Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజాసాబ్‌ నిర్మాతలకు నిరాశ

రాజాసాబ్‌ నిర్మాతలకు నిరాశ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ది రాజాసాబ్‌’ చిత్ర నిర్మాతలకు శుక్రవారం హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ రాష్ట్ర హోం శాఖ ఇచ్చిన మెమోను కొట్టేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తోందంటూ నగరానికి చెందిన న్యాయవాది విజరు గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టిక్కెట్ల ధరల పెంపునకు మెమో దాఖలు చేసే అధికారం హొంశాఖ కార్యదర్శికి లేదని పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సిటీ పోలీస్‌ కమిషనర్లకు మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతుల అధికారం ఉందన్నారు. రాజాసాబ్‌ సినిమా టిక్కెట్ల ధరను ఈ నెల 18వ తేదీ వరకు పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి విచారించారు. మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. జీవో 120 ప్రకారం టిక్కెట్ల ధరను పెంపుదల చేసే పరిమితి రూ.350లు మాత్రమేనని గుర్తు చేశారు. కాబట్టి మెమో చెల్లదని, పాత ధరలకే టిక్కెట్లను విక్రయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భారీ వ్యయ్యంతో రాజాసాబ్‌ చిత్ర నిర్మాణం జరిగిందనీ, ఇందులో వచ్చే రాబడిలో 20 శాతం సినీ కార్మికుల సంక్షమం కోసం వెచ్చిస్తామని నిర్మాతల తరఫు న్యాయవాది ప్రతివాదన చేశారు. టిక్కెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం జారీ చేసిన మెమోలో లోటుపాట్లు ఉన్నాయనీ, చిన్న ధియేటర్లలో ఎక్కువ రేటు, భారీ స్క్రీన్‌లు ఉన్న హాళ్లలో సాధారణ ధర నిర్ణయించడం సరికాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. టికెట్‌ ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను కొట్టివేసింది. విచారణ సందర్భంగా హొం శాఖ అధికారుల తీరును తప్పుపట్టింది. తెలివిగా మెమోలను ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించింది. కోర్టుకు సెలవుల ముందు ఈ తరహాలో మెమోలను జారీ చేయడం పరిపాటిగా మారిందని తప్పుపట్టింది. టిక్కెట్ల ధరలను పెంపునకు మెమోలను జారీ చేయడానికి వీల్లేదని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సినిమా సినిమాకు వేర్వేరుగా మెమోలను ఎలా జారీ చేస్తారని నిలదీసింది. టికెట్‌ ధరలను పెంచబోమని సంబంధిత శాఖ మంత్రే స్వయంగా ప్రకటించారని గుర్తు చేసింది. అయినప్పటికీ టిక్కెట్ల రేట్ల పెంపునకు మెమోలను ఎందుకు ఇస్తున్నారని నిలదీసింది అనేకసార్లు ఆదేశించినప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరులో మార్పు ఎందుకు రావడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మెమో జారీ చేసే అధికారికి నిబంధనలు తెలియవా అని మండిపడింది. సినిమా టిక్కెట్ల ధరల విషయంలో చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జారీ చేసిన ఉత్తర్వులకు విరద్ధుంగా మెమో ఉందని తప్పుపట్టింది. ఈ ఉత్తర్వులతో సంతృప్తి చెందకపోతే సమీక్ష కోరాలని, లేనిపక్షంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని హితవు చెప్పింది. ‘ది రాజాసాబ్‌’ సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు హొం శాఖ అనుమతి ఇచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 12వ తేదీ నుంచి 18 తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు అనుమతిని ఇచ్చింది. టికెట్‌ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని చిత్ర నిర్మాతల నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ మెమో అస్పష్టంగా ఉందని, సినిమా థియేటర్‌ చిన్న వాటిలో ధర పెంపు, పెద్ద వాటిలో ధర పెంపు లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల నష్టం జరుగుతోందని నిర్మాతల వాదన వీగిపోయింది.

నవదీప్‌పై కేసు కొట్టివేత
సినీ యాక్టర్‌ పి. నవదీప్‌పై నమోదైన డ్రగ్స్‌ కేసును కొట్టివేస్తూ జస్టిస్‌ జె.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలను జారీ చేశారు. ఫిర్యాదు, చార్జిషీట్‌, సాక్షల వాంగ్మూలాల్లో పిటిషనర్‌ పేరు లేదనీ, చార్జిషీట్‌లో 29వ నిందితుడిగా నవదీప్‌ పేరుందనీ, ప్రాసిక్యూషన్‌ను పరిశీలిస్తే మాదక ద్రవ్యాలను పిటిషనర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనపై ఉన్న డ్రగ్స్‌ కేసును కొట్టేయాలని నవదీప్‌ వేసిన పిటిషన్‌తో తీర్పు వెలువరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -