– త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకాన్ని ప్రారంభించాలి
– 10 శాతం యారన్ సబ్సిడీని పవర్‌లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు అందించాలి : తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్‌లూమ్, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ అన్నారు. 10 శాతం యారన్ సబ్సిడీ కూడా వారికి ఇవ్వాలని, త్రిఫ్ట్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లపై పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి.వై నగర్‌లో చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్‌చార్జి ఏడీ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడుతూ.. కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం చేపట్టిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దానిలో భాగంగా సిరిసిల్ల పెద్దూరులో స్థలాన్ని కేటాయించి వర్క్ షెడ్లను నిర్మించిందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మికులకు అందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆ వర్క్ షెడ్లను ఇతర కంపెనీలు, పెట్టుబడిదారులకు అప్పజెప్పే యత్నం చేస్తోందని ఆరోపించారు. కార్మికుల కోసం నిర్మించిన వర్క్ షెడ్లను ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే వర్కర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది పవర్‌లూమ్ కార్మికులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 4 పవర్‌లూమ్స్ చొప్పున మంజూరు చేసి వారిని యజమానులను చేయాలని కోరారు.
వర్కర్ టూ ఓనర్ షెడ్లలో 60 వార్పిన్లను వార్పిన్ కార్మికులకు అందించాలని, వైపని కార్మికులకు కూడా వర్కర్ టు ఓనర్ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇందిరా మహిళాశక్తి చీరలకు పవర్‌లూం కార్మికులతోపాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ 10శాతం యారన్ సబ్సిడీ వెంటనే ప్రకటించి అందించాలన్నారు. 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి స్థానిక, ఇతర రాష్ట్రాల కార్మికులకు రావాల్సిన 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులను వెంటనే ఇవ్వాలన్నారు. త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, లేకుంటే రానున్న రోజుల్లో కార్మికులందరితో కలిసి పెద్దఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు కోడం రమణ నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేష్, ఉడుత రవి, బెజుగం సురేష్, బాస శ్రీధర్, అవధూత హరిదాసు, అన్సారి, కందుకూరి రమేష్, సబ్బని శ్రీకాంత్, శ్రీనివాస్, విజరు, సంపత్, సుధన్, నరేష్, సత్యనారాయణ, పోచమల్లు, రాజేశం, యాదగిరి పాల్గొన్నారు.
వైపని కార్మికులకు ‘వర్కర్ టూ ఓనర్’ వర్తింపజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



