మోడీ సర్కార్‌కు గట్టి హెచ్చరిక ఇవ్వాలని నిర్ణయం
సీడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 16న ఎస్‌కేఎం ఆందోళనలకు మద్దతు
విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలి.. ‘వీబీ జీ రామ్ జీ’ని రద్దు చేయాలి : కార్మిక జాతీయ సదస్సు పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో కార్మిక హక్కులను హరిస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలకు విడనాడాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మె మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక కావాలని కార్మిక సంఘాల అఖిల భారత నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే, రైతు నడ్డి విరిచే సీడ్ బిల్లు (విత్తన బిల్లు) ముసాయిదాను, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని, జీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 16న దేశవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో, మండలాల్లో ఆందోళనకు ఎస్‌కెేఎం ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలిపారు.
శుక్రవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జీత్ భవన్‌లో కార్మిక జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సుదీప్ దత్తా (సీఐటీయూ), హరిద్వార్ సింగ్ (ఏఐటీయూసీ), అమిత్ యాదవ్ (ఐఎన్‌టీయూసీ), చంపా వర్మ (హెచ్‌ఎంఎస్), విజయ్ పాల్ సింగ్ (ఏఐయూటీయూసీ), సుచేత దే (ఏఐసీసీటీయూ), ఆర్‌కె మౌర్య (ఎల్‌పిఎఫ్), ఆర్‌ఎస్ డాగర్ (యూటీయూసీ) అధ్యక్షత వహించారు. ఎలమరం కరీం (సీఐటీయూ), అమర్జీత్ కౌర్ (ఏఐటీయూసీ), అశోక్ సింగ్ (ఐఎన్‌టీయూసీ), హర్భజన్ సింగ్ సిద్ధూ (హెచ్‌ఎంఎస్), ఆర్‌కె శర్మ (ఏఐయూటీయూసీ), రాకేష్ మిశ్రా (టీయూసీసీ), అషాబెన్ లతా బెన్ (ఎస్‌ఈడబ్ల్యూఏ), రాజీవ్ దిమ్రి (ఏఐసీసీటీయూ), జవహర్ సింగ్ (ఎల్‌పిఎఫ్), శత్రుజీత్ సింగ్ (యూటీయూసీ) మాట్లాడారు. ఈ సందర్భంగా డిమాండ్లు, భవిష్యత్తు కార్యాచరకు సంబంధించిన డిక్లరేషను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
”సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇచ్చినందుకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం)కు కతజ్ఞతలు. జాతీయ విద్యుత్ ఉద్యోగులు అండ్ ఇంజనీర్ల సమన్వయ కమిటీ (ఎన్‌సీసీఓఈఈఈ) కూడా ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులతో సంయుక్త సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి. విత్తన బిల్లు-2025, ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025, వీబీ-జీ ఆర్‌ఎఎంజీ చట్టం-2025లకు వ్యతిరేకంగా జనవరి 16న గ్రామ, బ్లాక్ స్థాయిలలో ప్రతిఘటన దినోత్సవాన్ని పాటించాలని ఎస్‌కెేఎం నిర్ణయించింది. ఈ ఆందోళనలో కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటాయి” అని పేర్కొన్నారు.
”రాబోయే సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి. .విస్తతంగా ప్రచారం ప్రారంభించాలి. పోరాటానికి తమ సంఘాలను సిద్ధం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు యావత్ కార్మిక వర్గానికి, శ్రామిక ప్రజలకు, ఇతర వర్గాలకు పిలుపునిస్తున్నాయి” అని డిక్లబరేషన్‌లో పేర్కొన్నారు. ”లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఇండియా బ్లాక్ పార్టీలు నిర్వహించిన నిరసన చర్యను స్వాగతిస్తూనే, కార్మికుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, దేశ ప్రజాస్వామ్య-లౌకిక స్వరూపాన్ని రక్షంచడానికి ఈ సమ్మెకు మద్దతుగా ముందుకు రావాలని కోరాయి. యువత, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం” అని తెలిపారు.
