Sunday, January 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితీరు మారుతున్న జాతర

తీరు మారుతున్న జాతర

- Advertisement -

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం జాతర స్వరూపం మారుతుందా? రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల పండుగ కోసం కోట్ల ప్రజానికం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ఈసారి రూ.251 కోట్ల భారీ బడ్జెట్‌తో జాతరను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. కోయ, ఆదివాసి వంశీయుల చరిత్రను ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తోంది. అయితే ఈ అలంకారాలు, హంగులు ఒక ఎత్తయితే, మరోవైపు చరిత్రాత్మకమైన వనదేవతల మేడారం జాతర రానురానూ ఆర్థికభారంగా మారుతుందనే అభిప్రాయం పలువురినుంచి వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులు సరే అనుకున్నప్పటికీ ఆ అభివృద్ధి పేరుతో మేడారం జాతర కార్పొరేట్‌ రంగు పులుముకుంటున్నదనే వాదనలో నిజం లేక పోలేదు. చరిత్రకలిగిన మేడారం జాతరను అధునాతన సౌకర్యాలతో దిర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తమవుతూనే, ఈ అభివృద్ధి పనులు జాతర సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు సామాన్య భక్తుడి జేబుకు చిల్లు పడే పరిస్థితులు కూడా కనిపిస్తోంది. కాంక్రీట్‌ కట్టడాల వల్ల అడవి పల్చబడుతోందని, గిరిజన సంప్రదాయాలకు భిన్నంగా జాతర ‘కమర్షియల్‌’ అవుతోందని పలువురు స్థానిక ఆదివాసీలు, విశ్లేషకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే మేడారం ప్రయాణం ఇప్పుడు సామాన్యులకు పెనుభారంగా మారే అవకాశం ఉంది. జాతర సమయంలో ఆర్టీసీబస్సులు అందుబాటులో ఉన్నా, రద్దీ దృష్ట్యా ప్రయివేటు వాహనాలను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువ. ఈ క్రమంలో ట్యాక్సీలు, ఆటోలు సాధా రణ చార్జీల కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండటం సహజం! మరోవైపు మేడారం చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, తాత్కాలిక గుడారాల అద్దెలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. గతంలో చెట్ల కింద డేరాలు వేసుకునే వెసులుబాటు ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్థలాలను కూడా వాణిజ్యపరంగా మార్చడంతో సామాన్యు డికి వసతి కష్టమైపోయే పరిస్థితి గతంకంటే ఎక్కుగా ఉంటుంది. ”ఒకప్పుడు మేడారం అంటే ఎడ్లబండి కట్టుకుని, ఇంటి నుంచి చద్దిమూటలు తెచ్చుకుని అమ్మవార్లను దర్శించుకునే వారు. కానీ ఇప్పుడు కనీసం తలదాచు కోవడానికి అద్దె గది కావాలన్నా, స్నానం చేయడానికి నీళ్లు కావాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని బాధపడు తున్నారు. ప్రభుత్వం వసతులపై దృష్టి పెట్టినట్లే ధరల నియంత్రణపై కూడా దృష్టి సారించాలి.ఆదివాసీల అస్తిత్వం దెబ్బతినకుండా, వనదేవతల జాతర స్వరూపం కాపాడాలి.వనదేవతల దర్శనం ధనవంతుడే కాదు, డబ్బుముల్లెలేని పేదవాడికి కూడా సులభంగా దొరికినప్పుడే అసలైన జాతర అవుతుంది.
-రాజేందర్‌ దామెర (దారా)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -