రూ.45 కోట్ల సమీకరణ లక్ష్యం
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రైమ్ ఫ్యూల్ బ్రాండ్‌తో ఆటో ఎల్‌పీజీ గ్యాస్‌ను విక్రయించే యాక్సియమ్ గ్యాస్ ఇంజనీరింగ్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్నట్టు తెలిపింది. జనవరి చివరి వారంలో ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రమోటర్ ఎంఎస్ బనాని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బనాని మాట్లాడుతూ.. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.40-45 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం ఒక్కోటి రూ.5ముఖ విలువ కలిగిన 94,92,000 వరకు కొత్త ఈక్విటీ షేర్ల జారీ చేయనున్నామన్నారు. ఫ్రైమ్ ప్యూయల్ బ్రాండ్ కింద ప్రస్తుతం తెలంగాణలో 11, మహారాష్ట్రలో 8, కర్నాటకలో 2 చొప్పున ఆటో ఎల్‌పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లను కలిగి ఉన్నామని చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న తమ సంస్థ ఐపిఒ నిధులలో రూ.27 కోట్లను మూలధన వ్యయ అవసరాలు, విస్తరణ కోసం, రూ.7 కోట్లను కంపెనీ తీసుకున్న కొన్ని బకాయి రుణాలను పాక్షకంగా ముందస్తు చెల్లింపు లేదా తిరిగి చెల్లించడం కోసం ఉపయోగించాలని భావిస్తోందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో తమ సంస్థ రూ.89.83 కోట్ల రెవెన్యూ ఆర్జించడం ద్వారా రూ.7.74 కోట్ల లాభాలను సాధించిందన్నారు. ఇంతక్రితం ఏడాది రూ.74.53 కోట్ల రెవెన్యూ.. రూ.5.74 కోట్ల లాభాలను నమోదు చేసిందన్నారు.