పాలక వర్గానికి గట్టి సందేశం కావాలి
”దేశంలో అన్ని రంగాలలోనూ పరిస్థితి దిగజారుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను అరికట్టడానికి, బలహీనపరచడానికి, దాడి చేయడానికి, కార్మిక వర్గ ఉద్యమాన్ని నియంత్రించేందుకు నాలుగు లేబర్ కోడ్‌లను రూపొందించింది. లేబర్ కోడ్‌లను పార్లమెంటులో ఆమోదించినప్పటి నుంచి దేశ కార్మికులు ఐదు భారీ సార్వత్రిక సమ్మెలను నిర్వహించారు. 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వంలోని పాలక వర్గానికి గట్టి సందేశం ఇవ్వాలి” అని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎలమరం కరీం అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే కేంద్ర కార్మిక సంఘాలు రంగాల వారీ ఆందోళనతో పాటు సార్వత్రిక సమ్మె వంటి బలమైన ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ”ఆర్థిక వ్యవస్థ క్షీణతతో ఆందోళనకరమైన పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై పెరిగిన దాడి, మైనారిటీలపై ద్వేషంతో కూడిన విషపూరిత ప్రచారాలు, అన్ని ప్రజాస్వామ్య సంస్థలపై దాడి, భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ, అసమ్మతి హక్కులను నిర్మూలించే ఎజెండాతో పాలక పార్టీ ఉంది” అని దుయ్యబట్టారు.
”రైల్వే, పోర్టు, డాక్స్, బొగ్గు గనులు, చమురు, ఉక్కు, రక్షణ, రోడ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, భీమా, టెలికాం, పోస్టల్, అణుశక్తి, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వంటి అన్ని వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా సేవలను ప్రైవేటీకరించడం, దేశీయ, విదేశీ బడా కార్పొరేట్‌లకు విక్రయించడం అనే తన ఎజెండాను ప్రభుత్వం కొనసాగిస్తోంది. తద్వారా స్వదేశీ పారిశ్రామిక వృద్ధి, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తోంది. 65 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, ప్రైవేట్ కంపెనీలకు రెగ్యులర్ కార్మికులను నిలిపివేయడం, కొత్త పోస్టుల సష్టిపై నిషేధాన్ని ఎత్తివేయడం తదితర డిమాండ్లను పూర్తిగా విస్మరించారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణతో పాటు మరిన్ని చర్యలతో రైతులకు వ్యతిరేకంగా విధానాలను నిరంతరం అనుసరిస్తోంది. ఇప్పటికీ వ్యవసాయ రంగం సంక్షభంలో ఉంది. దీని ఫలితంగా జీవనోపాధి కోసం నగరాలకు వలసలు పోతున్నారు” అని విమర్శించారు.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ మాట్లాడుతూ ”సామాన్య ప్రజలకు ప్రాథమిక సేవలను కోల్పోయి తీవ్ర అవినీతి తెరపైకి వస్తోంది. ప్రాథమిక సేవలు కుప్పకూలిపోతున్నాయి. కలుషితమైన తాగునీటితో ప్రజలు మరణిస్తున్నారు. విద్య, ఆరోగ్యం వ్యాపారీకరణ చెందడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వారు ఆ ఖర్చును భరించలేకపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అసమానతలు పెరుగుతున్నందున, చాలా మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జీవితానికి నెట్టబడుతున్నారు” అని పేర్కొన్నారు. కేంద్రంలోని పాలక ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరంతరం ఆందోళన బాటలో కొనసాగుతున్నాయని అన్నారు. ఇండియా ఒక దేశంగా సంతకం చేసిన అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను విస్మరించి, ఈ కార్మిక కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించేందుకు శక్తి బిల్లును, ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐల బిల్లులను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా మోదించుకుందని విమర్శించారు.



