ఎదుర్కొనేందుకు సిద్ధంకండి : ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఫిబ్రవరి 1న సెంట్రల్ బడ్జెట్ నేపథ్యంలో దిశా నిర్దేశం
స్పర్శ పోర్టల్ గుదిబండగా మారిందంటున్న ఆర్థికశాఖ
నేడు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ ప్రత్యేక భేటీ
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై మార్గదర్శనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తోందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో రాష్ట్రాలకు ఉన్న వెసులుబాట్లు, అవకాశాలకు అది పెద్ద ఎత్తున గండి కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి.. తద్వారా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉపాధి లాంటి చట్టాలకు నిధులను ఎలా రాబట్టుకోవాలనే అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సెంట్రల్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలపై స్పష్టమైన నివేదిక నివ్వాలని ఆయన సూచించారు. వాటి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేయాలంటూ ఆయన తాజాగా దిశా నిర్దేశం చేశారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ రామకృష్ణారావు శనివారం ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఉపాధి హామీ చట్టం పేరుతోపాటు దాని నియమ నిబంధనలను కేంద్రం ఇటీవల పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈ చట్టానికి నూటికి నూరు శాతం నిధులను కేంద్రమే భరించేది. ఇప్పుడు ఆ వాటా 60 శాతానికి తగ్గిపోగా.. రాష్ట్రాలు 40 శాతం నిధులను వెచ్చించాలి. దీంతో తెలంగాణపై రూ.20 వేల కోట్ల భారం పడనుంది. దీంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే అన్ని రకాల నిధులు, గ్రాంట్లలో మోడీ సర్కార్ క్రమక్రమంగా కోతలు విధిస్తోంది.
గతంలో రూ.100 కేంద్రానికి వస్తే.. అందులో రూ.32 రాష్ట్రాలకు ఇచ్చేవారు. కానీ సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో రూ.20లను ముందే కట్ చేస్తున్నారు. మిగిలిన రూ.80లోనే రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. ఈ రకంగా చూసినప్పుడు రాష్ట్రాలకు చాలా తక్కువ మొత్తంలో నిధులు దక్కుతున్నాయి. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రూ.3 వేల కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ వాటికి అతీగతీ లేదు. మార్చితో 15వ ఆర్థిక సంఘం కాలపరమితి ముగియనుంది. త్వరలో రాబోయే 16వ ఆర్థిక సంఘం రికమండేషన్లు, సిఫారసులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఇవన్నీ రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వాటి ఖజనాలపై విపరీతమైన భారాలను మోపుతున్నాయి. ఇలాంటి కీలకాంశాలపై సవివరమైన నివేదికను సమర్పించాలంటూ సీఎం ఆర్థికశాఖను ఆదేశించారు.
స్పర్శ పోర్టల్.. ఓ గుదిబండ…
కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన స్పర్శ పోర్టల్ రాష్ట్రాలకు గుదిబండగా మారింది. గతంలో వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను.. ఇతర పథకాలు, కార్యక్రమాలకు మళ్లించుకునే వెసులు బాటు రాష్ట్రాలకు ఉండేది. తమకు వీలు కుదిరిన ప్పుడు, ఖజానాకు నిధులు వచ్చినప్పుడు ఏ పథకం నుంచి డబ్బులు తీసుకున్నారో, తిరిగి ఆ పథకానికి వాటిని మళ్లించే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చేవారు. దీని వల్ల అత్యంత ఆవశ్యకమైనవి, ప్రాధాన్యతగల పథకాలకు నిధులను మళ్లిం చుకుని, ఆ తర్వాత తిరిగి చెల్లించే అవకాశం రాష్ట్రాలకు ఉండేది. కానీ స్పర్శ పోర్టల్ వచ్చిన తర్వాత నిర్దేశిత పథకానికి కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత.. విధిగా, కచ్చితంగా దానికే నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది.
దీంతోపాటు కేంద్రం విడుదల చేసిన నిధులను వాడుకోవాలంటే.. రాష్ట్రం కూడా తన వాటా (మ్యాచింగ్ గ్రాంట్లు)లను విడుదల చేసి, సంబం ధిత వివరాలను కేంద్రానికి పంపాలి. లేదంటే అక్కడి నుంచి వచ్చే నిధుల్లో ఒక్క పైసా కూడా వాడుకోవటానికి వీల్లేని విధంగా నిబంధనలను కఠినతరం చేశారు. ఇలాంటి లక్ష్మణ రేఖలు, ఆర్థిక దిగ్బంధనాలతో తెలంగాణ అతలాకుతలమవుతోందని ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించి నట్టు అధికారులు తెలిపారు. వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేయాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ముఖ్య కార్యదర్ళులతో నిర్వహించబోయే ప్రత్యేక భేటీలో ఈ అంశాలన్నింటిపై చర్చించనున్నట్టు తెలిసింది.



