Sunday, January 11, 2026
E-PAPER
Homeమానవిమనువాదులను తిప్పికొట్టడమే మా కర్తవ్యం

మనువాదులను తిప్పికొట్టడమే మా కర్తవ్యం

- Advertisement -

మహిళలు ఇంటికి పరిమితం అనుకునే రోజులవి. ఎంత చదివినా ఒక ఇంటికి పోవాల్సినామెకు చదువు అవసరమా అని భావించే కాలమది. అలాంటి రోజుల్లో మహిళలకు సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు పూనుకుంది అఖిల భారత మహిళా సంఘం(ఐద్వా). సాంప్రదాయపు సంకెళ్లు తెంచుకొని అడుగు బయట పెట్టేందుకు ధైర్యాన్ని నూరిపోసింది. మహిళా హక్కుల గొంతుకయ్యింది. సమసమాజ స్థాపనకై తపించే చైతన్యాన్ని నింపింది. అటువంటి ఐద్వా 14 అఖిల భారత మహాసభలకు పోరాటాల గడ్డ తెలంగాణ వేదిక కానుంది. జనవరి 25 నుండి 28 వరకు జరగబోతున్న మహాసభల ఏర్పాట్ల గురించి, తమ ముందున్న కర్తవ్యాల గురించి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మానవితో ముచ్చటించారు…

అఖిల భారత మహాసభలంటే చాలా పెద్ద కార్యక్రమం. ఏ ధైర్యంతో భుజాలకెత్తుకున్నారు?
ముందు కాస్త భయం వేసింది. చాలా పెద్ద కార్యక్రమం ఇది. మా వల్ల అవుతుందా లేదా అనే సందేహం వచ్చింది. అయితే మా కార్యదర్శి వర్గ సభ్యులతో చర్చించినప్పుడు అందరూ చాలా ఉత్సాహంగా చేద్దామన్నారు. అలాగే మా అఖిల భారత నాయకులు కూడా ‘మీకు రాష్ట్రంలో మంచి టీం వుంది, మీరు చెయ్యగలరు, మేము కూడా సహకరిస్తాం’ అని ధైర్యం చెప్పారు. దాంతో అడుగు ముందుకేశాము. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహిళామణులు దోపిడీ వ్యవస్థ‌పై తుపాకి ఎక్కి పెట్టిన నేల మనది. సాహసానికి మారుపేరైన ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది. ఇటువంటి నేలపై ఐద్వా అఖిల భారత మహాసభలు జరగడం పట్ల మా రాష్ట్ర కమిటీ చాలా సంతోషం వ్యక్తం చేసింది. అన్ని జిల్లా కమిటిలు ఎంతో ఉత్సాహంతో పని ప్రారంభించారు.

మహాసభల ప్రచారం కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
ప్రస్తుతం రాష్ట్రంలో 3,55,000 సభ్యత్వం ఉంది. అయితే ఈ మహాసభల సందర్భంగా కనీసం లక్ష కుటుంబాలనైనా కలవాలని నిర్ణయించుకున్నాం. దీని వల్ల ఐద్వాగా మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రచారం చేసుకోవడంతో పాటు మహాసభల గురించి కూడా మహిళలకు తెలుస్తుంది. అలాగే ఆర్థిక సహకారం కూడా అందుతుంది. అందుకే మొదట ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం. ముఖ్యంగా ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఐద్వాను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము.

వినూత్న కార్యక్రమాలేమైనా చేస్తున్నారా?
కాలేజీలలో, స్కూళ్లల్లో సెమినార్లు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రభాతభేరీలు, 2కే రన్‌ కూడా ప్లాన్‌ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా మహాసభల పేరుతో బెలూన్లు ఎగరేయాలని కూడా అనుకున్నాం. ఈ నెల 19 నుంచి 21 వరకు ప్రతి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా జెండాలను ఎగరవేయబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ రెండు రెండురోజుల పాటు జరుగుతాయి. మహిళా సాంస్కృతిక కార్యక్రమం కూడా ఒకటి నిర్వహిస్తున్నాం. దీని ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాలకు సీతక్క, సినీ నటి సుహాసినీని పిలవాలనుకుంటున్నాం. అలాగే వివిధ రంగాలలో విజయాలు సాధించిన వివిధ పోరాటాల్లో పాల్గొన్న మహిళల ఫొటోలతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నాం. అలాగే కవయిత్రులతో కవిసమ్మేళనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలకు పిలుపు నిచ్చాం.

మహా సభలకు ఎంత మంది ప్రతినిధులు హాజరుకానున్నారు?
26 రాష్ట్రాల నుండి 850 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు రాబోతున్నారు. కొంత పెరిగే అవకాశం కూడా ఉంది. సుమారు వెయ్యి మంది హాజరవుతారని అనుకుంటున్నాం. వీరంతా నాలుగురోజుల పాటు ఇక్కడ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మా భవిష్యత్‌ లక్ష్యాలను నిర్ణయించుకునేందుకు హైదరాబాద్‌ వేదిక కాబోతున్నందుకు చాలా గర్వపడుతున్నాం. మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావళే, అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి, కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, సుధాసందర్‌రామన్‌ వంటి సీనియర్‌ నాయకులు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు.

ఈ మహాసభల ద్వారా మహిళా లోకానికి మీరేం చెప్పబోతున్నారు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2001లో విశాఖపట్నంలో అఖిల భారత మహాసభలు జరిగాయి. ఇప్పుడు పోరాటాల గడ్డ తెలంగాణలో మొదటి సారి జరగబోతున్నాయి. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఎన్నో పోరాటలు చేసి, త్యాగాలు చేసిన గొప్ప నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు. వారి స్ఫూర్తితో ఇంత పెద్ద కార్యక్రమానికి మేము సిద్ధపడ్డాం. స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, రాష్ట్రం ఏర్పాటు.. ఇలా ప్రతి పోరాటంలో మహిళల భాగస్వామ్యం చాలా గొప్పది. ఇక్కడనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఉద్యమ చరిత్రను పరిశీలించిన మహిళలు పాల్గొన్న పోరాటాలు విజయవంతం అవుతాయి.

మహిళలు ఎన్నో పోరాటాలు చేసి కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకున్నారు. కానీ ఇప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. వీటిపై అవగాహన కలిగించేందుకే కాలేజీలో, పాఠశాలల్లో విద్యార్థినులకు సెమినార్లు పెడుతున్నాం. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని గురజాడ అప్పారావుగారు అన్నారు. దాన్ని నిజం చేయాలంటే ముందు అవగాహన పెరగాలి. మనకు అన్యాయం జరుగుతుందని అమ్మాయిలు, మహిళలు తెలుసుకోవాలి. అప్పుడే ప్రశ్నించగలుగుతారు. ఆ అవగాహన కల్పించేందుకే ఈ అఖిల భారత మహాసభల ప్రచారాన్ని ఉపయోగించుకుంటున్నాం.

ప్రస్తుతం మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
గడపదాటి బయటకు వచ్చి తమ శక్తిని నిరూపించుకునేందుకు మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. అన్ని రంగాలలో అనేక విజయాలు సాధిస్తున్నారు. కాని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తిరిగి మహిళలను నాలుగ్గోడలకే పరిమితం చేయాలని చూస్తుంది. మనుధర్మాన్ని ప్రచారం చేస్తూ మహిళలకు స్వేచ్ఛ అవసరం లేదంటున్నారు. పిల్లల్ని కనడానికి,, భర్తను సంతోషపెట్టడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికే మహిళ పుట్టిందంటున్నారు. అంతేకాదు ఆడవాళ్లు బటయకు రావడం వల్ల లైంగిక దాడులు జరుగుతున్నాయి, చదువుకోవడం వల్లనే ఎదురు తిరుగుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇలా మహిళలను అన్ని విధాలుగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు గొంతు ఎత్తకుండా ఉండేందుకు మూఢనమ్మకాలను పెంచిపోషిస్తున్నారు. అశ్లీల సాహిత్యాన్ని పెంచిపోషిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిపై మహిళలను చైతన్య పరిచి అందరినీ ఐక్యం చేసి భవిష్యత్‌లో ఐద్వా చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొనమంటూ పిలుపు ఇవ్వబోతున్నాం. విద్యార్థులు, యువత, కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు ఇలా అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలకు జరపబోతున్నాం.

మహాసభల విజయవంతం కోసం చేస్తున్న కృషి ఎలా ఉంది?
మా రాష్ట్ర కమిటి చాలా కృషి చేస్తుంది. ముందుగా మహాసభల ఏర్పాట్ల కోసం మొత్తం 25 కమిటీలు వేసుకున్నాము. అన్నింటికంటే ముందు మహాసభ జయప్రదం కోసం సెప్టెంబర్‌లోనే రిసెప్షన్‌ కమిటీ వేసుకున్నాము. శాంతా సిన్హా కమిటీ అధ్యక్షులు. జూలకంటి రంగారెడ్డి గౌరవాధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా, మా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి కోశాధికారిగా ఈ కమిటీ ఏర్పడింది. అప్పటి నుండే మా పని ప్రారంభించాం. ముందు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని అన్ని జిల్లాలోని నాయకత్వం, కార్యకర్తలు పనిలోకి దిగేలా గైడెన్స్‌ ఇచ్చాం. దానికి తగ్గట్టే మహాసభల విజయవంతంగా కోసం అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నాం. మిగిలిన ప్రజాసంఘాల వాళ్లు కూడా సహకరిస్తున్నారు.

మహాసభల సందర్భంగా బహిరంగ సభ ఏమైనా ఏర్పాటు చేశారా?
చేస్తున్నాము. ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో జనవరి 25 నుండి 28 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయి. మొదటి రోజు ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది. సభలో సుమారు 20 వేల మంది మహిళలు పాల్గొనబోతున్నారు. దీనికోసం జిల్లాలలో విస్తృత స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి గ్రామ కమిటీ నుండి ఒక వాహనం వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. వచ్చిన మహిళల కోసం తగిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -