Sunday, January 11, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్గొప్పతనం

గొప్పతనం

- Advertisement -

ఆ రోజు ఆ అడవంతా చాలా కోలాహలంగా వుంది. జంతువులన్నీ ఒక చోట చేరాయి. నేను ఇది చెయ్యగలను, నేను అది చెయ్యగలను, దీనిలో నాకు సాటి ఎవరూ లేరు అంటూ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నాయి. విషయం ఏమిటంటే ఆ రోజు అడవిలో జంతువుల మధ్య పోటీ జరుగుతోంది. ఎవరు గొప్ప అనే పోటీ. ప్రతివాళ్ళూ ఆ పోటీలో పాల్గొని వాళ్ళ వాళ్ళ ప్రతిభ చూపించాలనుకున్నారు. జింక వేగంగా పరిగెత్తింది. కోతి చెట్టు కొమ్మల మీదనుంచీ అటూ ఇటూ దూకింది. చెట్లకున్న కాయలు, పళ్ళు తను ఎంత దూరంగా విసిరేయగలదో చూపించింది. ఏనుగు తన తొండం నిండా నీళ్ళు నింపుకుని దూరంగా వెదజల్లింది. కానీ జడ్జి తాబేలుకి ఇవ్వేమీ నచ్చలేదు.

అసలు తాబేలుని జడ్జీగా పెట్టటానికి మిగతా జంతువులు అడ్డుపడ్డాయి. తాబేలు చాలా మందకొడి. మా వేగాలు దానికి నచ్చవు, సరైన న్యాయం చెయ్యలేదని. కానీ మగరాజైన సింహం వినలేదు. తాబేలు వయసులో పెద్దది. అనుభవం కలది. మీలా దూకుడుగా వ్యవహరించదు. ఇప్పుడు పోటీ ఎవరు మన జంతువులకు ఎక్కువగా ఉపయోగ పడుతున్నారు అని. ఆ నిర్ణయానికి పెద్దలే సరైనవారు అని ఖచ్చితంగా చెప్పింది. మగరాజు మాట కాదనే ధైర్యం ఎవరికీ వుండదు కదా.
పందాలలో పాల్గొనేవాళ్ళు పాల్గొంటున్నారు. ఎవరికి వారే తమకే బహుమతి వస్తుందనుకుంటున్నా, మళ్ళీ మందకొడి తాబేలుకి తమ వేగం నచ్చుతుందో, నచ్చదో, బహుమతి ఎవరికి ఇస్తుందో అని తాబేలునీ, అలాంటి జడ్జీని పెట్టినందుకు చాటుగా మగరాజు సింహాన్నీ తిట్టుకుంటున్నాయి. తాబేలుకి ఇవ్వన్నీ తెలుస్తున్నా గంభీరంగా కూచుని పోటీదార్ల విన్యాసాలు చూస్తోంది. మరి అన్నీ చూసి సరైన నిర్ణయం ఇవ్వాల్సింది తనే కదా.

ఇంతలో పెద్ద అలజడి. నది మీద వున్న తాటి చెట్టు వంతెన విరిగి నీళ్ళల్లో పడిపోయిందని. ఆ నది అడవికీ, ఇవతల వున్న పెద్ద ఖాళీ ప్రదేశానికీ మధ్య వుంది. జంతువులన్నీ అడవిలో వుంటాయి కదా. ఆ రోజు ఈ పందాల కోసం పెద్ద ఖాళీ ప్రదేశం కావాలని అన్ని జంతువులూ కూడబలుక్కుని, మగరాజు అనుమతితో నది ఇవతల వున్న ఖాళీ ప్రదేశానికి వచ్చాయి. ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఊరు వుంది. అందుకనే, రాజైన సింహమూ, జడ్జీగా వ్యవహరించబోయే తాబేలు తమలో తాము చర్చలు జరిపిన తర్వాత ఆ ప్రదేశం తమ జంతువులకి అంత సురక్షితమైనది కాదని నిర్ణయించాయి. ఎందుకంటే ఆ ప్రదేశం ఊరుకి దగ్గరలో వున్నది, ఈ జంతువులు మనష్యుల కళ్ళల్లో పడితే ప్రమాదమని. మరో కారణం జంతువులన్నీ ఆ నది దాటటానికి ఉపయోగపడేది నదికి అడ్డంగా ఎప్పుడో పడ్డ తాటి చెట్టు మాత్రమే. అది ఎప్పుడో పడ్డది గనుక ఎంత గట్టిగా వుంటుందో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే జంతువులు నదికి అడ్డంపడి ఈదగలిగే ఏవో కొన్ని జంతువులు తప్ప అన్నీ అడవిలోకి తిరిగి రాలేవు. కానీ జంతువులన్నీ చాలాకాలం తర్వాత అడవి దాటి వెళ్తామన్న ఉత్సాహంతో మగరాజుని కూడా ఒప్పించాయి ఆ మైదానానికి వెళ్ళటానికి. వాటన్నిటి ఉత్సాహం చూసిన సింహం ఏమీ అనలేక పోయింది. కానీ ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందరూ దూరాన వున్న మరో వంతెన ద్వారా అడవిలోకి వచ్చెయ్యాలనీ, ఈ లోపల మనుష్యుల కంట పడకుండా జాగ్రత్తగా వుండమని అనేక జాగ్రత్తలు చెప్పి పంపింది వాటన్నింటికీ.
సింహం, తాబేలు భయపడ్డంతా అయింది. తాటిచెట్టు వంతెన విరిగి పడిపోయింది. దానితో కొన్ని జంతువులు ప్రాణ భయంతో అడవిలోకి పారిపోవటానికి వేరే వంతెన వైపు పరిగెత్తాయి. ఈత వచ్చిన కొన్ని జంతువులు నదికి అడ్డంపడి ఈదటానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ రక్షణ కోసం అన్ని జంతువులూ ఎవరికి తోచిన పధ్ధతి అవి అనుసరిస్తున్నాయి.

