Sunday, January 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమను వర్సిటీ భూములను లాక్కుంటే ఊరుకోం

మను వర్సిటీ భూములను లాక్కుంటే ఊరుకోం

- Advertisement -

ఓయూ విద్యార్థి నాయకులు

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
మను (మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ) యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని ఓయూ విద్యార్థి నాయకులు హెచ్చరించారు. శుక్రవారం ఓయూ క్యాంపస్‌లో వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు దశరథ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు తలమానికంగా, దేశంలోనే ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. విశిష్టమైన విద్యాసంస్థను రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా లాక్కోవాలని చూస్తోందన్నారు. ఇది అన్ని యూనివర్సిటీల భూములను గుంజుకునే ప్రక్రియలో భాగమేనన్నారు.

గతంలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములను హైకోర్టు పేరిట తీసుకున్నారని, అలాగే 400 ఎకరాల హెచ్‌సీయూ భూములను కూడా తీసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యం కారణంగా ఆ ప్రయత్నం తాత్కాలికంగా ఆగిందన్నారు. హెచ్‌సీయూ భూముల విషయంలో రూ.10 వేల కోట్ల భూకుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణా చేపట్టలేదని తెలిపారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్ను వేసేదే కాదన్నారు. మరో నాయకుడు జంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాసంస్థల భూములను రియల్‌ ఎస్టేట్‌ కోసం గుంజుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాటం శివ. బొల్లు నాగరాజ్‌, శీను నాయక్‌, అవినాష్‌, సాయి, రాకేష్‌, పవన్‌, రెహమత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -