– అందుకే ఒప్పందం కుదరకపోవచ్చు : అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలు
– ఖండించిన భారత్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనందున భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుత్నిక్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పట్ల తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, ఈ విషయంలో అసంతృప్తిగా వున్న అమెరికా, భారత్‌పై టారిఫ్‌లను పెంచుతుందని ట్రంప్ కొద్దిరోజుల క్రితం చెప్పిన నేపథ్యంలో లుత్నిక్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ బెదిరింపులు వెలువడ్డాయి. ఇప్పటివరకు, ఆ ఒప్పందం కోసం ఆరు దఫాలుగా చర్చలు జరిగాయి. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులపై 50శాతం టారిఫ్‌లను విధించే అంశాన్ని పరిష్కరించే ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కూడా ఇందులో వుంది.
వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ట్రంప్‌తో మాట్లాడాల్సిందిగా మోడీని తాను కోరానని గురువారం లుత్నిక్ చెప్పారు. కానీ భారత్ అందుకు అసౌకర్యంగా వుందన్నారు. అందుకే మోడీ, ట్రంప్‌కు కాల్ చేయలేదన్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, కానీ వాటన్నింటికన్నా ముందుగానే భారత్‌తో ఒప్పందం కుదురుతుందని తాను భావించానని చెప్పారు. కానీ భారత్ మాత్రం ఒకే, మేం సిద్ధంగానే వున్నాం అని చెబుతోంది, కానీ దేనికి సిద్ధంగా వున్నారన్నది నా ప్రశ్న అని లుత్నిక్ చెప్పారు. ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గల అనేక అవకాశాలను భారత్ పోగొట్టుకుందన్నారు.
తిరస్కరించిన భారత్
కాగా లుత్నిక్ వ్యాఖ్యలను భారత్ శుక్రవారం తిరస్కరించింది. గతేడాది కాలంలో ఇరువురు నేతలు 8సార్లు మాట్లాడుకున్నారని తెలిపింది. చర్చల గురించి అమెరికా సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు.
అనేక సందర్భాల్లో ఒప్పందం ఖరారయ్యే పరిస్థితులు వచ్చాయి. కానీ పరస్పరం సహకరించుకునే రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం పరస్పరం లాభదాయకంగా వుండాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఆ దిశగా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చూస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలో రష్యాతో చమురు కొనుగోలు విరమించుకునేలా రష్యా వాణిజ్య భాగస్వాములపై 500శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించగా, వాటన్నింటి గురించి తమకు తెలుసని, భారత్ వాటిని నిశితంగా పరిశీలిస్తోందని వ్యాఖ్యానించారు.
ట్రంప్‌తో మోడీ మాట్లాడలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



