బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రాల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. కానీ ఆ సామరస్యం తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తుంటే, మాజీలు చిచ్చు పెడుతున్నారని ఆంధ్రా నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఒకవైపు నల్లమల సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామంటూ ఏకపక్ష ప్రకటనలు చేస్తూ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్టులకు అడ్డుతగులుతూ కేంద్రానికి లేఖలు రాయడం ఏ రకమైన సామరస్యమని ప్రశ్నించారు.
ముసుగులో గుద్దులాట సాగిస్తూ ‘సామరస్య మంత్రం’ పఠిస్తే అది నిజమైన స్నేహం అనిపించుకోదని తెలిపారు. అది కేవలం కాలయాపన, కంటితుడుపు చర్య మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలను అక్షరాలా పాటించాలని సూచించారు. అప్పర్ రిపేరియన్, లోయర్ రిపేరియన్ హక్కుల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిపై స్పష్టమైన హామీ ఉండాలని తెలిపారు. చర్చల పేరుతో కాలం గడుపుతూ, క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు.
సామరస్యం పేరుతో తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



