మౌలిక వసతుల ప్రాజెక్టులకు పీఎఫ్ నిధులు
పీఎఫ్‌ఆర్‌డీఏ యోచన
కార్పొరేట్ల పెట్టుబడులకు మద్దతు
న్యూఢిల్లీ : ఉద్యోగులు, కార్మికులు తమ భవిష్యత్తు భద్రత కోసం దాచుకునే ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్)ను కేంద్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించే పనిలో పడిందని తెలుస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నిధులను మౌలిక వసతుల రంగంలోని ప్రాజెక్టులకు అందిచడానికి కసరత్తు జరుగుతోంది. పీఎఫ్ నిధులను ప్రత్యక్షంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు అందించే యోచనలో ఉన్నామని పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మెన్ శివసుబ్రమణియ్యన్ రామన్ ఓ ఆంగ్ల పత్రికతో వెల్లడించారు.
పెట్టుబడి మార్గాలను విస్తరించడం, ఖాతాదారులకు దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందించడమే లక్ష్యంగా ఆలోచిస్తోన్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల రంగానికి దీర్ఘకాలిక నిధులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది ప్రాజెక్టులకు బ్యాంకులు ఇచ్చే రుణాలకు అదనపు తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో పీఎఫ్‌లోని దాదాపు రూ.16 లక్షల కోట్ల సొమ్ముపై కార్పొరేట్ల దృష్టి పడిందని స్పష్టమవుతోంది.
అదానీ కోసమేగా..!
రహదారులు, ఓడరేవులు, విమానశ్రయాలు, విద్యుత్, స్మార్ట్‌సిటీలు, పట్టణ సదుపాయాలు తదితర ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కిందకి వస్తాయి. ప్రస్తుతం ఈ రంగంలో అదానీ గ్రూపు భారీ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆ సంస్థ అత్యంత కీలక ప్రాజెక్టులను కలిగి ఉంది. పెన్షన్ నిధులు మౌలిక ప్రాజెక్టులకు మళ్ళించడమంటే ఇది అదాని గ్రూపు కోసం చేస్తోన్న ఎత్తుగడ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తోన్నారు.
ప్రస్తుతం పెన్షన్ ఫండ్‌లను కేవలం ‘ఇన్విట్స్ ద్వారా మాత్రమే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ భవిష్యత్తులో నేరుగా ప్రాజెక్టులలోనే పెట్టుబడుల వ్యయం చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కొత్త పెట్టుబడి మార్గాలను దశలవారీగా ఎలా ప్రవేశపెట్టాలనే దానిపై అధ్యయనం చేయడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ ఒక నిపుణుల కమిటీని నియమించనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ బాండ్ల ద్వారా వచ్చే రాబడి తక్కువగా ఉండటం, స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వల్ల మౌలిక వసతుల రంగ ప్రాజెక్టుల్లో దీర్ఘకాలికంగా కనీసం 10 శాతం సగటు రాబడిని అంచనా వేస్తోన్నామని రామన్ తెలిపారు.
నౌకాశ్రయాలతోనే ప్రారంభం..
భద్రతను దృష్టిలో ఉంచుకు, ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా, దశలవారీగా అమల్లోకి తీసుకురానున్నామని రామన్ తెలిపారు. ప్రాథమికంగా బ్యాంకులతో కలిసి ఉమ్మడిగా నౌకాశ్రయాలు వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 2025 నవంబర్ నాటికి ఎన్‌పీఎస్‌లో రూ.16 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, సామాన్యులు దాచుకున్న ఈ సొమ్ముపై కార్పొరేట్ల కన్ను పడిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తోన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా నిధులు పెట్టడం ద్వారా అవి దివాలా తీస్తే పెన్షన్‌దారుల సొమ్ము అభివృద్ధి పేరిట పక్కదారికి మళ్లనున్నది. దేశంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ రూ.91వేల కోట్ల అప్పులతో దివాలా తీసిన విషయం తెలిసిందే. ఐవీఆర్‌సీఎల్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జేపీ ఇన్‌ఫ్రాటెక్ తదితర కంపెనీలు మౌలిక వసతుల ఏర్పాటు పేరుతో బ్యాంక్‌ల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఆ తర్వాత బోర్డులు తిప్పేసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష పెట్టుబడులపై పీఎఫ్‌ఆర్‌డీఏ విధానాలు ఎలా ఉండబోతోన్నాయో వేచి చూడాలి..!.



