Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంగుల్జార్‌హౌజ్‌.. దృష్టి మళ్లించేందుకే

గుల్జార్‌హౌజ్‌.. దృష్టి మళ్లించేందుకే

- Advertisement -

– కేసీఆర్‌కు నోటీసులు : మాజీ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గుల్జార్‌హౌజ్‌ అగ్ని ప్రమాద ఘటన వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు పంపి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు నోటీస్‌ ఇవ్వడమంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు ఇచ్చినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఇంటి నిర్మాణం చేశాక, బాత్‌ రూంలో లీకేజీ అయితే ఇల్లు కూలిపోతుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులు కేవలం రాజకీయ ఒత్తిడితో ఇచ్చినవేననీ, వాటికి బెదిరేది లేదని అన్నారు. అందరితో చర్చించి విచారణకు హాజరు కావాలా? వద్దా? అనేది కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని గంగుల తెలిపారు.
మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లు తరలించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ లేకుండా చేసి నీటిని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ కూలిపోతే, ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదం, సుంకిశాల కూలిపోతే, వట్టెం పంప్‌ హౌజ్‌ మునిగిపోతే కమిషన్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మంత్రి సత్యవతీ రాథోడ్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు చివరి ఆయకట్టు దాకా నీళ్లు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టుయే కారణమని తెలిపారు. ప్రజా క్షేత్రంలోనే రేవంత్‌ ఆగడాలను ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే డి.సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌ సీఎం అయ్యాక ఎన్నో ప్రమాదాలు జరిగాయనీ, వాటన్నిటిపై కమిషన్‌లు వేశారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కే.పీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -