Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం

ప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాం

- Advertisement -

నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయరహస్యం : ఫెలోస్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నేను డాక్టర్‌ను కాదు.. కానీ, సోషల్‌ డాక్టర్‌ను. తెలంగాణలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. హైదరాబాద్‌ లో ఫెలోస్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ జరగడం సంతోషం. ఆగేయాసియా దేశాల నుంచి 500 మందికిపైగా వచ్చిన యువ కార్డియాలజిస్టులందరికీ స్వాగతం. మీరంతా సక్సెస్‌ ఫుల్‌ కార్డియాలజిస్టులు. అయినా, మీ నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌ గ్రేడ్‌ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఇక్కడకొచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం హోటల్‌ హెచ్‌ఐసీసీలో ఫెలోస్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌ లో జరగడం ఎంతో గర్వకారణమన్నారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, హెల్త్‌ కేర్‌ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక గ్రూపునకు చెందినవారనీ, ప్రాణాలు కాపాడుతారని మేం బలంగా నమ్ముతామని చెప్పారు.

మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని డాక్టర్లకు సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వ పాలసీని మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయనీ, క్వాంటం కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ముందుకెళ్తున్నదని చెప్పారు. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఆర్‌ ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడొచ్చనీ, దానిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కోరారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనమందరం భాగస్వాములం అవుదామన్నారు. ఆరోగ్య సంరక్షణలో మన దేశం వరల్డ్‌ బెస్ట్‌ అవ్వాలనీ, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -