Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహిళా కలెక్టర్‌పై అసత్య ప్రచారం.. భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

మహిళా కలెక్టర్‌పై అసత్య ప్రచారం.. భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

- Advertisement -

– ప్రముఖ న్యూస్ ఛానల్ లో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారం, బాధ్యతారాహిత్యం: జిల్లా ఉద్యోగ సంఘాల ఆగ్రహం
– తక్షణమే వార్తను ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్

– లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ _సిటీ బ్యూరో

హైదరాబాద్ జిల్లా మహిళా కలెక్టర్‌ను ఉద్దేశించి ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఇటీవల ప్రసారమైన కథనంపై హైదరాబాద్ జిల్లా రెవిన్యూ శాఖ సహా అన్ని శాఖల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనదని పేర్కొంటూ ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఈ సందర్భంగా జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వాస్తవాలకు విరుద్ధంగా ప్రసారమైన సదరు వార్త, ఒక బాధ్యతాయుతమైన మహిళా ఉన్నతాధికారి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని, పరిపాలనా నిబద్ధతను ప్రశ్నించే రీతిలో ఉండడమే కాకుండా, మొత్తం పరిపాలనా వ్యవస్థకు, ముఖ్యంగా మహిళా అధికారులకు అవమానకరంగా ఉందని మండిపడ్డారు.

ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా సంస్థ, కనీస ధృవీకరణ లేకుండా, ఆధారాలు లేకుండా వార్తలను ప్రసారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని వారు పేర్కొన్నారు. ఇటువంటి కథనాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తమ విధులను అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని అధికారులు, ఉద్యోగులు కొనియాడారు.

అల్టిమేటం: ఈ వ్యవహారంపై ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రసారం చేసిన అసత్య వార్తను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు, జిల్లా కలెక్టర్‌కు న్యూస్ ఛానల్ యాజమాన్యం బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశాయి.

భవిష్యత్తులో ఇటువంటి బాధ్యతారహిత వార్తలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో న్యాయపరమైన, ప్రజాస్వామ్యపరమైన చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమని జిల్లా రెవిన్యూ శాఖ, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -