Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచానికి గూండాల వ్యవహరిస్తున్న అమెరికా

ప్రపంచానికి గూండాల వ్యవహరిస్తున్న అమెరికా

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 
నవతెలంగాణ – అచ్చంపేట
వెనిజులా దేశంలో నిల్వ ఉన్న ఆయిల్, చమురు లపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశ అధ్యక్షున్ని అమెరికా అరెస్టు చేసి బంధించిన విషయంపై వివిధ దేశాలు ఖండిస్తున్నప్పటికీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం అచ్చంపేటలో నాగర్ కర్నూల్ జిల్లా సీపీఐ(ఎం) విస్తృతస్థాయి సమావేశాన్ని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు.

వెనిజులా అధ్యక్షుని అరెస్టు చేసి బంధించడం సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. గతంలో ఈ పథకం అమలు కోసం 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవని, కానీ నేడు 60 శాతం నిధులు కేటాయిస్తాం 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం ప్రకటించడం చాలా దుర్మార్గమన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో పేదలు, కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహత్మ గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విద్యుత్ వ్యవస్థను కూడా ప్రయివేట్ పరం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇది జరిగితే పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లు అంచనా ఉండగా ఇప్పటివరకు రూ.30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. మరి 90 శాతం ప్రాజెక్టు పనులు ఎలా జరిగాయని జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యల పైన చర్చ జరగలేదని, ఎమ్మెల్యేలు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకున్నారని అన్నారు. వ్యవసాయ రైతులకు రూ.12,000/-, మహిళలకు రూ.2500/- నిరుద్యోగులకు  2 లక్షల ఉద్యోగాలు భర్తీ , కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం, ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

 హైదరాబాదు పరిసరాలలో డ్రగ్స్  పెద్ద మొత్తంలో బయటపడడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రధానంగా యువత తీవ్రంగా నష్టపోతారని, జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం పూర్తిగా కట్టడి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల సమస్యల పైన ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పార్టీ జిల్లా కమిటీలకు సూచించారు. ఈ విస్తృత సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మానాయక్, ఆర్ శీను, ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ నాయక్, శంకర్ నాయక్, జిల్లా నాయకులు మల్లేష్, సైదులు, శివ వర్మ, నాగరాజు బాలస్వామి, రామయ్య దశరథం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -