Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండుగలకు ఊరేళ్తున్నారా.! ఈ జాగ్రత్తలు పాటించండి

పండుగలకు ఊరేళ్తున్నారా.! ఈ జాగ్రత్తలు పాటించండి

- Advertisement -

-మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్
నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు మండల ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు చోరీలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సంక్రాంతికి ఊరెళ్లే వారికి నెల్లికుదురు మండల  పోలీసుల సూచనలు. జిల్లాలోని కాలనీలు, ఇళ్లు, షాపులు, అపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో లేని సమయంలో నమ్మకమైన ఇరుగు–పొరుగు వారిని ఇంటిని గమనించమని చెప్పాలి. విలువైన వస్తువులను ద్విచక్ర వాహనాల డిక్కీలు లేదా కార్లలో వదిలివేయరాదు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా మీతో పాటు తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.  గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉంది.

ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగించి ఉంచడం మంచిది. ఇంటి ముందు చెత్త, పత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువులు, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ తప్పనిసరిగా వేయాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో   భద్రపరచుకోవడం ఉత్తమం. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ లేదా నాణ్యమైన సెక్యూరిటీ లాక్ వాడాలి. సీసీ కెమెరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించాలి, డీవీఆర్‌ను రహస్య ప్రదేశంలో ఉంచాలి.

 హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా చూడవచ్చు. దృఢమైన తలుపులు, నాణ్యమైన గ్రిల్స్‌తో రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలి. కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ప్రజలు పోలీస్ గస్తీకి సహకరించాలి, బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర ఉంచుకోవాలి. అనుమానితుల కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. నమ్మకమైన వాచ్‌మెన్ / సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి.

 కాలనీవాళ్లు కమిటీలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేసుకోవాలి. అపార్టుమెంట్లలో కొత్తవారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. సోషల్ మీడియాలో మీ ప్రయాణ వివరాలు షేర్ చేయకపోవడం మంచిది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్‌ను పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. అనుమానాస్పద కదలికలపై డయల్ 100 లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -