మున్సిపాలిటీని మోడల్‌గా తీర్చిదిద్దుతాం : రెవెన్యూ, హౌసింగ్ శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ఏప్రిల్ నుంచి మరో విడత ఇండ్లు మంజూరు
ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-గాంధీ చౌక్/ఖమ్మం రూరల్
పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బారుగూడెంలో రూ.24.27 లక్షలతో, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలతో, నాయుడుపేటలో రూ.44.50 లక్షలతో, నడిమితండాలో రూ.77.10 లక్షలతో, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలతో, ఆటోనగర్‌లో రూ.17.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే, నాయుడు పేటలో రూ.26.30 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులను, మహబూబాబాద్ క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద రూ.7.40 లక్షలతో నిర్మించనున్న బస్ షెల్టర్ నిర్మాణ పనులకు, రూ.24.30 లక్షలతో చేపట్టిన మహబూబాబాద్ క్రాస్ రోడ్డు జంక్షన్ అభివృద్ధి నిర్మాణ పనులకూ మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులకు పేదలకు ఇండ్లు అందించాలనే ఆలోచన రాలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు.
రాబోయే మూడు విడతల్లో రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు. ఇండ్ల లబ్దిదారులకు ప్రతి సోమవారం ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలను ఎంపిక చేసి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ అందుబాటులో ఉన్నా పారదర్శకంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో ఏదులపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఏడాదిలో మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మున్నేరు భారీ వరదల నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వర్షాకాలం నాటికి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్నారు. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ హరినాథ్ బాబు, ఆర్‌అండ్‌డీ ఎస్‌ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



