చెలిమి నిచ్చావూ చేవనిచ్చావూ….
చెమట పూదోటలో కలిమి దాగుందనే
సత్యాన్ని గొంతెత్తి
చాటి చెప్పావూ….
మూగవానీ గుండెల మురళీ మోగించావూ
స్వరాలన్ని కలసి నడవగా బ్రతుకు గీతమై మెరిసావూ
ఆశల చిగురుల అరుణిమలా
ఆశయాల అల సవ్వడిలా…
చెలిమి చేవనిచ్చినా, చెమట పూదోటలో కలిమి దాగుందన్న సత్యాన్ని పొదిగిన బతుకు పాటలివి. ప్రజా నాలుకలపై మోగుతున్న ఆలాపనలివి. కష్టజీవి కంటికి వెలుగునద్దె అక్షర లేపనాలివి. శ్రమజీవి సౌందర్యాన్ని కీర్తించే గాన రూపాలివి. పాట పాడినప్పుడు ఏ అనుభూతి చెందుతామో, అక్షర రూపమైతే కూడా అదే అనుభూతిని చెందే రచన ఉత్తమ గేయ లక్షణం. ఆ నేపథ్యంలో ఆనందాచారి ఈ గేయాలు కవిత్వమై, రాగమై, భావమై మనలను అలరిస్తాయి.
పచ్చని చెట్టు, పూసిన పూలు మట్టితో బంధం, పాడే పాట, ఆడే ఆట మనిషికి అందం. ఆ మట్టిని నమ్మిన మనిషి నుదుటి చెమట చుక్కలో తళుకులీనె లిపి పాట. మానవుడి ఆదినడక పాదులో ప్రాణం పోసుకుంది పాట. చుట్టూ వున్న చెట్టు, పుట్ట, పిట్ట తనను పలకరించినపుడు పరవశంతో కదిలే పెదవులపై పూసే నెలవంక నవ్వు పాట, తన తొలి కుదురు నుంచి నేటి దాకా నరుల నడకకు ఉనికినిస్తున్నది పాట. ఆ ఉనికిని గుర్తించి తొలుత పాటతో సాహిత్యంలోకి ప్రవేశించిన ప్రసిద్ధ కవిగా, కథకులుగా పయనిస్తున్న ఆనందాచారిగారి ‘ఉద్యమ బాటలో పాట’ పుస్తకం ఆలస్యంగా వస్తున్నా ప్రజా ఉద్యమాలలో జనం నాలుకలపై ఇంతకు ముందు నుంచే మోగుతున్నాయి.
ఈ పాటలు నరాలు బిగుసుకున్న నాగలి పట్టిన చేతులకు ఆసరా. పొలాలు దున్నే రైతులకు బాసట. నడుములొంచి నారుపోసే, కొడవలెత్తి కోత కోసే కూలి గొంతుక రాగాలివి. అన్ని పనులు చేసి ఆకలి మాత్రమే వేతనంగా పొందే వెట్టి బతుకుల కన్నీటి తడి ఈ పాటల మడి..
కూలి దండు కూతకే కూలిపోయే పేకమేడల వంటిపై విసిరే చర్నాకోలలివి. అడవిని దోసిన వాడిని, సముద్రాన్ని ఆక్రమించిన వాడిని, యుద్ధాలతో హక్కులను మంటగలిపిన వాడిని, లాభాల విధ్వంసపు కోరలు సాచిన సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టె అలజడి గీతాలివి. విలువల పతనం కోరె వినిమయ సంస్కతిని ఈసడించుతూ మనిషిలోని మంచితనాన్ని నిలిపేటందుకు తపించే ఆర్తి ఆలాపనలివి. కులమతాల చిచ్చులను, మౌఢ్యపు గోడలను కూలగొట్టె సమ సమాజ స్వప్న గీతికలివి. వేకువన ఆలపించే భూపాలంలో అమరుల మననమై మనలను అల్లుకుంటుంది.
”అన్యాయం బుస కొట్టే చోట/ దారిద్య్రం తెగ బలిసిన చోట/ అసమానతలు పెరిగిన చోట/ తిరుగుబాటులో పూచిన బావుట”
తిరుగుబాటు బావుటలో సుందరయ్య ఎత్తిన పిడికిలి, చెగువేర పదునైన చూపును ఈ పాటల్లో కాంచగలం. ఆనాటి నుండి నేటి దాకా ఉద్యమ అవసరాల కోసం రాసిన ఎన్నో కదిలించే పాటలున్న పుస్తకం ఇది.
‘కన్నులలో లేమి ముల్లు గుచ్చుతున్నదా… వెన్నెల ఆకాశమంత మండుతున్నదా’ అనే సుకుమార వాక్యాలు ఎన్నో ఈ పుస్తకంలో వున్నాయి. పాటకు వెన్నెల వన్నెలద్దిన అనుభూతి రాగాలతో, విప్లవ భావాలతో, ఆగడపు చీకట్లను తరిమే కాగడాలతో పయనించే ఉద్యమ బాటకు ఈ పాటలు బాసటవుతాయి. పాటల అల్లికలో కూడా తనదైన శైలితో ఈ ఉద్యమ గీతాలు వెలువడుతున్న సందర్భంగా విప్లవ శుభాకాంక్షలు.
– గోరటి వెంకన్న
శ్రమ జీవన సౌందర్య గీతాలు
- Advertisement -
- Advertisement -



