విత్తన సవరణ చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లు 2025ను ఉపసంహరించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
అంబర్‌పేటలో సీఐటీయూ జీపుజాత ప్రారంభం
ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతను శుక్రవారం బతుకమ్మకుంట లేబర్ అడ్డా వద్ద పాలడుగు భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోడ్‌ల ద్వారా కార్మికులకు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం, యూనియన్ ఏర్పాటు చేసే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేశారన్నారు. అలాగే, వేతనాలు పెంచాలని అడిగే హక్కు లేకుండా చేసి, ఉద్యోగ భద్రతను పూర్తిగా తొలగించారన్నారు.
యజమానులకు, పెట్టుబడిదారులకు, పారిశ్రా మికవేత్తలకు లాభాలు చేకూర్చేందుకే ఈ చట్టాలను రూపొందించారని, ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానమని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, విద్య, ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకమని చెబు తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను అమలు చేస్తుండటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లతోపాటు విత్తన సవరణ చట్టం, విద్యుత్ సవరణ బిల్లుు2025ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరుగుతున్నాయని తెలిపారు.
భవన నిర్మాణ రంగంలో లక్ష యాభై వేల మందికి పైగా కార్మికులు ఉన్నప్పటికీ వారికి పని కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాల్లో కూడా అమలు చేసి, భవన నిర్మాణ అడ్డా కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ జీపుజాత డీడీ కాలనీ, ఆంధ్ర బ్యాంక్, రామకృష్ణ వీకర్ సెక్షన్ కాలనీ, గొల్నాక లేబర్ అడ్డా చౌరస్తా, డీసీ మడ్డ, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్మికులను చైతన్య పరిచింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం.దశరథ్, కార్యదర్శి జె.కుమారస్వామి, నగర కోశాధికారి కె.అజరు బాబు, అంబర్‌పేట జోన్ కన్వీనర్ జి.రాములు, జోన్ సభ్యులు సోమయ్య, సుబ్బారావు, అడ్డా కార్మికులు ధర్మానాయక్, ఈర్యా, వినోద్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం తీసు కున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా జీపుజాతాలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర, తిప్పర్తి మండలంలో జీపు జాతాలు ప్రారంభమయ్యాయి.



