Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంజల జగడాలు వద్దు

జల జగడాలు వద్దు

- Advertisement -

తెలుగుజాతి ప్రయోజనాలే ముఖ్యం
2027 మార్చిలోగా ‘పోలవరం’ పూర్తి
రాయవరం సభలో ఏపీ సీఎం చంద్రబాబు
రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

రాజమహేంద్రవరం : ‘సముద్రంలో కలిసే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? నీళ్లు వద్దు… గొడవలే కావాలని కొందరు బయల్దేరారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల అంటూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు గొడవలు కాదు… తెలుగు జాతి ప్రయోజనాలు కావాలి. పోలవరం పూర్తయితే ఆ నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో ఆయన శుక్రవారం పర్యటించారు. తొలుత రాయవరం గ్రామంలో సర్వే చేసిన పంట భూములను పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఎటువంటి అవినీతి అక్రమాలకూ తావులేకుండా రైతులకు రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను అందిస్తున్నామన్నారు.

రీసర్వే పూర్తి అయిన 6,688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలను వరుసగా మూడోమారు ముఖ్యమంత్రిగా నిర్వహించే అదృష్టం తనకు దక్కిందన్నారు. 2027 మార్చిలోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఏటా మూడు వేల టిఎంసిల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఇందులో 300 టీఎంసీలు వాడుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. పోలవరాన్ని ఒక యజ్ఞంగా భావించి పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం జరిగిందన్నారు. గత పాలకుల తప్పిదాల వల్ల రూ.వెయ్యి కోట్లతో డయాఫ్రం వాల్‌ మళ్లీ కట్టాల్సి వస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో నీటి ఎద్దడి లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాలో వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని విమర్శించారు.

కృష్ణా డెల్టాలో నీళ్లను పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తామన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ వివాదాలను పరిష్కరించడానికే రెండేళ్లు పట్టిందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును పిపిపిలో కడుతుంటే ముద్దు కానీ, పిపిపి కింద మెడికల్‌ కాలేజీలు కడితే వద్దంటున్నారని విమర్శించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. దేశంలోకొచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయని పేర్కొన్నారు. త్రిబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ తరహాలో ప్రధాని మోడీ, పవన్‌ కల్యాణ్‌తో కలిసి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుంతలు లేని రహదారులను తయారు చేస్తున్నామని, రెండు రోజుల్లోనే 40 కిలోమీటర్ల రోడ్డు వేసి రికార్డు సృష్టించామని తెలిపారు.

ట్రూ డౌన్‌ పేరుతో విద్యుత్తు బిల్లుల భారం తగ్గించామన్నారు. రూ.4,500 కోట్లు పెంచుకోమని ఇఆర్‌సి అనుమతి ఇస్తే, ప్రజాప్రయోజనాల దృష్ట్యా వద్దని చెప్పామని తెలిపారు. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తున్నామన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్సు పేరిట సుపరిపాలన అందించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జగ్గన్నపేట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించామన్నారు. సంక్రాంతికి కోడి పందేలు సంప్రదాయమే కానీ, జూదాల జోలికి వెళ్లొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ జి.హరీష్‌మాథూర్‌, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -