Sunday, January 11, 2026
E-PAPER
Homeమానవిఆమె నిర్ణయం మార్చుకోవాల్సిందే..

ఆమె నిర్ణయం మార్చుకోవాల్సిందే..

- Advertisement -

మనకు నచ్చిన వ్యక్తితో జీవితం సంతోషంగా ఉంటుంది. అదే మనల్ని ఇష్టపడే వ్యక్తితో మరింత సంతోషంగా ఉంటుంది. కానీ ఈ అవకాశం చాలా మందికి దొరకదు. కొందరైతే మనల్ని కోరి వచ్చిన వారిని అహంకారంతో వదులుకుంటారు. ఒక్కసారి వదులుకున్నామా ఆ తర్వాత ఎంత బాధపడినా ఇక ఫలితం ఉండదు. ఇలా బాధపడేవారు కూడా మన చుట్టూ కొందరుంటారు. ఇక వాళ్లు మనకు దొరకు అనుకున్నప్పుడు మొండి పట్టుదల వదిలి జీవితంలో ముందుకు పోవడమే ఉత్తమం. లేదంటే అసలు బతుకే లేకుండా పోతుంది. అలాంటి కథనమే ఈ వారం కథనం మీ కోసం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో చూద్దాం…

సంధ్యకి సుమారు 30 ఏండ్లు ఉంటాయి. ఇంకా పెండ్లి కాలేదు. ఆమెకు ఓ అన్న, చెల్లి ఉన్నారు. వీళ్లిద్దరికీ పెండ్లి జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. సంధ్యని పెండ్లి చేసుకోమంటే, ఆసక్తి చూపించలేదు. ‘నాకు పెండ్లిపై నమ్మకం లేదు’ అంటూ చేసుకోలేదు. ఇంట్లో పెండ్లి గురించి ఒత్తిడి మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి ‘ప్రస్తుతం నేను రాజు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. ఒప్పుడు అతను కూడా నన్ను ప్రేమించాడు. అయితే ఇప్పుడు పెండ్లి చేసుకుందామంటే ఒప్పుకోవడం లేదు. అతను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను ఒప్పుకోలేదు.

కాబట్టి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అంటే అతను ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా అతనితో మాట్లాడి మా పెండ్లి జరిపించాలి’ అంది. మేము సరే అని రాజుకి ఫోన్‌ చేసి పిలిపించాము. అతను చెప్పేది విన్నాక మాకు ఆశ్చర్యమేసింది. అది ఏమిటంటే ‘నేను సంధ్యను ప్రేమించిన విషయం వాస్తవమే, చదువుకునే రోజుల్లో ఆమంటే నాకు పిచ్చి. సంధ్య లేకుండా నేను ఉండలేను అనేంతగా ఇష్టపడే వాడిని. ఆ విషయం నా స్నేహితులందరికీ తెలుసు. అందరూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు ఆమె ఒప్పుకోలేదు. అందరి ప్రయత్నం విఫలం కావడంతో నేను వేరే చోటికి వెళ్లిపోయాను. అక్కడే ఉద్యోగం చూసుకున్నాను.

ఆమెకు దూరంగా ఉంటేనైనా మరచిపోయే అవకాశం ఉంటుందనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నా బాధ చూసి మా చెల్లి కూడా సంధ్యతో మాట్లాడింది. అయినా ఇష్టం లేదనే చెప్పింది. చివరకు మా అమ్మానాన్న కూడా వాళ్ల ఇంటికి వెళ్లి నా ప్రేమ గురించి చెప్పి ఇద్దరికీ పెండ్లి చేస్తామన్నారు. నేను ఇన్ని ప్రయత్నాలు చేసినా సంధ్య ఒప్పుకోలేదు. ‘నా అందం చదువుకు నువ్వు సరిపోవు’ అంది. అందరి ముందు నన్ను అవమానించింది. ఆ బాధ నుండి నేను బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. సంధ్య నన్ను కాదన్న తర్వాత చాలా కుంగిపోయాను. ఉద్యోగం మానేశాను. తాగుడుకు బానిసయ్యాను. వీటి నుండి బయటకు రావడానికి నా చిన్ననాటి స్నేహితురాలు రవళి సహాయం చేసింది. నా కుటుంబం కూడా అండగా నిలబడింది. దాదాపు రెండు మూడేండ్లు పట్టింది తిరిగి మామూలు మనిషిని కావడానికి. అప్పుడు నాకు అర్థమయింది ఏమిటంటే ప్రేమించడం అంటే వ్యాపారం కాదు, తిరిగి ఆశించడానికి. నేను ప్రేమించిన వ్యక్తి బాగుండాలి. నేను ఏమైనా ఫర్వాలేదనుకున్నాను. అయితే రవళి నన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తుంది. కానీ నేను ఎప్పుడూ ఆమెను ఆ దృష్టితో చూడలేకపోయాను.

ఆమె కూడా నాకెప్పుడూ తన ప్రేమ గురించి చెప్పలేదు. సంధ్య దూరమైన తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా ‘ఒక స్త్రీ కోసం తాగుడుకు బానిసయ్యావు’ అంటూ కోప్పడ్డారు. కానీ రవళి మాత్రం నన్ను జాగ్రత్తగా చూసుకుంది. ఆమె చూపించిన ప్రేమతోనే నేను ఇప్పుడు జీవితంలో నిలబడ్డాను. వ్యాపారం కూడా చేస్తున్నాను. రవళీ నేను రెండేండ్ల కిందటే పెండ్లి చేసుకున్నాము. ఇప్పుడు మాకు ఒక పాప కూడా ఉంది. పాప నా జీవితంలోకి రావడంతో సంధ్య గురించి పూర్తిగా మర్చిపోయాను. సంధ్య నాకు రెండు నెలల కిందట కలిసింది. అప్పటి నుండి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటాను’ అంటుంది. ఆమె కలిసిన మొదటి సారే నేను సంధ్యకు చెప్పేశాను. నాకు పెండ్లి అయింది ఒక పాప కూడా ఉందని. కానీ దానికి ఆమె ఒప్పుకోవడం లేదు. పైగా రవళితో మాట్లాడి ఒప్పిస్తానంటుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం సంధ్యపైన నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పుడు నా భార్య, పాపనే నా ప్రపంచం. మీరే నాకు న్యాయం చేయండి’ అన్నాడు.

అంతా విన్న తర్వాత ‘సంధ్యా అతనికి పెండ్లి అయిపోయింది. నిన్ను కోరి వచ్చినప్పుడు వద్దనుకున్నావు. ఇప్పుడు అతని జీవితంలో భార్యా, పాప ఉన్నారు. అలాంటి వ్యక్తిని కోరుకోవడం మంచిది కాదు. పైగా ఇప్పుడు అతనికి నీపై ప్రేమ కూడా లేదు. పిచ్చిగా ఆలోచించడం మానేసి, నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది. లేదంటే నీ వల్ల ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి. నీకు మంచి ఉద్యోగం ఉంది. హాయిగా బతకగలిగే ధైర్యం ఉంది. అనవసరంగా ఇంకొకరి భర్తను కోరుకొని ఇబ్బందులు పడొద్దు. గడిచిపోయిన కాలాన్ని తలచుకుంటే మిగిలేది బాధనే. నీ తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని చూసి పెండ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించ్చు. నువ్వు ఇలాగే మొండిగా ఉంటే నీకు భవిష్యత్తే లేకుండా పోతుంది. ఇప్పుడు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. మంచి నిర్ణయంతో తీర్చిదిద్దుకుంటావో లేదా ఇలాగే అతని గురించి ఆలోచిస్తూ బతుకుతావో నీ ఇష్టం. కానీ అతను మాత్రం ఇక నీ జీవితంలోకి రాడనే వాస్తవాన్ని మాత్రం గర్తించు అని చెప్పి పంపించాము.

  • వై వరలక్ష్మి,
    9948794051
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -