Saturday, January 10, 2026
E-PAPER
Homeఖమ్మంమంత్రి తుమ్మల కృషి ఫలితం

మంత్రి తుమ్మల కృషి ఫలితం

- Advertisement -

అగ్రి హబ్‌ గా పేట వ్యవసాయ కళాశాల
రూ.8 కోట్లతో మరో ల్యాండ్ మార్క్ కు శ్రీకారం
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట లోని వ్యవసాయ కళాశాల త్వరలోనే అగ్రి హబ్‌ గా మరింత విస్తరించనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర కృషి ఫలితంగా కళాశాలలో కీలక మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం యూనివర్సిటీ రూ.8 కోట్లు నిధులను కేటాయించారు.

ఈ అభివృద్ధి పనులలో భాగంగా కళాశాల ప్రాంగణంలోని నమూనా, ప్రయోగ పంటల సాగు క్షేత్రాలకు అంతర్గత రహదారుల నిర్మాణం, అలాగే బాలికల కోసం మరో వసతి గృహం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ చర్యలతో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రైతులకు మరింత సౌకర్యాలు అందనున్నాయి.

చరిత్రాత్మక నేపథ్యం
1989 ఆగస్టు 22 న, అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యేగా,మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తొలి దశలోనే ఈ వ్యవసాయ కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు 1983 జూలై 17 న అప్పటి సీఎం ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఈ కళాశాల ఏర్పాటు అంశం చర్చకు వచ్చినప్పుడు, అశ్వారావుపేట కు కళాశాల రావాలనే ప్రతిపాదనను తుమ్మల ముందుకు తెచ్చి, తక్షణమే మంజూరు చేయించారు.దాంతో 250 ఎకరాల భూమి సేకరించి 35 మంది విద్యార్థులతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ప్రారంభమైంది.

ప్రస్తుత స్థితి –  విస్తరణ
నేడు ఈ కళాశాలలో ఏటా సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా, ఇప్పటివరకు 2,500 మందికి పైగా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడ్డారు. పాల కేంద్రంగా ఉన్న రేకుల షెడ్డులో ప్రారంభమైన కళాశాల నేడు శాశ్వత భవనాలు, బాలురు,బాలికల వసతి గృహాలు, ప్రయోగ భవనాలు, ఆధునిక తరగతి గదులు, విశాల క్రీడా ప్రాంగణాలతో విస్తరించింది.

కళాశాలకు అనుబంధంగా అటవీ, ఉద్యాన, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, సెరికల్చర్, కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాలు ఏర్పాటు కావడంతో అశ్వారావుపేట పరిసరాలు వ్యవసాయ – ఉద్యాన హబ్‌ గా రూపుదిద్దుకున్నాయి.శాస్త్రవేత్తల సూచనలతో వందలాది నర్సరీలు, యాంత్రీకరణ ద్వారా రైతుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

భవిష్యత్ అవసరాలు
త్వరలో పీజీ కోర్సులు, అనుబంధంగా ఉద్యాన కళాశాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం మరింత అభివృద్ధి అవసరం ఉంది. ప్రస్తుతం 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఈ కళాశాలకు మరో బాలురు వసతి గృహం, అకడమిక్ బ్లాక్, ఇండోర్ ఆడిటోరియం అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కళాశాలకు రానుండగా, రైతులతో మమేకమై ఆధునిక వ్యవసాయ యంత్రాలు, సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రవేత్తల అవగాహన సదస్సుల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు మరోసారి బీజం పడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -