Sunday, January 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబోల్సోనారోకు షాక్‌

బోల్సోనారోకు షాక్‌

- Advertisement -

– ఆయనకు జైలు శిక్ష తగ్గించేది లేదు
– బిల్లును వీటో చేసిన బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా
– ప్రజాస్వామ్యంపై దాడిచేసిన వారిని క్షమించే హక్కు తనకు లేదని స్పష్టీకరణ
బ్రసిలియా :
బ్రెజిల్‌లో తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు దోషిగా తేలిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోకు గట్టి షాక్‌ తగిలింది. బోల్సోనారోకు జైలు శిక్షను తగ్గించే బిల్లును బ్రెజిల్‌ అధ్యక్షుడు లుయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా వీటో చేశారు. గతేడాది కాంగ్రెస్‌ ఆమోదించిన ఈ బిల్లుతో శిక్ష తగ్గొచ్చని భావించిన బోల్సోనారోకు, ఆయన మద్దతుదారులకు తాజా చర్యతో గట్టి షాక్‌ తగిలినట్టయ్యింది. కాగా ప్రజాస్వామ్యంపై దాడి చేసినవారిని క్షమించే హక్కు తనకు లేదని లులా స్పష్టం చేశారు.
బోల్సోనారో జైలు శిక్షను తగ్గించేందుకు గతేడాది ప్రతిపక్ష బలం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ ఆమోదించిన బిల్లును లులా తిరస్కరించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవారికి లాభం చేకూరుస్తుందని అన్నారు. ”భవిష్యత్‌ పేరుతో గతాన్ని మరిచిపోవడానికి మనకు హక్కు లేదు” అని సోషల్‌ మీడియా పోస్ట్‌లో లులా రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యంపై దాడి చేసిన చర్యలను మన్నించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ వీటో నిర్ణయం 2023 జనవరి 8న బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో జరిగిన దాడికి మూడేండ్లు పూర్తయిన రోజు రావటం గమనార్హం.
ఆ రోజున బోల్సోనారో మద్దతుదారులు అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టులపై దాడి చేశారు. వేలాది మంది ఆందోళనాకారులు ప్రభుత్వ భవనాల్లోకి చొరబడ్డారు. అధ్యక్షుడు లులాను అధికారంలో నుంచి తొలగించేందుకు సైన్యం జోక్యం చేసుకునేలా ప్రేరేపించడమే ఈ దాడి లక్ష్యమని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ దాడి ఘటనను 2021 జనవరి 6న అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై చేసిన దాడితో పోలుస్తున్నారు. కాగా బోల్సోనారోల 27 ఏండ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చే ప్రయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి కేసుల్లో ఆయన దోషిగా తేలారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -