Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంపర్యావరణ వ్యవస్థలో మానవులూ అంతర్భాగమే!

పర్యావరణ వ్యవస్థలో మానవులూ అంతర్భాగమే!

- Advertisement -

సామాన్యుల హక్కుల కోసం నిలిచిన పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌

బెంగళూరు : మాధవ్‌ గాడ్గిల్‌..మానవులను పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగా చూసిన వ్యక్తి. ప్రపంచ పర్యావరణ ప్రక్రియలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ప్రత్యేక వన్యప్రాణుల సంరక్షణ కంటే మానవ హక్కులకే ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి. ప్రజా పర్యావరణ పరిరక్షకుడు. ‘ప్రకృతి పరిరక్షణ పట్ల ఉన్నత స్థాయి వర్గాల పట్టణ దృక్పథం’ నుండి గాడ్గిల్‌ క్రమేపీ సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిలిచే, పోరాడే పర్యావరణవేత్తగా రూపాంతరం చెందారు. అడవులనే తమ ఆవాసాలుగా చేసుకున్న వారి కోసం నిరంతరంగా ఆలోచించారు. వారిని ఆయన ‘భారతదేశ సామాన్యులు’గా పిలిచారు. వారిని ఈ పర్యావరణ వ్యవస్థలో భాగస్వాములుగా చూశారు. 2023లో ప్రచురితమైన గాడ్గిల్‌ జీవిత చరిత్ర ‘ఎ వాకప్‌ ది హిల్‌ : లివింగ్‌ విత్‌ పీపుల్‌ అండ్‌ నేచర్‌’లో ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకున్నారు. యువ పర్యావరణ పరిరక్షకుడిగా తన తొలి అడుగులు గురించి చెబుతూ ఆయన, ”ప్రకృతిని పరిరక్షించడం అంటే అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, జాతీయ పార్కులు వంటి వాటి ద్వారా రక్షణ కల్పించడం అనే పట్టణ ప్రాంత పరిరక్షణా దృక్పథాన్ని నేను ఆనాడు అనుసరించాను.

అందుకోసం వాటిలోపల గల ఆవాసాలను తొలగించడం కూడా అవసరమనే అభిప్రాయంతోనే వున్నాను.” కానీ 1980ల్లో అదంతా మారింది. ప్రకృతిని పరిరక్షించాలన్న నా ఆశయానికి ప్రత్యామ్నాయ మార్గాలను గురించి ఆలోచించడం ఆరంభించాను. భారతదేశ సామాన్యులకు వ్యతిరేకంగా కన్నా వారితో కలిసి పనిచేయాలని భావించాను. ” అని గాడ్గిల్‌ చెప్పుకున్నారు. శాస్త్రీయ పరిశోధనకు, ప్రజల సాధికారతకు మధ్య గల అంతరాన్ని తగ్గించడంలో ఆయన మమేకమై పోయిన తీరు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా అందరినీ కలుపుకుని పోవాలనే ఆయన వైఖరి ఆయన చూపిన ప్రభావం, స్ఫూర్తి కచ్చితంగా ఎన్నటికీ నిలిచి వుంటుంది. ప్రకృతి వనరులను పరిరక్షించడమొక్కటే కాదు, ఆ పర్యావరణ వ్యవస్థలతో పాటూ జీవనాన్ని కొనసాగించే వారి సంక్షేమం కూడా కీలకమన్నది గాడ్గిల్‌ వాదన. ఆయన పుస్తకానికి ముందు మాట రాస్తూ ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌, ”పర్యావరణ పరిరక్షణ రంగంలో ఆయన అద్భుతమైన సేవలందించారు, మరీ ముఖ్యంగా పర్యావరణ భద్రతపై ఆయన ఆలోచనా విధానం, కార్యాచరణ మానవతావాద విధానంతో మేళవించబడిందని వ్యాఖ్యానించారు.

పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల మండలి ఛైర్మన్‌గా 2011లో ఆయన ఒక నివేదిక ఇచ్చారు. పశ్చిమ కనుమల ప్రాంతంలో విపత్తులను నివారించాలంటే తమ నివేదికలోని సిఫార్సులు అమలు చేయడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కొత్త రహదారులు లేదా భవననిర్మాణాలను అనుమతించరాదని, వాలుగా వున్న ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధిపనులు చేపట్టరాదని, రాళ్ళ క్వారీయింగ్‌పై నిషేధం విధించాలని ఇలా పలు సిఫార్సులు చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన పశ్చిమ కనుమల్లోని స్థానిక జాతులతోకలిసి పనిచేశారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జీవ వైవిధ్యత సంరక్షణ కోసం కూడా కృషి చేశారు. 2003లో తీసుకువచ్చిన జీవ వైవిధ్యతా చట్టం, అటవీ హక్కుల చట్టం, 2006 రూపకల్పనల్లో ఆయన గణనీయంగా సేవలందించారు. వర్షాధార అటవీ ప్రాంతాలను పరిరక్షించడానికి 1970ల్లో కేరళలో సేవ్‌ ది సైలెంట్‌ వ్యాలీ ఉద్యమానికి గాడ్గిల్‌ నాయకత్వం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -