Saturday, January 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజలపై పర్యావ'రణం'

ప్రజలపై పర్యావ’రణం’

- Advertisement -

మానవాళి అభివృద్ధిలో పర్యావరణానిది కీలకపాత్ర. అది ఎంత ఆరోగ్యంగా ఉంటే, మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ అంశాలన్నింటినీ పర్యావరణం అంటారు. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రజారోగ్యంలోని అతిపెద్ద రంగాలలో ఒకటి. ఒక ప్రాంతంలోని భౌతిక, రసాయన, సాంస్కృతిక వాతావరణం, ఆ ప్రాంత పర్యావరణ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని కాలుష్య స్థాయి, జీవావరణ వైవిధ్యం, పరిశుభ్రమైన తాగునీరు లభ్యత, పారిశుధ్య పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకత వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.6 కోట్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.

అంతేకాక, వందకు పైగా అనారోగ్యాలు పర్యావరణ ఆరోగ్య సమస్యలతో నేరుగా ముడిపడి ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది.155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి ”పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణ మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ సమస్యలలో వాయు కాలుష్యం ఒకటి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 42 లక్షల నుంచి 70 లక్షల మంది మరణిస్తున్నట్టు అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి పది మందిలో తొమ్మిది మంది అధిక కాలుష్య కారకాలను కలిగి ఉన్న గాలిని పీల్చుకుంటున్నారు. నేడు ఢిల్లీ పరిస్థితి చూశాం. ప్రజలు ఇంట్లో కూడా మాస్కుతోనే జీవిస్తున్నారు. వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, భూమిపై సముద్ర మట్టం సంవత్సరానికి సగటున 3.2 మి.మీ పెరుగుతోంది.

ఈ శతాబ్దం చివరి నాటికి అది దాదాపు 0.7 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల వల్ల సముద్ర తీర ప్రాంతాలు ముంపునకు గురై, సుమారు 34 కోట్ల నుంచి 48 కోట్ల మంది సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ప్రతి గంటకు 300 ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో అడవులు నరికివేయబడుతున్నాయి. ఇలాగే కొనసాగితే, 2030 నాటికి ఇప్పుడున్న అడవులలో కేవలం పదిశాతం మాత్రమే మిగిలి ఉండవచ్చు. మహాసముద్రాలు భూమి వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌లో 30శాతం గ్రహిస్తాయి. అధిక కార్బన్‌ డయాక్సైడ్‌ వల్ల సముద్ర జలాలు ఆమ్లీకరణకు గురవుతున్నాయి. దీనివల్ల 2050 నాటికి పగడపు దిబ్బలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన నేలలో కనీసం 3 నుంచి 6శాతం సేంద్రీయ పదార్థం ఉంటుంది.

కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఇది ఉండాల్సిన దాని కంటే చాలా తక్కువగా ఉంది. ఇది నేల కోతకు సంకేతం. మన దేశంలో పర్యావరణ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వానికి, పరిశ్రమలు, ప్రజలు కలిసి కృషి చేయాలి. ఈ పని కోసం అనేక కోణాల నుండి ప్రయత్నాలు అవసరం. పర్యావరణాన్ని పరిరక్షంచడానికి ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. గాలి, నీటి కాలుష్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, జీవవైవిధ్యం వంటి విషయాలకు సంబంధించిన నియమాలను మరింత పటిష్టం చేయాలి. పర్యావరణ పనితీరు సూచిక వంటి సంస్థల నుండి లభించిన డేటాను ఉపయోగించుకుని కాలుష్యానికి సంబంధించిన బలహీనమైన ప్రాంతాలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలను కనుగొనాలి.

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని వేగవంతం చేయాలి. బొగ్గు వంటి ఇంధనాల వాడకాన్ని దశలవారీగా తగ్గించి, దాని స్థానంలో కాలుష్య రహిత సాంకేతికతను ప్రోత్సహించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. దీనిలో పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడం, ప్రజా రవాణా, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడాన్ని నివారించడం వంటి చర్యలు ఉంటాయి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించడం, వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించడం, చెరువులు, నదుల వంటి నీటి వనరులను కాపాడటం కూడా అవసరం. స్థానిక ప్రజలను పర్యావరణ పరిరక్షణలో భాగం చేయడం ద్వారా, ఈ ప్రయత్నాలు మరింత విజయవంతమవుతాయి.

  • డి.జనక మోహన రావు,8247045230
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -