– తీరని రైల్వే గేటు కష్టాలు
– తీగలగుట్టపల్లి, కునారం, ఉప్పల్ వంతెన పనుల్లో జాప్యం
– గంటల తరబడి ట్రాఫిక్ నరకం
– అంబులెన్స్‌లోనే రోగుల ఇక్కట్లు
– బండి సంజయ్ ఇలాకాలో ఇదేం దుస్థితి?
– కేంద్ర మంత్రిగా ఉన్నా కదలని అడుగులు.. సర్వత్రా విమర్శలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రైల్వేను ఆధునీకరిస్తున్నామని కేంద్రం ప్రభుత్వం, కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీ) పనులు ఏండ్ల తరబడి నత్తనడకన సాగుతున్నా యి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీగలగుట్టపల్లి, కునారం, జమ్మికుంట ఉప్పల్ రోడ్.. ఇలా ఎక్కడ చూసినా అరకొర పనులు, నిలిచిన పిల్లర్లు, నిర్మాణంలో మిగిలిన మొండి వంతెన అంచులే దర్శనమిస్తున్నాయి. కరీంనగర్ తీగల గుట్టపల్లి ఆర్‌ఓబీ పనులు ఒకటా.. రెండా.. ఏకంగా దశాబ్ద కాలంగా సాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి చుట్టుపక్కల గ్రామాల వరకు ఎటు వెళ్లా లన్నా రైల్వే గేటు అనే గండం పొంచి ఉంది. పాలక పక్షాల నిర్లక్ష్యానికి ఏండ్లుగా సా..గుతున్న ఈ ఆర్‌ఓబీ పనులే సజీవ సాక్ష్యలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా, గంటల తరబడి ట్రాఫిక్ జామ్, కాలుష్యం, అన్నిటికీ మించి రోగుల ఆర్తనాదాలు నిత్యకృత్యమయ్యాయి.
కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఉన్న తీగలగుట్టపల్లి రైల్వే గేటు ప్రమాదకరంగా మారింది. రోజుకు 15-20సార్లు గేటు పడుతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఒకసారి గేటు పడితే క్లియర్ కావడానికి గంట సమయం పడుతోంది. ప్రధానంగా జిల్లా ఆస్పత్రులకు వచ్చే అంబులెన్స్‌లు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకు పోతున్నాయి. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ వచ్చి గేటు వద్ద ఆగిందంటే.. పేషెంట్స్ ప్రాణంతో బయటపడటం కష్టంగా మారుతోంది.
గేటు పడితే కిలోమీటర్ల మేర వాహ నాలు నిలిచిపోతుండటంతో అంబులెన్స్‌లకు దారి ఇచ్చే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఇక్కడ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.154 కోట్లతో 2023లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ 25 శాతానికి మించలేదు. పిల్లర్ల పనుల్లో జాప్యం, నిధుల విడుదలపై పర్యవేక్షణ లేకపోవడం శాపంగా మారింది. అసంపూర్తిగా ఉన్న పిల్లర్లు, రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఏండ్లుగా సాగుతూ.. వ్యయం పెరుగుతూ..
పెద్దపల్లి – కునారం మార్గంలో ఆర్వోబీ పనులు 2022లో ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలిపే ఈ ప్రధాన మార్గంలో ఆర్‌ఓబీ నిర్మాణం అంతులేని కథగా మారింది. మొదట రూ.119 కోట్లతో మొదలైన పనులు, జాప్యం వల్ల ఇప్పుడు రూ.199 కోట్లకు చేరాయి. మూడేండ్లు గడిచినా 60 శాతం పనులు పూర్తి కాలేదు. రైల్వే పనులు జరుగుతున్నా, అప్రోచ్ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఈ మార్గం కాజీపేట-బల్లార్షా ప్రధాన లైన్ కావడంతో ఇక్కడ ప్రతి గంటకూ గేటు పడుతోంది. ఒక్కోసారి వాహనాలు గేట్ల మధ్య ఇరుక్కుపోయేంత ప్రమా దకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ వంతెన పూర్తయితే భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు దూరం తగ్గే అవకాశం ఉన్నా, అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
చెన్నయ్ క్రెయిన్ల కోసం ఎదురుచూపులు
జమ్మికుంట – ఉప్పల్ మార్గంలో గిర్డర్ల అమరిక ఒక ప్రహసనంగా మారింది. తెలంగాణలో లేని భారీ క్రేన్లను చెన్నయి నుంచి తీసుకురావడానికి నెలల సమయం పట్టడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్న హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.
గేటు వేసిన ప్రతిసారీ గంటల తరబడి నిరీక్షణ తో విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. చెన్నరు నుంచి క్రేన్లు రప్పించి గిర్డర్లు అమర్చి నట్టు అధికారులు చెబుతున్నా, పూర్తిస్థాయిలో వంతెన అందుబాటులోకి రావడానికి ఇంకా ఎన్ని ముహూర్తాలు మారుతాయోనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్ ఇలాకాలో ఇదేం దుస్థితి?
కరీంనగర్ ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజరు ఈ సమస్యలపై కేవలం హెచ్చరికలకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి పనులు వేగవంతం చేయడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. నిధుల మంజూరులోనూ, పనుల పర్యవేక్షణలోనూ సంజరు తన ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ, ప్రజల మౌలిక అవసరాలను గాలికొదిలేశారనే అసహనం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా అప్రోచ్ రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు, అనుమతులు ఇప్పించడంలో ఎంపీగా ఆయన చొరవ చూపలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని కీలకమైన తీగలగుట్టపల్లి వంతెనను గాలికి వదిలేశారని ప్రజల్లో ఆవేదన నెలకొంది.



