కళాశాల భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ- మేడ్చల్‌
కళాశాల భవనంపై నుంచి దూకి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సంజరు (21) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని కండ్లకోయలో సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం రాత్రి అతను కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ సంజరును స్థానికంగా ఉన్న సీఎంఆర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సంజరు మృతి చెందాడు. ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love