పలు జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూళు చేసి మోసం చేసిన ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ సునీల్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. అనంత్ ఈ సొల్యూషన్, విద్యాదాన్ ఎన్జీవో ఆర్గనైజేషన్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇంటర్వ్యులు నిర్వహించి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చిందన్నారు. రెండు నెలల వరకు అంత బాగానే ఉన్న తరువాత వేతనాలు రాకపోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించి బాధితులు తమకు ఫిర్యాదులు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టి ముగ్గురు ప్రధాన నిందితులు ఏ1 జట్టబోయిన మధు కిరణ్, ఏ2 మాదాసి సుధాకర్, ఏ3 నమ్మని సతీష్ అరెస్ట్ చేయగా ఏ4 సుజాత ఠాకూర్, ఏ5 లావణ్య పరారీలో ఉన్నారు.
లక్షల్లో వసూలు
నిందితుడు 2013లో “అనంత ఈ సొల్యూషన్” పేరిట కంపెనీని స్థాపించి, ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవాడని, అనంతరం 2023లో సుజాత ఠాకూర్, నామిని సతీష్, లావణ్యలతో కలిసి “విద్యాధాన్ ఆర్గనైజర్స్” అనే సొసైటీని రిజిస్టర్ చేసి, కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్ డబ్బులు దుర్వినియోగం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సి ఎస్ ఆర్ నిధులను కాజేయాలనే దురుద్దేశంతో, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మబలికి, నకిలీ ఉద్యోగాలను వివిధ ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో వచ్చేలా చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుండి రూ.2,50,000 వరకు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగా మొత్తం వందల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా 240 దాదాపు మంది అభ్యర్థులను మోసం చేయడం జరిగిందని తెలిపారు.
వివిధ పాఠశాలలు, కళాశాలలో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి వారికి మూడు నెలలు వేతనం అందించిన తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వీరికి సహకరించిన ఏజెంట్లుగా ఉన్నటువంటి రాహుల్, కోవా విటల్ (బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్) వరలక్ష్మి లపై ఇదివరకే పల్స్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. నిందితులను తదుపరి పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరి పాత్ర ఉన్నదని అంశంపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.
డబ్బులు అడిగే ముఠాను నమ్మొద్దు
ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూట సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అప్రమత్తతో వ్యవహరించాలని, డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసే వారిపై, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలతో వ్యవహరిస్తుందని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ బి గోపికృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో వన్ టౌన్ ఎస్సైలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ సిబ్బంది త్రిశూల్ పాల్గొన్నారు.



