Sunday, January 11, 2026
E-PAPER
Homeప్రత్యేకంఅక్షరసూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌

అక్షరసూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌

- Advertisement -

కవిగా, చిత్రకారునిగా, ఫొటోగ్రాఫర్‌గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన అక్షరసూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌. జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో విప్లవ కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకుని, కష్టజీవి బతుకును సిరాలో నింపి అక్షరాలతో అగ్గి పుట్టించి, కలంతో కవాతు చేసినవాడు . పెన్సిల్‌అబశ్రీశ్రీతో బొమ్మలేసినా, పెన్నుతో కవిత్వం రాసినా అది ప్రజాపక్షమే. పాలకులను ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, సుత్తిలేకుండా సూటిగా చెప్పడం అలిశెట్టి మాదిరి మరొకరికి సాధ్యం కాదు. ఎంతో పెద్ద విషయాన్ని అయిన చిన్నచిన్న పదాలతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఓ ఎర్రమందారం. సరళమైన పదాలు.. రక్తం ఉడికించే మాటలతో మర ఫిరంగుల్లాంటి కవితలు రాసిన ఆయన జయంతి ఈ నెల 12న…

అలిశెట్టి ప్రభాకర్‌ 1954 వ సంవత్సరం జనవరి 12న జగిత్యాలలో జన్మించాడు. అలిశెట్టి చిన్నరాజం,లక్ష్మ దంపతుల కుమారుడైన ప్రభాకర్‌కు మొత్తం ఆరుగురు అక్కా చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మధ్యతరగతి పద్మశాలి (నేత) కుటుంబంలో జన్మించిన ప్రభాకర్‌ కరీంనగర్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఇంటర్‌ కోసం సిద్దిపేటలో ఉన్న అక్కా, బావ ఇంటికెళ్లాడు.. అక్కడ మాట పట్టింపులు రావడంతో తిరిగి జగిత్యాలకు వచ్చాడు. అప్పటికే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోశాడు. ఒకసారి బస్సు ప్రయాణంలో తన చదువుకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ పోగొట్టుకున్నాడు. అయితే పోయిన వాటిని తిరిగి పొందే మార్గం తెలియక, సహకరించేవారు లేక, అన్నింటిని మించి వాటిగురించి పెద్దగా శ్రద్ధ పెట్టక చదువుకు, సర్టిఫికేట్లకు ఆరోజుతో నీళ్ళొదిలెసాడు. అలిశెట్టి జీవితంమీద, శరీరంమీద, తిండిమీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవాడు కాదు. చిత్రలేఖనం, కవిత్వం, మిత్రులు ఈ మూడింటితోనే కాలంగడిపాడు. తన పెళ్ళి కూడా చెల్లెలు పెండ్లి మండపంలోనే తాను ఇష్టపడిన, తనను ఇష్టపడిన ‘భాగ్య’ మెడలో తాళికట్టి ఇల్లాలిని చేసుకున్న నిరాడంబరుడు. చిన్నప్పటి నుండి చిత్రలేఖనంపై ఉన్న మక్కువతో పత్రికల్లో వచ్చే సినిమా బొమ్మలు వేస్తూ కాలం గడిపేవాడు. తర్వాత పండుగల చిత్రాలు, ప్రకతి దశ్యాలు, సినీనటుల బొమ్మలు వేస్తూ వివిధ పత్రికల దగ్గరినుండి కొంత పారితోషికం పొందుతూ ఆనందించేవాడు. ఇట్లా బొమ్మలు వేసి వేసి విసిగిపోయి కవిత్వ ప్రపంచంలోకి అడుగిడినాడు. కొంతమంది మిత్రుల సూచనలతో కవితలకు సరిపోయే బొమ్మలు గీసి ఇచ్చిన ప్రభాకర్‌.. వాటి స్ఫూర్తితో కవిత్వం రాశాడు.



అలిశెట్టి కవితా ప్రస్థానం..
జగిత్యాలలో ‘సాహితీ మిత్రదీప్తి’ సంస్థ పరిచయంతో అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రారంభ దశలో ప్రభాకర్‌ కవిత్వంలో ఏ భావజాలమూ, ఎటువంటి సిద్ధాంత ప్రతిపాదనలూ కనబడవు. మానవ సంస్కరణ, సమస్యలను గురించి ప్రశ్నించే తీరు మాత్రమే కనిపించేది. ఈ తరుణంలోనే 18 ఏళ్ల వయసులో ‘పరిష్కారం’ పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కవిత ప్రచురణతో మొదలైన అలిశెట్టి కవితా ప్రస్థానం.. ప్రభాకర్‌ గుండె లోతుల్లో అణిచివేయబడ్డ బడబాగ్ని 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. పెత్తందారి వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్‌ లోని అక్షర సూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ‘ఎర్రపావురాలు’గా ఎగరేశాడు. ఆనాటి నుంచి ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎర్ర పావురాలు తరువాత 1979 లో ‘మంటల జెండాలు, చురకలు’, 1985 లో ‘రక్తరేఖ’, 1989 లో ‘ఎన్నికల ఎండమావి’, 1990 లో ‘సంక్షభ గీతం’, 1992 లో ‘సిటీలైఫ్‌’ వంటి పుస్తకాలను వెలువరించారు. 1978 లో 1979లో ”మంటల జెండాలు” సంకలనంలో వచ్చిన దోపిడీ చిహ్నం, దశ, పింజర లాంటి ముప్పైమూడు కవితలకు ఇండియన్‌ ఇంక్‌తో అద్భుతమైన చిత్రాలు గీశాడు. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత వెలువడిన ‘మంటలజెండాల’ సంకలనంలో శ్రమ అంటే ఏమిటో చెప్పి, దాని ప్రాధాన్యాన్ని వివరించి, అది పరాయీకరణ చెందిన ఫలాన్ని వివరించాడు. ‘చురకలు’ కవితా సంకలనాన్ని పీడితుల పక్షన సంధించాడు. వ్యంగ్యం, పదును, విమర్శ, సామాజిక స్పృహలాంటివన్నీ ఒకేసారి చురకల్లో కనిపిస్తాయి. ‘రక్తరేఖ, సంక్షభ గీతం’ లోని కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్‌ పేరుతో హైదరాబాద్‌ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా ఆయన కవిత్వం రాశాడు.

మార్క్సిజమే అలిశెట్టి అవలంభించిన దక్పథం. మార్క్సిస్టు విలువలనే ఆయన కవిత్వీకరించారు. కవిత్వంలోనే మార్క్సిస్టు సూత్రాల్ని వివరించారు. కొంత పేరు రాగానే కవులు, రచయితలు ప్రభుత్వాలకు దగ్గరగా ఉండాలని, అవార్డుల కోసం ఆరాటం, సన్మానం కోసం పోరాటం చేస్తుంటారు. అలిశెట్టి అట్ల కాదు. కవి అన్నవాడు ప్రజలవైపు ఉండాలి, ప్రజా సమస్యలు రాయాలని గట్టిగా నమ్మాడు కాబట్టే.. ఇంత ధైర్యంగా ఈ కవిత రాయగలిగాడు. ‘అర్భకుడైన కవి ఒకడు అవార్డులు, సన్మానాల కోసం దేబిరించడం తప్ప నగరంలో నేడు అవాంఛనీయ సంఘటనలేవి జరగలేదు’ అంటాడు. ఓ వైపు ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే టీబీ సోకింది. మెరుగైన వైద్యం చేయించుకోవాలని చాలా మంది మిత్రులు చాలాసార్లు చెప్పినా వినకపోయేవాడు. ఆరోగ్యం క్షణిస్తున్నా అక్షర సమరం మాత్రం ఆపలేదు. ఆ రోజుల్లో ఎందరో కవులకు, రచయితలకు సినీ రంగం బంగారు బాటలు వేసింది. కానీ అక్షరాన్ని నమ్ముకున్న అలిశెట్టి దాన్ని అమ్ముకోలేకపోయాడు. అందరిలా సినీ పరిశ్రమ వైపు వెళ్తే కావాల్సినంత పేరు, సరిపడా డబ్బు సంపాదించి దర్జాగా బతికేవాడేమో. అది తన దారి కాదని.. జనకవి అయ్యాడు. ప్రభాకర్‌ దష్టిలో జీవితం, జీవించడం రెండూ వేర్వేరు అంటాడు.

