జర్నలిజానికి వన్నెతెచ్చే జర్నలిస్టులకు అండ
జీవో 252లో మార్పులు చేస్తాం : సమాచార, రెవన్యూ శాఖమంత్రి పొంగులేటి
జర్నలిస్టుల సంఘాల భేటీలో హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జీవో 252 పై 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. అన్నీంటిని పరిశీలించి జీవో 252లో మార్పులు చేస్తామని హామీనిచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతలో ఉన్న సుమారు 23 వేల అక్రిడిటేషన్ కార్డుల కంటే ఎక్కువే ఉంటుందన్నారు. దేశంలోనే అక్రిడిటేషన్కార్డుల జారీలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డులు తేడా లేదన్నారు.
పాత్రికేయ వ్యవస్థను గాడీలో పెట్టేందుకే ప్రభుత్వపరంగా సర్క్యులేషన్, ఇతర వివరాలను కచ్చితంగా సేకరిస్తామన్నారు. సీఏ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తామన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామన్నారు. క్రీడా సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల పాత్రికేయులకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పలువురు జర్నలిస్టు సంఘాలు ఇండ్లస్థలాలు, పెన్షన్, బస్‌పాసులు, బీమా తదితర అంశాలను ప్రస్తావించగా, మంత్రి పొంగులేటి అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్వో గుర్రం మల్పూర్, సమాచార శాఖ జెడీ జగన్, ఏడీ యామిని తోపాటు జర్నలిస్టు సంఘాల నాయకులు అల్లం నారాయణ, బి.బసవ పున్నయ్య, విరాహత్ అలీ, కెఎన్.హరి, మారుతిసాగర్, రాం నారాయణ, తాటికొండ కృష్ణ, శ్రీనివాస్, మస్తాన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరించండి : మంత్రికి ఫెడరేషన్ విజ్ఞప్తి
జర్నలిస్టు సంఘాల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇండ్లస్థలాల సమస్యను ప్రస్తావించారు. ఏండ్ల తరబడి ఇండ్లస్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కొత్త విధానం తీసుకొచ్చి జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు. ఇది సున్నిత సమస్యగా మారిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఇండ్లస్థలాలు కేటాయించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అడ్డంకులు లేని విధానాన్ని తీసుకొస్తామన్నారు. తాము ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చిస్తున్నామని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సమస్య మళ్లీ మొదటికొచ్చిందన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.



