అధ్యక్షులు మదురో, ఆయన భార్యను విడుదల చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్
ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
వెనిజులాపై అమెరికా దాడిని ఖండిద్దామని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ పిలుపునిచ్చారు. అరెస్టు చేసిన వెనిజులా అధ్యక్షులు మదురో, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా దాడిని ఖండిస్తూ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశాధ్యక్షునిపై, ఆయన కుటుంబ సభ్యులపై బెదిరింపులు, అరెస్టులు అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కులు, ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు, దేశాల సార్వభౌమత్వానికి విరుద్ధమని అన్నారు. వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తక్షణమే ఆపాలని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు.
అలాగే, భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని కోరారు. సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వెనిజులా ప్రజల ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజల ఐక్యతతోనే ఇలాంటి దుర్మార్గ కుట్రలు ఓడిపోతాయని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజరు, జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షలు ఎస్.నాగేశ్వరరావు, కార్యదర్శి సుమంత్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రాకేష్, ఏఐడీఎస్‌ఓ నాయకుడు నితీష్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ నాయకులు స్వాతి, లెనిన్, ఉప్పల ఉదయ్, అజయ్, కిరణ్, సుమన్, రాజశేఖర్, పవన్, మధు, వెంకటేష్, రామ్, రాఘవ, శివ, పేర్ల రాము, సలీం తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ఆదర్శ్ మద్దతు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరుద్యోగ సమస్యలపై చర్చించాలంటూ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ హాజరై సంతకం చేసి తమ మద్దతు తెలిపారు.