”అలా సమాధిలా../ అంగుళం మేరకన్నా కదకుండా పడుకుంటే ఎలా?/ కొన్నాళ్లు పోతే../ నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు” అంటూ జీవితానికి, జీవించడానికి తేడా చెప్పాడు.
‘ఇంపాసిబుల్‌’ అనే కవితలో ”సూది/ మొన/ మీద/ ఆవగింజని మోపటం/ వధాశ్రమ/ నియంతత్వపు/ తుపాకీ/ గొట్టం/ పైన/ భూగోళాన్ని ఆపటం/ భ్రమ” అని అలిశెట్టి మనది వర్గసమాజమని గుర్తించి, ఉద్యమంపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తాడు.. ఐదేళ్ల కోసం జరిగే ఎన్నికల గురించి
”ఐదేళ్లకోసారి/ అసెంబ్లీలో మొసళ్లూ/ పార్లమెంట్‌లోకి తిమింగలాలూ/ ప్రవేశించడం పెద్ద విశేషం కాదు/ జనమే ఓట్ల జలాశయాలై వాటిని బతికించడం విషాదం” అంటూ అలిశెట్టి రాసిన కవిత ఎన్నికలు జరిగినంత కాలం ఇప్పుడే రాసినట్టు అనిపిస్తుంది. పాలకులనే కాదు ప్రజలను కూడా ప్రశ్నించిన కవి.
”తను శవమై/ ఒకరికి వశమై/ తనువు పుండై/ ఒకరికి పండై/ ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాసిస్సై” అంటూ వేశ్యల దుర్భర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు ప్రభాకర్‌. నాలుగు వాక్యాల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్లకు కట్టినట్టు ఒక్క అలిశెట్టి తప్ప ఇంకెవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు.
అలిశెట్టికి రాజకీయాలన్నా.. నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత. అందుకే ”ఓ నక్క ప్రమాణం స్వీకారం చేసిందట/ ఇంకెవర్నీ మోసగించనని.. / ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట.. / తోటి జంతువుల్ని సంహరించనని../ ఈ కట్టుకథ విని.. గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ:” అని పదవుల ప్రమాణస్వీకారం చేసే రాజకీయ నాయకుల్ని, ప్రజల అమాయకత్వాన్ని గిల్లి చెప్పినట్లుగా చెబుతూ, రాజకీయ నాయకుల తీరును తన కవితలతో ఏకిపారేశాడు.
”నీ శ్రమ ఫలం/ నీ సమక్షంలోనే పాతి పెట్టబడ్డ/ విత్తనం దాన్నే డబ్బు చెట్టుగా పెంచి/ దక్కించుకున్న వాడిదే/ పెత్తనం” అని ‘నా దష్టిలో’ అన్న కవితలో
”’అంతస్తూ ఐశ్వర్యం/ శ్రామికుడి భిక్షం/ నాదష్టిలో ధన మధాంధుడే/ అడుక్కు తినేవాడు” అంటాడు. భిక్షం కావాల్సింది అడుక్కుతినేవారికి అని సాధారంగా అనుకుంటాం. అడుక్కుతినే వారికి బిక్షపాత్ర తప్పమరేమీ వుండదు. కాని అలిశెట్టి దష్టిలో ధనమందుడే అడుక్కుతినేవాడు. వాని సంపదంతా శ్రామికుడు వేసిన భిక్షమేనంటాడు. ధనమదాంధుణ్ణి కసిగా వ్యతిరేకిస్తాడు. అలిశెట్టి అనగానే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చే కవితలు ‘సిటీ లైఫ్‌’. వీటిని ఎందుకు రాసాడో అతని మాటల్లో ”ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికలు ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పాఠకులకు అందించిన చిన్న చిన్న కవితలు” అని ముందుమాటలో చెప్పుకున్నాడు. కాన్వెంటు స్కూళ్ళ సందడి, సిటీ బస్సుల మోత, ఆర్ట్స్‌ కాలేజీ అందం, హైదరాబాద్‌ తందూరి రోటీల రుచి, ఎలక్షన్‌ల ప్రచారం తీరు, సెక్రటేరియట్‌ ఫైళ్ళ కదలిక విధానం, బస్తీలలో బతుకుపోరాటాలు, ఉద్యోగ జీవితాలు మొదలైన వాటిని వస్తువుగా ఎంచుకుని రమణీయంగా, సరళ సుందరంగా అందించాడు.



ఫొటోగ్రాఫర్‌ గా అలిశెట్టి
అలిశెట్టి ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో కుటుంబ పోషణకు ఫోటోగ్రఫీని వత్తిగా స్వీకరించి జీవన చరమాంకం వరకు కొనసాగించాడు. ఈ వత్తి ఎంతోకొంత ఆయన ఆకలిని తీర్చింది. ప్రాంతాలు మారినా, పనిని మాత్రం మార్చకుండా వివిధ పేర్లతో ఈ వత్తిని కొనసాగించాడు. కొడుకు భవిష్యత్తుమీద భయం కలిగిన ప్రభాకర్‌ తల్లి అతని ఆలోచనలకు తగ్గట్టుగా ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి సిరిసిల్ల పంపించింది. అక్కడ మూడు నాలుగు నెలల్లో రాము ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, ఫోటోగ్రఫీ మీద మంచి పట్టు సాధించాడు. 1975 లో జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’, 1979 లో కరీంనగర్‌లో ‘స్టూడియో శిల్పి’, 1983 లో హైదరాబాద్‌లో ‘స్టూడియో చిత్రలేఖ’ పేర్లతో స్టూడియోలు స్థాపించాడు. బొమ్మలు వేసి విసిగిపోయి కవిత్వ ప్రపంచంలోకి అడుగిడిన ప్రభాకర్‌ తనలో ప్రారంభంనుండి పాతుకు పోయిన పాత కళను కొన్ని సంవత్సరాల తర్వాత కవితకు తోడు చేసి ‘కవితాచిత్రాలు’ ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో ఇవి ప్రదర్శింపబడినాయి. ఈ ‘కవితాచిత్రాల’ ప్రదర్శనల ద్వారా ప్రభాకర్‌ విశేషమైన ఆదరణ పొందాడు.

శ్రమను నమ్ముకున్న అలిశెట్టి, శ్రామికుడికి ఫలితం దక్కాలని కాంక్షంచి, కవిత్వం రాసిన వ్యక్తి. కుంచెను, కలాన్ని, కెమెరాను నమ్ముకున్న అలిశెట్టి నిరంతరం సమాజం కోసం తన అరోగ్యం మీద, తనువును సైతం లెక్క చేయకుండా కవిత్వమే ఊపిరిగా తపించి, తన ముప్పైతొమ్మిదివ ఏటా 1993 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన తనువు చాలించాడు. ఆయన జయంతి, వర్ధంతి జనవరి 12 కావడం యాదచ్చికమే అయినా.. ”మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదు/ మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం/ నా అశ్రుకణం కాదు” అంటూ కబళించే మత్యువును ముందే గుర్తించాడు అలిశెట్టి. తెర వెనక లీలగా మత్యువు కదలాడినట్టు తెరలు తెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని ‘పర్సనల్‌ పోయెం’ అనే కవితలో రాసుకున్నాడు.

అలిశెట్టి ప్రభాకర్‌ మినీ కవిత్వంతో ప్రఖ్యాతి గాంచినవాడు. తన కళ్ళ ముందున్న ప్రపంచం నుంచి వస్తువును నిక్కచ్చిగా ఏరుకొని భావాన్ని గుండెల్లో గుచ్చుకునేలా, చెంప చెల్లుమనిపించేలా, సూటిగా పేల్చడమే ఆయన కవితా గుణం. అలిశెట్టి కవిత్వం చదువుతుంటే ఆ కవితల్లోని భావం సూటిగా వెళ్లి గుండెల్లో పేలుతుంది. ఈయనవన్నీ చాలా పవర్ఫుల్‌ పోయెమ్స్‌. ఈయన కవితలు వినోదంగా ఉన్నా, ప్రజలకు ఓ ఆలోచన దక్పథన్ని ఇస్తాయి.
(జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్ధంతి సందర్భంగా)

– డా. పొన్నం రవిచంద్ర,
సీనియర్‌ జర్నలిస్టు, సినీ విమర్శకులు
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -