Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతర పనుల్లో జాప్యం

జాతర పనుల్లో జాప్యం

- Advertisement -

‘మేడారం’ సందర్శకులకు ఇబ్బందులు
నిర్ధిష్ట గడువులో పూర్తికి గుత్తేదార్లపై తీవ్ర ఒత్తిడి
ఇంకా పూర్తికాని గద్దెల వద్ద టైల్స్‌ పనులు


నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరలో నిర్ధిష్ట కాల వ్యవధిలో పనులు పూర్తవుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 18వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో పనులను సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదార్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల చుట్టూ గ్రానైట్‌ స్టోన్‌ పరచడంలో కార్మికులు నిమగమయ్యారు. ఈ పనులతో సందర్శకులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. రెండు, మూడ్రోజులుగా ముందే దర్శనం చేసుకొని వెళ్లాలని భావించి మేడారంకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. హడావుడి పనులతో అటు గుత్తేదార్లకు, ఇటు భక్తులకు తీవ్ర అసౌకర్యంగా పరిణమించింది. ఈనెల 10వ తేదీన పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించినా, ఈ మేరకు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో నిర్ధిష్ట గడువును 15వ తేదీ వరకు పొడిగించే అవకాశమూ లేకపోలేదు.

ఆలస్యంగా టెండర్లు పిలవడమే కారణం
నిరంతరం పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించినా, పనుల మంజూరు, గ్రౌండింగ్‌, టెండర్లను పిలవడంలోనే తీవ్ర జాప్యం జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో గద్దెల చుట్టూ రూ.5 కోట్లతో క్యూ లైన్లు, షెడ్‌ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఆలస్యంగా టెండర్లు పిలవడమేనని విశ్వసనీయంగా తెలిసింది. ”ఇప్పుడు తమపై ఒత్తిడి తెస్తే తాము మాత్రం ఏం చేయగలమని కాంట్రాక్టర్లు, అధికారులు అంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలంటే టెండర్లను ముందస్తుగా ఖరారు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటూ అభిప్రాయపడుతున్నారు.

రోడ్డు పనుల్లోనూ జాప్యం
జాతర పరిసర ప్రాంతాల్లో పలు గ్రామాలకు రహదారుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. నేటికీ ఈ పనులను పూర్తి చేయలేకపోయారు. గద్దెల చుట్టూ నిర్మిస్తున్న క్యూలైన్లు, క్యూలైన్లలో ఉన్న భక్తులకు నీడనిచ్చేలా పెద్ద పెద్ద షెడ్‌లను నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రధాన గేటు ముందు అటు జంపన్నవాగు, ఇటు చిలుకలగుట్ట, మరోవైపు బస్టాండ్‌కు వెళ్లే కూడలిలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మరో రెండ్రోజుల్లో పూర్తి చేసే అవకాశముంది. అలాగే, కన్నెపల్లికి వెళ్లే దారిలో జంపన్నవాగు నుంచి కొత్తూర్‌ వైపు వాగుకు ఒకవైపున సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. కొత్తూరు జంక్షన్‌ వద్ద పనులు పూర్తి కాలేదు.

కొండాయి నుంచి తీసుకువచ్చే గోవిందరాజుల పూజరుల కోసం ఊరట్టంలో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం సైతం పూర్తి కాలేదు. ప్రత్యామ్నాయ రహదారులు ఊరట్టం నుంచి కొండాయి వయా దొడ్ల, మల్యాల నుండి చిన్నబోయినిపల్లి వరకు రహదారి నిర్మించాల్సి ఉండగా, ప్రతి జాతరలో ఈ రహదారిని విస్మరిస్తున్నారు. ఇక్కడ నుంచి చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు ఈ జాతరకు వస్తుంటారు. కేవలం మట్టితో రోడ్డు వేసి చేతులు దులుపుకుంటున్నారు. రహదారుల పనులు పూర్తికాకపోవడంతోపాటు అధికారుల తీవ్ర ఒత్తిడితో హడావుడిగా పనులు చేస్తుండటంతో నాణ్యతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మేడారం జాతరలో జరిగే పనులన్నింటికీ జంపన్నవాగులోని ఇసుకను వినియోగిస్తున్నారు.

పారిశుధ్యం, తాగునీటి పైనా నిర్లక్ష్యం
జాతర ప్రాంగణంలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాదు, తాగునీటి సరఫరాకు పైప్‌లైన్‌ నిర్మాణాలు సైతం పూర్తి కాలేదు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణంతో జాతర పూర్తి కాగానే విసర్జితాలతో వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు అంటున్నారు. మంత్రులు, అధికారులు జాతర ముగిస్తే మేడారాన్ని పట్టించుకోరని, పారిశుద్ధ్యం పనులపై ఫోకస్‌ పెట్టరని, దాంతో స్థానికంగా ప్రజలే కాకుండా పశువులు సైతం రోగాలబారిన పడి మృత్యువాతపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.100 కోట్లతో పనులు
మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలు చుట్టూ వైట్‌ గ్రానైట్‌తో నిర్మిస్తున్న ప్రాకారాలు 95 శాతం పనులు పూర్తయినట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హన్మకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. గద్దెల చుట్టూ వైట్‌ గ్రానైట్‌ పరిచే పనులు నేటికీ పూర్తి కాలేదు. ఇదిలావుంటే ప్రాకారం 8 రాతి గేట్లను నిలపెట్టారు. మధ్య, మధ్యలో ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా బొమ్మలు చెక్కిన సాండ్‌ స్టోన్‌ పలకలను అమర్చుతున్నారు. ఈ పలకలు అమర్చడం కూడా పూర్తి కాలేదు. ‘నవతెలంగాణ’ సందర్శనలో గద్దెల చుట్టూ టైల్స్‌ వేసే ప్రక్రియ జరుగుతుంది. 8 రాతి గేట్లకు ముందు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే దారిలో పెద్ద రాతి గేటు నిర్మాణ దశలోనే ఉంది.

ఈ రాతి స్తంభాలను రెండు క్రేన్‌లను ఉపయోగించి నిలబెడుతున్నారు. ఇది పూర్తయితేనే ప్రాకారం చుట్టూ సాండ్‌స్టోన్‌ పలకలను ఏర్పాటు చేసి, గ్రిల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, నెలరోజులుగా పెద్ద సంఖ్యలో ప్రజలు మేడారంలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఒకవైపు గద్దెల ప్రాంగణంలో పనులను వేగవంతం చేయడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యంగా పరిణమించింది. నెలరోజులు ముందే పూర్తి చేయాల్సిన పనులను వాయిదాలు పెడుతూ చివరకు ఈనెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని తుది గడువు ప్రకటించినా పూర్తయ్యే పరిస్థితి లేదు. 10వ తేదీనాటికి పూర్తికాని పక్షంలో ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -