నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రైతులకు గురువారం సేంద్రియ వ్యవసాయం, కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యాన శాఖ అధికారి రాజు మహిళా రైతుల ఉద్దేశించి మాట్లాడుతూ.. పంటల సాగులో రసాయన మందుల వాడకం తగ్గించి, సేంద్రీయ పద్ధతులలో కూరగాయలు పండించి ఆరోగ్యానికి కాపాడుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం, సహజ పద్ధతుల సాగు, వర్మీ కంపోస్ట్ తయారీ, జీవామృతం, ఘన జీవామృతం వంటి అంశాలతో పాటు దేశి కూరగాయల విత్తనాలు సంరక్షణ వాటి వినియోగంపై అవగాహన కల్పించారు.
దేశీ విత్తనాల వినియోగం, పంటల నాణ్యతను పెంచడం కాకుండా వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి, రోగనిరోధక, తక్కువ ఖర్చుతో సాగు వంటి ప్రయోజనాలు వివరించారు. రైతులు స్వయంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. సేంద్రియ, దేశీ విత్తనాల ఆదరిత వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయనాల వాడకం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సి ఎఫ్ చింత శ్రీనివాస్, భార్గవ్, శ్రీకాంత్, గ్రామ కార్యదర్శి పి.రమేష్, వివోఏ మనోరంజని, గ్రామ మహిళ రైతులు, తదితరులు పాల్గొన్నారు.



