Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్చేతబడి నెపంతో కన్నతల్లికి చిత్రహింసలు

చేతబడి నెపంతో కన్నతల్లికి చిత్రహింసలు

- Advertisement -

– గదిలో బంధించిన కోడలు, మనవడు
– పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి..
– కోదాడ పట్టణంలో అమానవీయ ఘటన
నవతెలంగాణ- కోదాడ టౌన్‌

నవమాసాలు మోసి.. పెంచి పెద్దచేసి.. ఉన్న ఆస్తిని అమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకి అప్పగిస్తే.. ఆ తల్లిని కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు కలిసి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన ముక్కన శ్రీనివాసరెడ్డి పదేండ్ల కిందట కోదాడలో స్థిరపడి ఖమ్మం జిల్లా ముదిగొండలో గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రిటైర్‌ కావడంతో తండ్రి, తల్లి అన్నపూర్ణమ్మ తమ సొంత గ్రామంలో ఆస్తులను అమ్మి రూ.2కోట్లతో కోదాడలో కొడుకుకు రెండంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు. రెండేండ్ల కిందట భర్త మృతిచెందడంతో అన్నపూర్ణమ్మ కొడుకు దగ్గరికి వచ్చింది. అయితే, తన కుటుంబానికి తల్లి అన్నపూర్ణమ్మ చేతబడి చేయించిందని శ్రీనివాసరెడ్డి కుటుంబం పది నెలల నుంచి ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. ప్రతిరోజూ కిటికీ నుంచి అన్నం పెట్టేవారు. ఈ పరిస్థితిలో శనివారం ఇంటి గది కిటికీ నుంచి బయటకు కేకలు వినపడటంతో స్థానికులు గమనించారు. తీరా వెళ్లి చూడగా అన్నపూర్ణమ్మ తన పరిస్థితిని వారిని వివరించింది. ప్రతిరోజూ కొడుకు కుటుంబం మొత్తం చిత్రహింసలు పెడుతున్నారని, తనను రక్షించమని వేడుకుంది. దాంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వారందరిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నపూర్ణమ్మను బయటకు తీసుకొచ్చారు. అనంతరం తాను చేతబడి చేశానని పది నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారని, తనకు వచ్చే రూ.38 వేల పెన్షన్‌ వాళ్లే తీసుకుంటున్నారని విలేకర్ల ఎదుట వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -