వాహనాల డైవర్షన్ బోర్డులను గమనించాలి : సూర్యాపేట ఎస్పీ నర్సింహ
నవతెలంగాణ-సూర్యాపేట
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనాల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను సూర్యాపేట వద్ద పోలీసులు డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఎస్పీ నరసింహ సూచించారు. జాతీయ రహదారి 65పై శనివారం సూర్యాపేట పట్టణ పరిధి ఎఫ్‌సీఐ గోదాం వద్ద వాహనాల రద్దీని ఎస్పీ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రోన్ కెమెరాతో రహదారిపై వాహనాల వేగాన్ని, రద్దీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధికవేగం, నిద్రమత్తులో వాహనాలు నడపొద్దని సూచించారు. వాహనాలు కండిషన్‌లో ఉండాలని, చలి ప్రభావం, పొగమంచు ఉంటుందని, రాత్రి సమయంలో ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తత అవసరమని చెప్పారు. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100కు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు.
రోడ్డు ప్రక్కన ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపొద్దని, భారీ వాహనాలు ఒక క్రమంలో వెళ్లాలని ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పారు. జిల్లా పరిధిలో జాతీయ రహదారి 65పై విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతున్నందున అవసరమైన చోట పోలీసు డైవర్షన్స్, గమనిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవారు నార్కట్‌పల్లి, మిర్యాలగూడ మీదుగా వెళ్లాలని తెలిపారు. రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లేవారు నకిరేకల్ వద్ద జాతీయ రహదారి నుంచి మళ్లించి అర్వపల్లి, బంగ్లా, ఖమ్మం మీదుగా వెళ్లాలని సూచించారు. రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద ఖమ్మం వైపు మళ్లించామని తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి సూర్యాపేట పట్టణం మార్గంలోకి మళ్లించి సూర్యాపేట పట్టణం మీదుగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని వివరించారు. జాతీయ రహదారి వెంట గల గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
హైవేపై డ్రోన్ కెమెరాతో నిఘా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



