నవతెలంగాణ- శంకరపట్నం
హుజురాబాద్ ను పీవీ జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి శంకరపట్నం మండల కమిటీ కన్వీనర్ బాణాల శ్యాంసుందర్ డిమాండ్ చేశారు. శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం శ్యాంసుందర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ విషయం వెల్లడించారు.జమ్మికుంట హుజరాబాద్ పట్టణాలతో పాటు 14 మండలాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.హుజురాబాద్ లో రెవెన్యూ డివిజన్ కేంద్రంగాఉన్న హుజరాబాద్ పట్టణంలోఅన్ని శాఖల డివిజన్ కార్యాలయాలు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, సబ్ కోర్ట్, జూనియర్ సివిల్ సబ్ జడ్జి కోర్ట్, ఫస్ట్ అడిషనల్ మున్సిఫ్ కోర్ట్, సెకండ్ అడిషనల్ కోర్టులు ఇక్కడ పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఇక్కడ ఉన్నాయన్నారు.జిల్లా ఏర్పడితే ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు కావడమే కాకుండా విద్యార్థి, యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన అన్నారు. జిల్లాల పెంపు అంశం పాలన సౌలభ్యం కోసమే అని జమ్మికుంట మండలంలోని వావిలాల నుండి జిల్లా కేంద్రం కరీంనగర్ వరకు దాదాపు 70 కిలోమీటర్లు ఉందని హుజురాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేస్తే హుజరాబాద్ పరిసర ప్రాంతాలకు సౌలభ్యంగా ఉంటుందని ఆయన సూచించారు.జిల్లా సాధన సమితి శంకరపట్నం మండల వ్యవస్థాపక కన్వీనర్ కొరిమి వెంకటస్వామి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో లో హుజురాబాద్ జిల్లా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధన సమితి జిల్లా నాయకుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ జిల్లాకు కావలసిన అన్ని సౌకర్యాలు హుజురాబాద్ కు ఉన్నా కూడా జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదని ఆయనప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపు వీరమల్లు, మహమ్మద్ హుస్సేన్,మంకయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.