కానీ నదిలో వున్న ఒక మొసలి మాత్రం చలించలేదు. జంతువుల హడావిడి, గాబరా చూసి ఒడ్డుకు వచ్చింది. దగ్గరలో వున్న జంతువులను పిలిచి తన వీపు మీదకి ఎక్కమని అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి దింపి వచ్చింది. మిగతా జంతువులలా హడావిడి పడకుండా తన మీద ఎక్కగలిగినన్ని జంతువులని తీసుకెళ్ళి అవతల ఒడ్డున దించి రావటమే ధ్యేయంగా పెట్టుకుంది. అలా నదిలో ఆ ఒడ్డుకీ ఈ ఒడ్డుకీ చాలాసార్లు తిరిగి అనేక జంతువులు భయపడకుండా అడవికి చేర్చింది.
మగరాజుకీ సంగతులన్నీ చెప్పాక పోటీల ప్రస్తావన వచ్చినప్పుడు జంతువులన్నీ పోటీల ఫలితాలు ప్రకటించలేదని గందరగోళం చేశాయి. దానికి మన తాబేలుగారు అందరినీ శాంత పరుస్తూ, పోటీల ఫలితాల గురించి నేను రాజుగారికి ఇంతకు ముందే విన్నవించాను. వారి అంగీకారంతో ఈ పోటీ విజేతగా నదిలోని మొసలిని నిర్ణయిస్తున్నాను అని చెప్పింది.

కొన్ని జంతువులు ఆ ఫలితాలు విని ఆశ్చర్యపోయాయి. ఇదేమిటి. మొసలి అసలు పందెంలోనే పాల్గొనలేదు కదా. మరి ఎలా విజేత అయింది అని. మొసలి సహాయంతో నది దాటిన జంతువులు మాత్రం సంతోషించాయి. తమకి అంత సహాయం చేసిన మొసలి పోటీలో గెలవటంతో. కానీ అందరికీ వచ్చిన పెద్ద అనుమానం. మొసలి అసలు పోటీలో పాల్గొనలేదు కదా. బహుమతి ఎలా వచ్చింది అని. దానికి సమాధానం తాబేలునే చెప్పమంది మగరాజు.
తాబేలు తన ధీర గంభీర స్వరంతో అందరికీ ఇలా చెప్పింది. ఇవాళ పోటీ ఎవరు గొప్పవారు అని. గొప్పతనం ఎవరికి వారికే ఉపయోగపడే సిరి సంపదలకన్నా, ఉద్యోగాలకి పనికి వచ్చే చదువులకన్నా, పరులకుపకారం చేసే గొప్ప మనసులో వుంటుంది. తాటి వంతెన విరిగి, మనకి ఆపద వచ్చినప్పుడు శ్రమ అనుకోకుండా, తనమీద ఎక్కేవాళ్ళు శత్రువులా, మిత్రులా అని చూడకుండా మనందరినీ అడవికి చేర్చిన గొప్ప మనసున్న మొసలి ఈ బహుమతికి అర్హురాలు.
తాబేలు ప్రకటనకి మొసలి మీద నది దాటిన జంతువులన్నీ హర్షం ప్రకటించాయి. దూరంగా పరిగెత్తి రెండో వంతెన మీదనుంచి అడవికి చేరిన జంతువులు కొన్ని కోపగించుకున్నాయి. మేమంతా అంత కష్టపడి మా మా శక్తులు ప్రదర్శిస్తే అసలు ఏ శక్తీ ప్రదర్శించని మొసలికి బహుమతి ఇవ్వటమేమిటని.
దానికి తాబేలు తిరిగి సమాధానం ఇచ్చింది. మొసలి పందెంలో పాల్గొనటానికే అక్కడికి వచ్చింది, పేరు కూడా ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా వంతెన కూలేసరికి పందెం సంగతి కూడా మర్చిపోయి అడవిలోని జంతువులను కాపాడటమే ధ్యేయంగా విపరీతంగా శ్రమ పడింది ఫలితం కోసం చూడకుండా. ఇవాళ మొసలి లేకపోతే ఎంతమంది సవ్యంగా అడవికి చేరేవాళ్ళో, ఎవరెక్కడ తప్పిపోయి తిరుగుతూ వుండేవాళ్ళో తెలియదు.
తమకి నచ్చక పోయినా తాబేలు చెప్పిన మాటల్లో నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు మిగతా జంతువులకి.

పి.యస్‌.యమ్‌. లక్ష్మి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -