వెంటనే పూర్తిగా ఎత్తివేయాలి.

కాని ఆవిధంగా చేస్తే రైతాంగం ఊరుకోదు. ఇదివరకే ఒకసారి మోడీ ప్రభుత్వానికి భారతీయ రైతాంగం తమ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఆ సాహసం చేయడానికి భయపడుతోంది. ఈ ప్రధానమైన సుంకాల విషయంలో అమీ తుమీ తేల్చుకోకుండా, బీమా వ్యాపారాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా అప్పగించడం వలన ట్రంప్‌తో ”శాంతి” సాధ్యపడదు. దేశం నుండి పెట్టుబడులు తరలిపోవడమూ ఆగదు. నిజానికి దేశ ద్రవ్యవ్యవస్థను విదేశీ మదుపరులకు అప్పజెప్పడానికి పూనుకుంటే ప్రభుత్వం ఆశిస్తున్న దానికి పూర్తి వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత మీద మదుపరుల విశ్వాసం మరింత తగ్గిపోయి, మరింత వేగంగా ఇక్కడినుండి తరలిపోయే అవకాశం ఉంది. అప్పుడు రూపాయి పతనం ఆగదు సరికదా మరింత వేగంగా కొనసాగుతుంది. ఇదంతా మనకు సూచించేది ఒకటే. ఈ దేశంలో నయా ఉదారవాద విధానాల అమలు పరాకాష్టకు చేరింది. ఆ విధానాలు దేశంలోని రైతాంగానికి, చిన్న ఉత్పత్తిదారులకు ఎనలేని కష్టాన్ని కలిగించాయి. ఇప్పుడు వాళ్లకే మరింత తీవ్రంగా మరింత దుర్భరమైన విధంగా కష్టాన్ని కలిగించమని ట్రంప్‌ కోరుతున్నాడు.

ఆ కోరికను కాదంటే ఇప్పటికే పడిపోతున్న మన రూపాయి విలువ మరింత పడిపోతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం రాజుకుంటుంది. అంతి మంగా మనం ఐఎంఎఫ్‌ చేతిలో పూర్తిగా కీలుబొమ్మలాగా అయిపోతాం. చాలా దక్షిణాసియా దేశాల విషయంలో ఇదే జరిగింది. అంటే ట్రంప్‌ చెప్పినట్టు ఆడినా నష్టమే. ఆడకపోయినా నష్టమే. ఈ రెండింటిలో ఏది చేయాలన్నది కాదు ఇప్పుడు మనముందు ఉన్న పరిష్కారం. ఇలా ఎటూ ఎంచుకోలేని దుస్థితి నుండి బయటపడడమే అసలైన పరిష్కారం. అందుకోసం ముందు ట్రంప్‌ సుంకాల బెదిరింపులకు భయపడిపోకుండా ఎదురు నిలవాలి. భారతీయ సరుకుల మీద ట్రంప్‌ సుంకాలను పెంచితే, అమెరికన్‌ దిగుమతుల మీద మనం కూడా సుంకాలను విధించి ప్రకటించాలి. ఇలా చేయగలగాలంటే, మన దేశ ఆర్థిక విధానాలనే నయా ఉదారవాద చట్రం నుండి బయటకు తేవాలి. మరింత స్వావలంబన దిశగా విధానాలను అమలు చేయాలి. అయితే ఇటువంటి సాహసోపేతమైన చర్య తీసుకునే దమ్ము బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వానికి లేదు. ఈ వెన్నెముక లేని ప్రభుత్వం ప్రజలమీద మాత్రం తన ఫాసిస్టు అణచివేత పద్ధతులను ముమ్మరం చేసి ట్రంప్‌ ముందు లొంగిపోతున్న తన అసలు రూపాన్ని కప్పెట్టుకునేందుకు పూనుకుంటుంది.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -