– లీఫ్ అండ్ సాయిల్ అనాలసిస్ ప్రక్రియకు శ్రీకారం
– రెడ్డి ల్యాబ్ తో ఒప్పందం
– వెళ్ళండించిన ఉన్నతాధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులకు నాణ్యమైన సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఆయిల్‌ఫెడ్ కీలక అడుగు వేసింది. ఆయిల్‌ఫాం సాగులో చీడపీడల ముందస్తు నివారణ, నిలకడైన దిగుబడులు సాధించేందుకు Leaf and Soil Test Lab (లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్ ల్యాబ్ – ఆకు,మృత్తికా నైజం విశ్లేషణ ప్రయోగ ప్రక్రియ)ను నేడు (శుక్రవారం) రైతు మేళా శిబిరంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాలను ఆయిల్‌ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్ కుమార్,పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి లు గురువారం వెల్లడించారు.
ఆకు – నేల విశ్లేషణ ప్రాముఖ్యత
Soil and Leaf Analysis అనేది మొక్కల్లోని పోషక లోపాలు, పోషకాల కొరత లేదా అధికత (toxicity)ను గుర్తించేందుకు ఉపయోగించే శాస్త్రీయ పద్ధతి. నేల,ఆకుల రసాయన కూర్పును విశ్లేషించడం ద్వారా సరైన ఎరువుల మోతాదు, నీటి నిర్వహణ,పంట రకాల ఎంపికపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని ద్వారా ఎరువుల వాడకం సమర్థవంతమైన, దిగుబడులు మరియు నాణ్యత మెరుగుపడతాయి. నేల విశ్లేషణలో పీహెచ్ స్థాయి, సేంద్రియ పదార్థం, స్థూల–సూక్ష్మ పోషకాలు, లవణీయత, నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని కొలుస్తారు. ఆకు విశ్లేషణలో ఆకుల రంగు, ఆకారం, పరిమాణ మార్పుల ఆధారంగా పోషక లోపాలు (ఉదా: పసుపు, ఎరుపు/ఊదా రంగులు) గుర్తిస్తారు. మొక్కల పెరుగుదల మధ్యలో లోప లక్షణాలు కనిపించినప్పుడు ఈ విశ్లేషణ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
రైతులకు లాభాలు
నేల – ఆకుల విశ్లేషణ కలిసి పంట ఆరోగ్యంపై సంపూర్ణ చిత్రం ఇస్తాయి.
ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం, పంటల ఎంపికపై సరైన సిఫార్సులు అందుతాయి.
పోషక లోపాల సరిదిద్దడం తో దిగుబడి, నాణ్యత పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి.
ఈ ప్రక్రియ అమలుకోసం రెడ్డి ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని, రైతులకు నాణ్యమైన సేవలు అందించే దిశగా ఆయిల్‌ఫెడ్ ముందడుగు వేస్తోందని వారిరివురు స్పష్టం చేశారు.



