Sunday, January 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికొత్త దాడి!

కొత్త దాడి!

- Advertisement -

ప్రపంచ రాజకీయ వేదికపై అమెరికా మరోసారి తన అసలు స్వరూపాన్ని స్పష్టంగా బయటపెట్టింది. అరవై ఆరు అంతర్జాతీయ సంస్థలనుంచి, ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఐరాస ఆధ్వర్యంలోని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పిఎ) నుంచి తప్పుకోవడం, వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పంద వ్యవస్థను పక్కనబెట్టడం వంటి నిర్ణయాలు కేవలం పాలనాపరమైన చర్యలు కావు. అమెరికా సామ్రాజ్యవాద రాజకీయాలు ఎదుర్కొంటున్న లోతైన సంక్షోభానికి సంకేతాలు. చాలామంది చెబుతున్నట్టు ఇది ”వెనుకడుగు” కాదు, ”కొత్త దాడి.” సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఉపయోగించే సాధనాలను మార్చుకుంటున్న దశ ఇది. అంతర్జాతీయ సంస్థలు ఇక పూర్తిగా తమ ప్రయోజనాలకు సేవ చేయడం లేదని భావించినప్పుడు, వాటిని పక్కనబెట్టి నేరుగా శక్తి, మార్కెట్‌, సైనిక బలంపై ఆధారపడటమే ఈ వ్యూహం. అంటే నియమాల రాజకీయానికి బదులుగా బల రాజకీయానికి మారడం.

నిజానికి ఐక్యరాజ్యసమితేమీ ప్రపంచ ప్రజల స్వతంత్ర సంకల్పానికి ప్రతిరూపం కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, సామ్రాజ్యవాద శక్తుల మధ్య జరిగిన రాజకీయ రాజీ ఫలితమది. భద్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం.. ఇవన్నీ ఐక్యరాజ్య సమితిని సమానదేశాల సమాఖ్యగా కాకుండా, బలమైన దేశాల ఆధిపత్య వ్యవస్థగానే చూపిస్తాయి. అయినప్పటికీ వలస విముక్తి ఉద్యమాలు, నాటి బలమైన సోషలిస్టు శిబిరం, మూడో ప్రపంచ దేశాల పోరాటాల వల్ల మానవ హక్కులు, ఆరోగ్యం, మహిళల హక్కులు, వాతావరణ పరిరక్షణ వంటి అంశాల్లో కొంత ప్రజాపక్ష పాత్ర అది పోషించాల్సి వచ్చింది. ఇదే ఇప్పుడు అమెరికాకు అసౌకర్యంగా మారింది. అమెరికా ఇప్పటికీ అతి పెద్ద సైనిక శక్తి, ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటి. అయినా అంతర్జాతీయ సంస్థల నుంచి వెనక్కి తగ్గుతోంది. కారణం స్పష్టం. ఒకప్పుడు అమెరికా చెప్పిందే అంతర్జాతీయ నిర్ణయం. ఇప్పుడు ప్రపంచ రాజకీయ సమతుల్యత మారుతోంది. చైనా, రష్యా వంటి శక్తులు ఎదుగుతున్నాయి. మూడో ప్రపంచ దేశాలూ స్వతంత్ర స్వరం వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ముందు రెండు మార్గాలే ఉన్నాయి. నియమాలను అంగీకరించడం లేదా తిరస్కరించడం. అమెరికా రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఇది ట్రంప్‌ వ్యక్తిగత మొండితనం కాదు. సామ్రాజ్యవాద రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన ఆధిపత్యాన్ని సైనిక చర్యలకంటే ఈ అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల ద్వారానే నిర్మించింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలే అమెరికాకు బంధనాలుగా మారాయి. అందుకే వాటిని తెంచుకోవటం, చింపేయడం… ఇదే కొత్త వ్యూహం.అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగడం అంటే ప్రపంచ సమస్యల పరిష్కారం నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని ఏకపక్షంగా, కార్పొరేట్‌ ప్రయోజ నాలకు అనుకూలంగా మలచుకో వాలన్న బరితెగింపుకు పూనుకోవడం. వాతావరణ ఒప్పందాల తిరస్కరణ అంటే ప్రకృతిని మరింత నిర్దాక్షిణ్యంగా దోచుకునే స్వేచ్ఛను కోరుకోవడం. యూఎన్‌ఎఫ్‌పిఎ నుంచి బయటపడటం అంటే మహిళల, పిల్లల, పేద దేశాల ఆరోగ్య హక్కులనుపెట్టుబడికి తాకట్టు పెట్టడం. ఇంతకాలం అమెరికా ”మానవ హక్కులు”, ”ప్రజాస్వామ్యం”, ”అంతర్జాతీయ నియమాలు” అనే నైతిక తెరవెనుక తన అసలు ముఖాన్ని దాచుకుంది. ఇప్పుడు ఆ తెర కూడా అవసరం లేదన్న భావన కనిపిస్తోంది. ఇది ఆత్మవిశ్వాసం కాదు. సంక్షోభంలో పడిన శక్తి లక్షణం. డిప్లమసీ స్థానంలో దబాయింపు, సహకారం స్థానంలో బెదిరింపు.. అంటే నియమాల స్థానంలో బలమే చివరిభాషగా మారుతోంది.

దీని ప్రభావం ప్రపంచమంతా పడుతుంది. ”అంతర్జాతీయ బాధ్యతలు అవసరం లేదు, దేశ ప్రయోజనాల పేరుతో ఏదైనా చేయొచ్చు” అన్న సందేశం మితవాద, జాతీయవాద శక్తులకు ప్రోత్సాహం ఇస్తుంది. వాతావరణ సంక్షోభం, శరణార్థుల సమస్య, మహమ్మారుల వంటి సరి హద్దులు లేని సమస్యలకు ఏకపక్ష పరిష్కారాలు సాధ్యం కావు. అయినా కూడా అమెరికా అదే దిశలో నడుస్తోంది. అయితే, అమెరికా వెనక్కి తగ్గినచోట చైనా, రష్యా వంటి శక్తులు ఆ ఖాళీని నింపే ప్రయత్నం చేస్తాయా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగిలి ఉంటుంది. కాకపోతే ఒక విషయం మాత్రం స్పష్టం… ప్రపంచం ఇక ఒకేశక్తి ఆదేశాలతో నడిచే దశను దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజాపక్ష అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలా? లేక కొత్త ఆధిపత్యాలకు తలవంచాలా? అన్న రాజకీయ ఎంపిక మూడో ప్రపంచ దేశాల ముందున్నది. ఐక్యరాజ్య సమితి సంపూర్ణ ప్రజాస్వామ్య సంస్థ కాకపోయినా, ఇప్పుడు దాన్ని వదిలేయడం సామ్రాజ్య వాదానికే లాభం. దాన్ని మరింత ప్రజాపక్షంగా మార్చేందుకు పోరాడటమే ఇప్పుడు ప్రపంచం ముందున్న లక్ష్యం.

మొత్తంగా ఈ పరిణామంలో గుర్తించాల్సిన సత్యమేమి టంటే.. ఇది ”అమెరికా వెనుకడుగు” కథ కాదు. ఇది సంక్షోభంలో ఉన్న సామ్రాజ్యవాదం ముసుగు తొలగించుకుని ముందుకు వస్తున్న కథ. ఈ మార్పును కేవలం ట్రంప్‌ వ్యక్తిత్వానికి కట్టబెట్టడమంటే అసలు ప్రమాదాన్ని గుర్తించకపోవడమే. అంతిమంగా ఈ ‘కొత్త దాడ’ి వ్యూహానికి ప్రపంచ ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు? ఐక్యతను బలోపేతం చేస్తారా? లేక బలమైనవారి ముందు తలవంచుతారా? ఈ ఎంపికలే ప్రపంచ రాజకీయ దిశను నిర్ణయిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -