ఐదు మరణాలలో ఒక దానికే వైద్య ధ్రువీకరణ
అరకొర సమాచారంతోనే అధికారుల నిర్ణయాలు
వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ : దేశంలో చాలా మంది ప్రజలు ఏ కారణం చేత చనిపోతున్నారో ఇప్పటికీ తెలియడం లేదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం తెలిపింది. ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా ఫలితాలు దేశంలో ఆరోగ్య విధానాలు, వనరుల ప్రణాళికపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆరోగ్య ప్రాధాన్యతలను నిర్ణయించాలంటే మరణాని కి కారణాలేమిటో విశ్వసనీయంగా నమోదు చేయాల్సిన అవసరాన్ని అవి నొక్కి చెప్పాయి.
ప్రపంచ జనాభాలో సుమారు 18 శాతం మంది మన దేశంలోనే నివసిస్తున్నప్పటికీ వైద్య పరంగా ధృవీకరించిన మరణాల విషయంలో చాలా వెనుకబడి ఉంది. భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం వద్ద ఉన్న డేటా ప్రకారం 2020లో కేవలం 22.5 శాతం మరణాలను మాత్రమే వైద్యపరంగా సర్టిఫై చేశారు. అంటే ప్రతి పది మరణాలలో ఎనిమిదింటికి కచ్చితమైన కారణాలను వైద్యులు అధికారికంగా నమోదు చేయలేదన్న మాట. మరింత ఆందోళన కలిగించే విషయమేమిటంటే గత పది సంవత్సరాలలో ఈ సంఖ్య కేవలం రెండున్నర శాతం పాయింట్లు మాత్రమే మెరుగుపడింది.
23 రాష్ట్రాలలో అదే పరిస్థితి
గత పదిహేను సంవత్సరాలలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మరణ ధృవీకరణ విధానాలను తొలిసారిగా నిశితంగా పరిశీలించింది ఐసీఎంఆర్ అధ్యయనమే. ఇది విస్తృతమైన ప్రాంతీయ వ్యత్యాసాలను బయటపెట్టింది. అంతేకాక ఇప్పటి వరకూ విస్మరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపింది. మరణాల ధృవీకరణ విషయంలో ఈ అధ్యయనం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు గ్రూపులుగా విభజించింది. అతి పెద్ద గ్రూపులో 23 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో సగటున 18 శాతం మరణాలను మాత్రమే వైద్యులు ధృవీకరించారు. ఈ రాష్ట్రాలలో కూడా వైద్యుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రతి వెయ్యి మందికి కేవలం 0.14 మంది వైద్యులు మాత్రమే అందుబా టులో ఉండడం గమనార్హం. ఈ రాష్ట్రాలలోని 27 శాతం ఆస్పత్రులు మాత్రమే రోగుల మరణాలకు కారణాలను క్రమం తప్పకుండా నివేదించాయి.
మెరుగుదల ఉన్నప్పటికీ…
దీనికి భిన్నంగా మిగిలిన రెండు గ్రూపులు మెరుగైన నివేదికలు చూపిస్తున్నాయి. ఈ ప్రాంతాలలో దాదాపు 60-63 శాతం మరణాలను వైద్యపరంగా ధ్రువీకరించారు. అంతేకాక ఇక్కడ వైద్యులు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎనభై శాతానికి పైగా ఆస్పత్రులు మరణ వివరాలను అందజేస్తున్నాయి. మన దేశంలో అధికారికంగా వైద్యులు ధృవీకరిస్తున్న మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం మంచి పరిణామం. 2006-2010 మధ్యకాలంలో కేవలం 15 శాతం మరణాలను మాత్రమే ధ్రువీకరించారు. 2016-2020 నాటికి అది 21 శాతానికి పెరిగింది. అంటే మరణాలకు కారణాల నమోదులో మెరుగుదల కన్పిస్తోందన్న మాట.
ప్రాంతాల వారీగా అసమానతలు
కేంద్ర పాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి మరణాన్ని వైద్యులు సర్టిఫై చేస్తున్నారు. ఈ రేటు 95 శాతానికి చేరువగా ఉంది. పుదుచ్చేరి, చండీగఢ్‌లో కూడా మంచి ఫలితాలే నమోదయ్యాయి. అక్కడ సుమారు 70 శాతం మరణాలను వైద్యులు ధృవీకరించారు. ఢిల్లీ కూడా కొంత మెరుగుదల కనబరచింది. అక్కడ వైద్య ధ్రువీకరణలు 57 శాతం నుంచి 60 శాతానికి పెరిగాయి. అయితే ఉత్తరాదిన పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అక్కడ 2015-2020 మధ్య కేవలం 13 శాతం మరణాలే సర్టిఫై అయ్యాయి.
మరోవైపు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పరిస్థితి మెరుగుపడింది. అదే సమయంలో హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అనేక సంవత్సరాలుగా మరణాల నివేదికల్లో అంతరాలు, అసంపూర్ణ డేటా కన్పిస్తోంది. ఇక దక్షిణ భారతదేశం విషయానికి వస్తే దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మంచి పనితీరు కనబరుస్తోంది. తమిళనాడులో మరణాల వైద్య ధ్రువీకరణలు 28 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయి. దక్షిణాదిలో తమిళనాడుదే మొదటి స్థానం. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా స్థిరంగా అధిక ధృవీకరణలు నమోదు చేశాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కేరళ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంది.
వైద్యుల కొరతే కారణం కాదు
మరణ ధ్రువీకరణను మెరుగుపరచడంలో ఆస్పత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వైద్యుల సంఖ్య తక్కువగా ఉండడమే సమస్య కాదు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, రాష్ట్ర స్థాయి ఆరోగ్య విధానాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థల పనితీరు వంటి అంశాలు కూడా మరణాలు సరిగా నమోదవుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
పరిశోధకులు ఏమంటున్నారు?
ప్రజలు ఏ కారణంతో చనిపోతున్నారన్న దానిపై సవివరమైన డేటా అందుబాటులో లేకుంటే అరకొర సమాచారంతో ఆరోగ్య అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ప్రణాళిక సరిగా లేకపోవడం, వనరులు వృథా కావడం, నివారించదగిన మరణాలను నివారించలేకపోవడం వంటివి జరుగుతాయి. మరణ ధ్రువీకరణను మెరుగుపరచడం ప్రజారోగ్య ప్రాధాన్యతగా ఉండాలని పరిశోధకులు సూచించారు. ఆస్పత్రుల నివేదికలను పటిష్టపరచడం, వైద్య సిబ్బందిని పెంచడం, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం వంటి చర్యల ద్వారా వ్యాధుల భారం నుంచి భారతావనికి ఉపశమనం కల్పించవచ్చు. అంతిమంగా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు.



