Sunday, January 11, 2026
E-PAPER
Homeసోపతిమన సినిమాలు - మహిళలు

మన సినిమాలు – మహిళలు

- Advertisement -

130 సంవత్సరాల క్రితం 1896లో ప్రపంచానికి సినిమా కళ పరిచయమైంది. ఆ తర్వాత 1913లో దాదా ఫాల్కే ద్వారా రాజా హరిశ్చంద్ర సినిమాతో భారతీయ సినిమా రంగం ప్రారంభమైంది. గడచిన ఈ 113 సంవత్సరాల కాలంలో ఈ భారతీయ సినిమా మనకున్న 64 కళలకు 65వ కళగా జత చేరి మిగతా అన్ని కళలను తనలో కలిపేసుకుని మన జీవితల్లో ఒక భాగమైంది. మన దేశంలో మూగ చిత్రాల కాలంలోనే ఈ పరిశ్రమలోకి మహిళలు ప్రవేశించారు.ఐతే వారు ఈ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎదుర్కొన్న సమస్యలు సాధారణమైనవి కావు. అవి గత నూరేళ్లుగా వారి జీవితాలు నిరంతరం సంఘర్షణకు గురిగావడానికి కారణమవుతున్నాయి.

భారతదేశంలో సినిమాలు నిర్మాణమైన తొలినాళ్లలో నాటి సామాజిక కట్టుబాట్లు స్త్రీలను గడప దాటనివ్వలేదు. అసలు సమాజంలోని స్త్రీలకు ఆనాడు ద్వితీయ శ్రేణి సామాజిక గౌరవం, పరదాలు, తెరలు వారికి అడ్డంకులుగా నిలిచినవి. నాటి పురుషాధిక్య సమాజంలో నాటకాలు, సినిమాలలోకి స్త్రీలు రావడం అంత మామూలు మాట కాదు. తొలినాటి నాటకాల్లో స్త్రీ వేషాలను కూడా పురుషులే చేసేవారు. నిశ్శబ్ద సినిమాల్లో నటించడానికి వేశ్యావత్తిలోని స్త్రీలు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు కళావంతులు,నిమ్న జాతికి చెందినవారు, ఆంగ్లో ఇండియన్‌ స్త్రీలు ముందుకు వచ్చారు. దక్షిణ భారతదేశంలో నైతే వత్తి కులాల వారు, దళితులు కనిపిస్తారు. వీరిని ఆయా కళా రంగాలు ఆదరించినా, సమాజం నుండి తిరస్కారాలు, పరాభవాలు ఎదురైనవి. నిజానికి గడప దాటని కట్టుబాట్లు, పేదరికం, దారిద్రం, అవిద్యలు నాటి స్త్రీకి పెట్టని అడ్డుగోడలైనవి.పైగా బాల్య వివాహ వ్యవస్థ నాటి స్త్రీకి పెద్ద అవరోధంగా నిలిచింది.ఇన్ని ఆటంకాలు ఉన్నా కొందరు స్త్రీలు నాటి సినిమా రంగంలోకి ప్రవేశించి నిశ్శబ్ద చిత్రాల కాలం నుండి టాకీల శకం వరకు ఇంకా చెప్పాలంటే ఈ నాటి వరకు తమదంటూ ఉనికిని నిరూపించుకుంటూ స్త్రీలు లేని సినిమా ఉండదని నిరూపించారు. ధైర్యం చేసి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా సవ్యంగానే ఉంటుందనుకోవడం అత్యాశే అయింది. తెర ముందు, తెర వెనుక వారు ఎదుర్కొన్న సమస్యలు, వివక్షలు, అత్యాచారాలు, అవమానాలు తెరవెనుకనే ఉండిపోయినట్లే అనిపించినా అవి కాలక్రమేణా ఏదో రకంగా వెలుగులోకి వచ్చినవి.



ఇంతటి దుర్లభమైన పరిస్థితుల్లో కూడా చాలామంది మహిళలు తెరపై నటించడమే కాక తెరవెనుక సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించడం, సంగీతం చేయడం, పాడటం ఇంకా ఇతర రంగాల్లో సాంకేతిక నిపుణులుగా పని చేయడమే గాక మగవాళ్ళతో దీటుగా భారతీయ సినిమా పరిశ్రమ వికాసానికి తమదైన పాత్రను పోషించారు. సినిమా రంగంలో ఒక ఫాతిమా బేగం, జద్దన్‌ బాయి, దేవికారాణి, పెషన్స్‌ కూపర్‌, రూబీ మేయర్‌ సులోచన, జేబున్నీస వంటి వారు హిందీ చిత్ర రంగంలో కనిపిస్తారు. ఇక దక్షణ భారత సినిమా రంగంలో ఒక టి.పి. రాజలక్ష్మి, సురభి కమలాబాయి, పి.కె రోజీ, ఈణాక్షి రామారావు, తవమణీ దేవి, కాంచనమాల, కమలా కోట్నీస్‌, రావు బాల సరస్వతిదేవి, పుష్పవల్లి, కె. బి. సుందరాంబాళ్‌, సావిత్రి, కాంచన, శ్రీవిద్య, శ్రీదేవి, శోభ, సిల్మ్‌స్మిత, ప్రత్యూష వంటి తారలు మొత్తం చిత్ర రంగానికి బొమ్మ బొరుసులుగా కనిపిస్తారు. వీరిలో కొందరు విజేతలైనవారు, పరాజితలై పడిపోయిన వారూ వున్నారు. సమాజంలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా జెమినీ వాసన్‌, బాలూ మహేంద్ర, జెమినీ గణేషన్‌ లాంటి గిరీశాలు కూడా మనకు కనిపిస్తారు
భారతదేశంలో టాకీ సినిమాలు వచ్చిన మొదటి దశాబ్దంలో సినిమా పరిశ్రమలోకి మహిళలు ప్రవేశించడానికి చాలా అవరోధాలుండేవి. విద్యావంతులు, ఉన్నత సామాజిక వర్గాల నుండి స్త్రీలు బయటకి వచ్చి కెమెరా ముందు నటించి తెరపై కనిపించేందుకు అంత సులభంగా అంగీకరించేవారు కాదు. ఆనాటి సినిమా పరిశ్రమలోని పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి పరికిద్దాం.



”తొలుత ప్రపంచంలో ఏ దేశపు సినిమాలకైనా ప్రధానంగా హీరోయన్లే ప్రధాన ఆకర్షణ.. ఆ హీరోయిన్‌ పేరుతోనే ఆ సినిమా విజయవంతమవుతుంది. దర్శకుడు, ఇతర నటులు ఎవరన్నది పట్టించుకోరు. ఇక మనదేశంలో సినిమాల్లో నటిస్తున్న స్త్రీలలో ఎక్కువమంది సామాజికంగా అంతగా గౌరవంలేని వర్గాలనుండే తీసుకోబడ్డారు. ప్రధానంగా వీరిలో కళావంతులు, వారకాంతల వర్గాలకు చెందిన వారే ఎక్కువగా వుంటారు. ఇందుకు కారణం సినిమా కంపెనీలలో వున్న పరిస్థితులు. స్టూడియోలలో విద్యావంతులు, నాగరికత తెలిసినవారు తక్కువ. సినిమా సాంకేతిక పరిజ్ఞానం, నటనల గురించి అంతగా తెలియని పురుష పాత్రధారులే ఎక్కువ. వారందరూ కేవలం విగ్రహం, గాత్ర సౌందర్యాల మీద ఆధారపడే ఎన్నికై ఉండేవారు.
ఇంతే గాక నాటక, నాట్య, సినిమారంగంలో నటీ, నటులు ఎక్కువకాలం సన్నిహితంగా మెలగవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సంస్కార వంతులైన స్త్రీలు సినిమాల్లోకి రావడం చాలా కష్టం.
1936 నాటికి సినిమారంగంలోకి ప్రవేశించిన వారిలో నాట్యమే వత్తిగా గల కళావంతులైన స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రకారంగా మన దేశంలో కళాభివద్ధికి, కళా జీవనానికి కళావంతులు అధికంగా తోడ్పడ్డారు. సంస్కరణ వాదులు ఏమనుకున్నప్పటికీ కళావంతులే గనుక మన దేశంలో లేకపోయినట్లయితే భారతీయ నాట్యము, సంగీతము, నాటక కళలు మనదేశంలోనే గాక బయట దేశాలలో ఉనికిలో ఉండేవికావు. నేటికీ వారే భారతీయ సాంప్రదాయ నాట్య, సంగీత శాస్త్రాలను కాపాడుతున్నారంటే అతిశయోక్తికాదు. నాటికి ఉదయశంకరో, మేనకా దేవి వంటి నాట్యకళాకారులు ఉన్నారంటే వారి నాట్యకళా విజ్ఞానం ఎందరికి అందుబాటులో ఉన్నది? అందువలన సామాన్య ప్రజలలో ప్రాచీన కళలను కాపాడుతున్నది కళావంతులైన నాట్యకారిణులే అనేది నిర్వివాదాంశం.
ఈ క్రమంలో సినిమారంగానికి కూడా ఈ కళావంతులైన నాట్యకత్తెలే అవసరమయ్యారు. వీరందరికీ సినిమా శాస్త్రాన్ని, నాగరిక జీవన విలువలను బోధించి సంస్కరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉండేది. సినిమాకు సంబంధించిన పూర్తిస్థాయి విధి విధానాలైన వేషధారణలో కొత్త పద్ధతులు, శరీర సౌష్ఠవాన్ని కాపాడుకునే మెళకువలు, సినిమా టెక్నిక్‌, కాస్టూమ్స్‌ వంటి వాటి గురించి అవగాహన లేదు. ఈ తర్ఫీదు ఇచ్చిన తరువాతనే ‘కెమెరా’ ముందు నిలపాలి. దీనివలన మంచి సినిమాలు తీయవచ్చుననేది ఆనాటి భావన.



చాలా సందర్భాలలో నటీనటులను సినిమా తీసే స్టూడియో స్వంతదారు, లేదా పెట్టుబడిదారే (ఫైనాన్సర్‌) ఎంపిక చేస్తాడు. అతడు ఏ మార్వాడీనో, ఏ గుజరాతీనో అయి ఉండవచ్చు, నటులు ఏ తెలుగువారో, ఏ అరవం వారో అయి ఉంటారు. నిజానికి ఈ నటించేవారికి నటనలోనూ, గానంలోనూ మంచి ప్రావీణ్యం ఉన్నదా అన్న విషయాలు ఈ ఫైనాన్సర్‌కు పట్టవు. ఆ మహిళ అందంగా ఉంటే సరి నాయకగా ఎంపిక చేస్తారు. అయితే కొందరు అందంగా ఉన్నప్పటికీ కెమెరాకు సరిపోరు. కొందరు అందంగా లేకపోయినా కెమెరాకు సరిపోతారు. కొందరు అందంగా ఉన్నా నటన తెలియకుండా ఉంటారు. కాస్టింగ్‌ డైరెక్టరు ఈ విషయంలో తెలివిగా వ్యవహరించ వలసిన అవసరం ఉండేది.
నిజానికి ఆనాటికి కూడా విద్యావంతులు, అందమైన స్త్రీలు నటించడానికి పూర్తిగా సిద్ధంగా లేరనుకోలేము. అలాంటి వారు ఎక్కువ పారితోషకాలను ఆశిస్తారు. కానీ సినిమా నిర్మాణంలో ఉన్న ఖర్చులను దష్ఠిలో ఉంచుకుని చౌకగా లభించే స్త్రీలనే ఎంపిక చేసుకుంటారు. ఎక్కువ సొమ్ముతో మంచి నటీమణులను ఎంపిక చేసుకుని హిందీ సినిమా తీయవచ్చు. కానీ ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళంలో తీస్తే నష్టము వస్తుందనీ’ అనుకునేవారు. అట్లా ఆ రోజులలో హిందీ సినిమా రంగంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న సినిమా నాయక దుర్గాఖోటే. ఆ కాలంలో ఆమె ఒక సినిమాకు తీసుకునే పారితోషకం 5000. అయితే ఆ కాలంలోనే ఒక్కొక్క తెలుగు సినిమా నటికి ఇచ్చే పారితోషకం 500 రూపాయలు కూడా మించేది కాదు. మనదేశంలో సినిమారంగంలో వున్న స్త్రీలకు ఏమాత్రమైనా గౌరవం ఉన్నదంటే అది దుర్గాఖోటే వంటి నటి పరిశ్రమలో ఉండటం వలననేనని చెప్పవచ్చు.
ఆ కాలంలో చదువుకున్న స్త్రీలు సినిమారంగంలోకి ప్రవేశించడానికి ‘ఈనాక్షి రామారావు’ దారి చూపింది. ఈమె సైలెంట్‌ సినిమాల కాలం నుండి నటిస్తూ ఆ తర్వాత దర్శకుడు భవనానీని వివాహం చేసుకున్నది. అలాగే లాహోరుకు చెందిన ‘శ్యామజుట్టి కన్య’ కూడా సినిమాలలోకి వచ్చింది. ఇంకా అక్కడ కూడా సినిమాల్లోకి వస్తున్న ఉన్నత కులాలవారు ఉన్నారు. ఇంకా ప్రతిభావంతులైన నటీమణులు సినిమారంగం లోనికి రావాలంటే స్టూడియోలలో సరైన వసతులు, విధానాలు పాటించాల్సిన అవసరం ఉండేది.

ఆ సైలెంట్‌ సినిమాల కాలంలోనే భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందటానికి హిమాంశురారు, దేవికారాణి, బర్ద్వాన్‌ రాజకుమారి వంటి నటీమణులు కషి చేసారు. ఇంకా రూబీమేయర్‌ సులోచన, గౌహర్‌ వంటి వారు కూడా భారతీయ సినిమారంగానికి కీర్తిని తెచ్చిన వారిలో ఉన్నారు.
పై అంశాలను బట్టి మనకు అర్ధమయ్యేదేమిటంటే తొలినాటి భారతీయ టాకీ చిత్రాలలో నటించడానికి ముందుగా ముందుకు వచ్చిన వారు ఉత్పత్తి కులాలకు చెందిన వారు, కళావంతులు, భాగవత మేళాలకు చెందినవారేనని మనకు తేట తెల్లమవుతున్నది. ఇందుకు హైదరాబాది కళావంతుల కుటుంబానికి చెందిన రామ్‌ ప్యారీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
”సినిమా రంగంలో మాత్రమే కాదు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, రంగస్థల కళా రంగాలలో కూడా కింది కులాల వారే ఆయా కళారంగాలను పెంచి పోషించారు. ఆ పరంపరలోనే నత్య, సంగీత రంగాలలోకి ఉన్నత వర్గాల వారు, కాకపోతే ఉన్నత కులాల వారు ప్రవేశించి ఆయా కళారంగాలలో ఆధిపత్యం వహించి తొలినాట ఆయా రంగాలను పరిపుష్టం చేసిన వారి చరిత్రను కాలగర్భంలో కలిసిపోయేలా చేశారు” (భారతి మాసపత్రిక జూన్‌, 1935).
ఈ నేపథ్యంలో భారతీయ సినిమా రంగంలో ప్రధానంగా దక్షణ భారతంలో ఇంట్లో నుండి మొదలుకొని తమ సామాజిక వర్గం, సమాజం, సినీ పరిశ్రమలోని పురుషాధిక్యతలను ఛేదించుకుంటూ ముందుకు సాగి విజేతలైన, పరాజితలైన చీకటి తెరల మాటున మగ్గిపోయిన సినీతారల గురించి వారం వారం తెలుసుకుందాం.

– హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -