Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేషన్‌ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

రేషన్‌ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

- Advertisement -

పారదర్శకతే లక్ష్యం.. జీరో టాలరెన్స్‌ పాటిస్తాం : పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర
బేగంపేట సర్కిల్‌లో రేషన్‌ షాపుల ఆకస్మిక తనిఖీ
లబ్దిదారులతో మాట్లాడి సరుకుల నాణ్యతపై ఆరా

నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా పేదలకు అందే నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత లోపిస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ బేగంపేట సర్కిల్‌ పరిధిలో ఉన్న పికెట్‌ ప్రాంతంలో పర్యటించి, రేషన్‌ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పికెట్‌లోని రేషన్‌ షాపు(ఎఫ్‌పీ షాప్‌ నం.873/870ను) సందర్శించిన కమిషనర్‌.. రేషన్‌ తీసుకుంటున్న కార్డుదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యత, పరిమాణం సరిగ్గా ఉంటున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. డీలర్ల ప్రవర్తన, సేవలపై వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. ప్రజలకు సరుకులు పారదర్శకంగా, న్యాయంగా, సమర్థవంతంగా అందించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

డీలర్లకు హెచ్చరిక
ఈ సందర్భంగా దుకాణాల నిర్వహణకు డీలర్లు భరిస్తున్న రవాణా, కూలీల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర ఖర్చుల వివరాలను కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తూనే.. ఆ సమస్యలను సాకుగా చూపి నిబంధనలు ఉల్లంఘించినా, సరుకులు పక్కదారి పట్టించినా ఉపేక్షించేది లేదని చెప్పారు. రేషన్‌ అక్రమాల విషయంలో జీరో టాలరెన్స్‌ పాటిస్తా మని, నిల్వల మళ్లింపు లేదా తక్కువ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొత్త షాపుల ఏర్పాటుకు ఆదేశం
రాష్ట్రంలో కొత్తగా 1.75 లక్షల రేషన్‌ కార్డులు జారీ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొత్త రేషన్‌ దుకాణాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 50 రేషన్‌ షాపుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌కు సూచించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ ఎం.రాజిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కె.శ్రీనివాస్‌, జిల్లా మేనేజర్‌ సాయి అరుణ్‌, ఏఆర్‌.కృష్ణవేణి, బేగంపేట సర్కిల్‌ ఏఎస్‌వో కె.సదానందం, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్మయి, సీనియర్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -