నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు సుమారు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 బస్సులతో పాటు హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.